మత్స్యకారులకు బాబు.. మోసం.. | Chandrababu Cheat To The Fisherman People In AP | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు బాబు.. మోసం..

Published Mon, Apr 8 2019 10:54 AM | Last Updated on Mon, Apr 8 2019 10:59 AM

Chandrababu Cheat To The Fisherman People In AP

చంద్రబాబు మోసానికి.. దగాకు బ్రాండ్‌ అంబాసిడర్‌. గత ఎన్నికలకు ముందు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను ఐదేళ్లుగా వంచించారు. ఏటా వేట విరామ సమయంలో రూ.4 వేల జీవన భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు విధివిధానాల ఖరారు పేరుతో తొలి ఏడాది కాలక్షేపం చేశారు. ఆ తర్వాత రెండేళ్లు లబ్ధిదారుల ఎంపికలో అనేక కొర్రీలు పెట్టి.. అరకొర మందినే ఎంపిక చేశారు. వారికి కూడా భృతి ఇవ్వలేదు. గత రెండేళ్లుగా అసలు ఎంపికలు, భృతి చెల్లింపులే లేవు. తాజాగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో మత్స్యకారులకు ప్రకటించిన ప్రణాళికనే కాపీ కొట్టి చంద్రబాబు మరో సారి మోసపూరిత హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఐదేళ్లుగా చంద్రబాబు మోసానికి గురైన మత్స్యకారులు ‘నిన్ను నమ్మం బాబూ’ అంటున్నారు.

వాకాడు: అలల సాగరంలో పోరాడి గాలించి చేపలు పట్టడమే మత్స్యకారుల యాంత్రిక జీవనం. వేటే జీవనాధారమైన మత్స్యకారులు ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ తీరు కారణంగా పట్టెడు మెతుకులకు గంగపుత్రులు అలల్లాడుతున్నారు. ప్రాణాను పణంగా పెట్టి బతుకుదెరువు కోసం నిత్యం కడలిపై సమరం చేస్తున్నారు. ఒకప్పుడు గంగపుత్రులంటే.. లక్ష్మీపుత్రులుగా పేరుండేది. కొన్నేళ్లుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంతో పాటు, తీరప్రాంతంలో విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి.  పరిశ్రమల వ్యర్థాలు సముద్ర జలాల్లోకి విడుదల చేయడంతో తీరం వెంబడి జల కాలుష్యం పెరిగిపోయింది. వీటి ప్రభావంగా మత్స్య సంపద మనుగడకు ప్రమాదంగా మారింది. ఇది అంతిమంగా మత్స్యకారుల బతుకుదెరువుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

సముద్రంలో ఆటుపోటులు, అల్పపీడనాలు, వాయిగుండాలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు, మత్స్య సంపద పునరుత్పత్తి వంటి కారణాలతో చేపల వేట రోజులు తగ్గిపోయాయి. అన్ని పరిస్థితులు బాగున్నా.. నానాటికి తగ్గిపోతున్న మత్స్య సంపద తగ్గిపోవడంతో రోజంతా గాలించినా.. చేపలు చేతికి చిక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం లేక మత్స్యకారులు ప్రత్యామ్నాయంగా కూలి పనులు వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు సముద్రంలో వేట తప్ప వేరే పని లేని మత్స్యకారులు ఇప్పుడు రైతు కూలీలుగా, బేల్దారీ పనులకు కూలీలుగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఏ పని చేతకాక సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు.

చంద్రబాబు మోసం ఇలా..  
మత్స్య సంపద పునరుత్పత్తి కాలంగా ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు వేట విరామాన్ని అమలు పరుస్తున్నారు. గతంలో ఈ సమయంలో అదనంగా బియ్యం మాత్రమే ఇచ్చేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో వేట విరామ సమయంలో రూ.2 వేల ఇచ్చేవారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు అంతే మొత్తాన్ని ఇచ్చేవారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేట విరామ సమయలో రూ.4 వేల జీవన భృతి ఇస్తామని ప్రకటించారు. దీన్నే కాపీ కొట్టిన చంద్రబాబు తాను కూడా అంతే మొత్తం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. జిల్లాలో 13 సముద్ర ముఖద్వారాల నుంచి వేట సాగించే కుటుంబాలు 1.25 లక్షలు ఉన్నాయి. వీరందరికి రూ.4 వేల వంతున ఏటా జీవన భృతి ఇవ్వాల్సి ఉంది.

అయితే చంద్రబాబు సీఎం అయిన తొలి ఏడాది విధివిధానాల పేరుతో కాలక్షేపం చేశారు. 2015, 2016 సంవత్సరాల్లో లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు పెట్టి ఆఖరికి 70 వేల మందిని ఎంపిక చేశారు. వీరికి కూడా అరకొర మందికే వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రాలేదని మత్స్యశాఖ అధికారుల చుట్టూ తిరుగుతుంటే.. ఇదిగో అదిగో అంటూ చెబుతున్నారు. చివరిగా 2017, 2018 సంవత్సరాల్లో  అసలు లబ్ధిదారుల ఎంపిక చేసినా.. జీవన భృతి నిధులు కేటాయించనే లేదు. తాజాగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొట్టి వేట విరామ సమయంలో రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి ఆ తర్వాత మోసం చేసే నిన్ను నమ్మం బాబూ అంటున్నారు.

వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టో హామీతో మత్స్యకారులకు లబ్ధి 

కావలి నుంచి తడ వరకు 12 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. కావలి, అల్లూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, వాకాడు, కోట, సూళ్లూరుపేట, తడ మండలాలు ఉన్నాయి. అందులో 113 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 సముద్రపు ముఖ ద్వారాల నుంచి సముద్రంపై వేట చేసే మత్స్యకారులు 1.25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వేట విరామం భృతిని మత్స్యకారులకు అందజేయడంలో వివిధ ఆంక్షలు, కొర్రీలు పెడుతుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లాలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఏటా వేట విరామ సమయంలో రూ.10 వేల జీవన భృతి కల్పిస్తానని మేనిఫెస్టోలో ప్రకటించారు. బోట్లు లేని వారికి కొత్త బోట్లు, ఫ్రీ రిజిస్ట్రేషన్, మత్స్యకార కార్పొరేషన్‌ వంటివి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేట సాగించే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement