తీరంలో మత్స్యకారులు
సాక్షి, పిఠాపురం : ‘అధికారంలోకి వస్తే మేం అడిగిందల్లా ఇస్తానన్నారు. నన్ను నమ్మండంటూ కన్నీరెట్టుకున్నారు. తీరా గెలిపిస్తే మేమెవరో కూడా తెలీదన్నట్టు చూస్తున్నారు. మా బతుకులకు ఆసరా ఇచ్చే హార్బర్ కట్టడం లేదు. మాకు జెట్టీలు కట్టండి. అంతకంటే రెట్టింపు ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇస్తాం. వేటాడిన చేపల్ని ఎండబెట్టడానికి చోటులేదు. నిల్వ చేసుకుందామంటే గిడ్డంగులు లేవు. అమ్ముకుందామంటే కొనేవారు రారు. ఐస్ నుంచి రవాణా దాకా అన్నీ దోపిడీలే. ఇలా ఉంటే మేం బతికేదెట్టా. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను సముద్రంలో కలిపేశారు’ ఇదీ గంగపుత్రుల ఆవేదన.
తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కోనపాపపేట సాగర తీరంలో మత్స్యకారులను పలకరించగా.. వారి ఈతి బాధల్ని ఏకరువు పెట్టారు. రాష్ట్రంలోని తూర్పుతీర జాలర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. వారికి 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకున్నారు. ‘వేట నిషేధ సమయంలో చెల్లించాల్సిన పరిహారం ఇవ్వటం లేదు. మత్స్యకారుడు చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుందో.. రాదో తెలీదు. కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ చేయటం లేదు. అంటూ తమ మనోగతాన్ని వెల్లడించారు. వాళ్లేమన్నారంటే..
పరిహారమేదీ!
వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోం ది. ఒక్కొక్కరికీ రూ.4 వేల చొప్పున నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటివరకు కొంత మందికి మాత్రమే పరిహారం పంపిణీ చేశారు. లబ్ధి పొందిన వారిలో అధికార పార్టీ నేతల అనుచరులు, పలుకుబడి కలిగిన వారు మాత్రమే ఉన్నారు. నిజంగా వేట సాగించే వారికి మొండిచేయి చూపుతున్నారు.
– దూడా తాతారావు, మత్స్యకారుడు
మినీ హార్బర్ సంగతేంటి?!
తీరప్రాంతాల్లో జెట్టీలు లేక మత్స్యకారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉప్పాడ సమీపంలో మినీహార్బర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రూ.50 కోట్లు విడుదల చేశారు. 50 ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన మృతితో నిర్మాణం నిలిచిపోయింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మినీహార్బర్ నిర్మాణానికి హామీ ఇచ్చారు తప్ప నిర్మాణం చేయలేదు.
– సిద్ధా రమణ, మత్స్యకారుడు
పెద్దాయన చొరవతో..
మెకనైజ్డ్ బోటుకు వెయ్యి లీటర్లు, ఫైబరు బోటుకు 100 లీటర్ల చొప్పున డీజిల్‌పై సబ్సిడీ ఇచ్చేందుకు 2002లో చర్యలు తీసుకున్నారు. సీఎంగా వైఎస్సార్ అధికారం చేపట్టాక.. 2004లో ఆ సబ్సిడీని మెకనైజ్డ్ బోటుకు 3 వేల లీటర్లు, ఫైబరు బోట్లకు 300 లీటర్లకు పెంచారు. లీటరు రూ.15 ఉన్నప్పుడు ప్రకటించిన సబ్సిడీనే కొనసాగిస్తున్నారు. డీజిల్ సబ్సిడీ పెంచుతామన్న చంద్రబాబు పెంచలేదు.
– గంపల దేవుడు, మత్స్యకార నాయకుడు
కష్టాల్లో ఆదుకోవడం లేదు
సంప్రదాయ వేట సాగించి బతికే సామాన్య మత్స్య కారులకు ఏమీ ఒరగటం లేదు. కష్టాల్లో మమ్మల్ని ఆదుకునే వారే లేరు. అన్ని పథకాలు అనర్హులైన అధికార పార్టీ నేతల అనుచరులకే ఇస్తున్నారు. ఏ పూటకాపూట కడుపునింపుకునే మాకు రెండు నెలలు పూట గడవక పస్తులుంటున్నాం. కష్టాల్లో మమ్మల్ని ఆదుకునే వారే లేరు.
– కొప్పిరి బుజ్జి, మత్స్యకారుడు
గల్లంతైతే అంతే..
సముద్రంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం వాళ్ల కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుంటాయి. మాకు తెలిసి ఇప్పటివరకు 25 మంది మత్స్యకారులు గల్లంతై ఏళ్లు గడుస్తున్నా ఆచూకీ లేదు. సుబ్బంపేటకు చెందిన ఏడుగురు వేటకు వెళ్లి 11 ఏళ్ల క్రితం గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వాళ్ల కోసం కుటుంబ సభ్యులు ఇంకా వేచి చూస్తున్నారు. వారికి ఇన్సూరెన్స్ ఇవ్వలేదు.
– మైలపల్లి దాసు, బోటు యజమాని
వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు
నిత్యం ప్రమాదాల నడుమ జీవనం సాగించే మా కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏదైనా ప్రమాదం సంభవించి కుటుంబ యజమాని మరణిస్తే.. ప్రస్తుతం రూ.2 లక్షల బీమా ఇస్తున్నారు. అదికూడా టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే ఇస్తున్నారు. అలాంటిది బీమాను రూ.10 లక్షలకు పెంచుతామని జగన్ ప్రకటించడం ఆనందదాయకం.
– కోడ సుబ్బారావు, మత్స్యకారుడు
Comments
Please login to add a commentAdd a comment