మత్స్యకారులు ‘మాయం’ | opinion on fisher families in Andhrapradesh by B Tiluasidas | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు ‘మాయం’

Published Wed, Apr 20 2016 9:08 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

మత్స్యకారులు ‘మాయం’ - Sakshi

మత్స్యకారులు ‘మాయం’

దేశంలో, రాష్ట్రాల్లో ఏడాదికేడాది జనాభా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని మత్స్యకారుల సంఖ్యను ఏడాదికేడాది తగ్గించి చూపిస్తోంది. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే కాలంలో చేపల వేట వల్ల పునరుత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం ఆ సమ యంలో వేటను నిషేధించింది. తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు, పశ్చిమ తీరంలో జూన్ 1 నుంచి జూలై 13 వరకు (61రోజులపాటు) మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లతో చేపల వేటను నిషేధించారు.

చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య 86,948 అని జీవో ఇచ్చిన సర్కారు, ఈ ఏడాది వారి సంఖ్యను ఏకంగా 60 వేలకు కుదించేసింది. రాష్ట్రంలోని 9 జిల్లాలలో 2,16,639 మంది సముద్ర చేపలు, రొయ్యలు పట్టే పనిలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ 2014 గణాంక దర్శిని పేర్కొంది. ఇది వేటకు వెళ్లే వారి సంఖ్య మాత్రమే. రవాణా, శీతలీకరణ, మార్కెటింగ్ తదితర ఇతర అనుబంధ సేవలను అందించేవారిని, వారి కుటుంబ సభ్యులను కూడా లెక్కిస్తే నిషేధం మూలంగా రాష్ట్రంలో పది నుంచి  పదిహేను లక్షల మంది జీవితాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమౌతాయి. వారందరినీ ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత.

పడవ లోపలే దాన్ని నడపడానికి, వలను లాగడానికి ఉపయోగపడే ఇంజిన్‌ను ఏర్పాటు చేసిన వాటిని మెకనైజ్డ్ బోట్లనీ, పడవను నడపడానికి తాత్కాలికంగా దాని బయట బిగించిన వాటిని మోటరైజ్డ్ బోట్లనీ అంటారు. సాధారణ పడవలతో తప్ప ఈ రెండు రకాల బోట్లతో సాగించే చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 28.3.2016న జీవో నం.72ను జారీ చేసింది. కానీ అందువల్ల ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికిచ్చే సహాయానికి సంబంధించిన జీవో ఇంకా రాలేదు. గత ఏడాది ఈ విషయానికి సంబంధించిన జీవో 156ను నిషేధం ముగిసిన మూడు రోజుల తరువాత (17.6.2015) తీరికగా విడుదల చేశారు.

నిషేధం అమల్లోకివచ్చి పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం సంబంధిత జీవోను (నం. 77) వేట నిషేధం అమలుకు రెండు రోజుల ముందే విడుదల చేసింది. కాగా, ‘పనిచేసే’ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఇంత చురుగ్గా పనిచేస్తుందన్న మాట! వేట నిషేధం వల్ల 61 రోజులపాటు ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇస్తామన్న సహాయం రూ. 4,000 మాత్రమే. పుదుచ్చేరి ప్రభుత్వం గత ఏడాది ప్రతి మత్స్యకారునికి రూ. 5,000 ఆర్థిక సహాయంతో పాటూ 45 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లాను ఆనుకుని ఉన్న యానాం మత్స్యకారులు ఆ సహాయం పొందుతుంటే, ఏపీ  మత్స్యకారులు రూ.4,000తోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. వీరికి బియ్యం కూడా రావు. ఎన్నో విషయాలలో ఇతర రాష్ట్రాలతో పోలిక తెచ్చే ప్రభుత్వాధినేతలకు పుదుచ్చేరికి తగ్గకుండా సహాయం అందించాలనైనా ఎందుకు ఆలోచించడం లేదు?
 
కేంద్ర  ప్రభుత్వ మెరైన్ ఫిషరీస్ సెన్సస్ 2010 ప్రకారం రాష్ట్రంలో 3,167 మెకనైజ్డ్ బోట్లు, 10,737 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో అవి గణనీయంగా పెరిగే ఉంటాయి తప్ప, తరగవు. నాటి లెక్కనే పరిగణించినా (3,167 * 8 + 10,737 * 6)  2015లో కనీసం 89,758 మందికి సహా యం అందించాలి. కానీ 86,949 మందికే  సహాయం అందజేస్తామని (జీవో 156) ప్రకటించారు. ఈ ఏడాది మరీ విచిత్రంగా సహాయం అందించే మత్స్యకారుల సంఖ్యను 60 వేలకు తగ్గించేశారు! ఈ బడ్జెట్‌లో పశుసంవర్థక, మత్స్య శాఖల పద్దులో 60 వేలమంది మత్స్యకారులకు రూ.24 కోట్లు సహాయం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంటే గత ఏడాది ఉన్న వారిలో సుమారు 27 వేల మంది మత్స్యకారులు మాయమైపోయారా? చేపల వేటను వదిలేసి వేరే వృత్తులకు మళ్లిపోయారా? రాష్ట్ర ప్రభుత్వమే సహాయాన్ని తగ్గించడం కోసం మత్స్యకారుల సంఖ్యను కుదించేసిందా?

జీవో 156కు అనుబంధంగా ఇచ్చిన మార్గదర్శకాలు మరీ అన్యాయంగా ఉన్నాయి. మత్స్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న మోటరైజ్డ్ బోటుకు ఆరుగురు, మెకనైజ్డ్ బోటుకు ఎనిమిది మందికి మించకుండా సహాయం అందిస్తామన్నారు. వాస్తవానికి ఈ బోట్లపై పది నుండి 15 మంది వరకూ వేటకెళ్తారు. అందరికీ తెల్లకార్డు ఉండి తీరాలని చెబుతూనే, ఒక కార్డుపై ఒక్కరికి మాత్రమే సహాయం చెల్లిస్తామన్నారు. అంటే ఒక కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములు చేపల వేటకు వెళ్ళినా వారిలో ఒకరికి మాత్రమే సహాయం చెల్లిస్తారు. ఈ సహాయం పొందడానికి ప్రతి మత్స్యకారునికి తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ వుండాల్సిందే. ఆధార్ సీడింగ్‌తో ఆ అకౌంట్‌కు నగదును బదిలీ చేస్తారట. మార్గదర్శకాల పేరిట విషమ షరతులు పెట్టి, వేటపై నిషేధం వల్ల జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు ఇచ్చే సహాయానికి సర్కారు కత్తెర వేసింది.

ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను మరీ కుదిస్తోంది కనుక ఇంకెన్ని దుర్మార్గపు షరతులు విధిస్తుందో! రాష్ట్రంలో రెండంకెల అభివృద్ధిని సాధిస్తామని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. కరువు, అతివృష్టి కారణంగా వ్యవసాయం దెబ్బతిన్నప్పటికీ మత్స్యరంగంలో అభివృద్ధి కారణంగానే జీడీపీ వృద్ధి రేటులో పెరుగుదల సాధ్యమైందని ఆయనే అన్నారు. కానీ ప్రాణాలకు తెగించి మత్స్య సంపదను సముద్ర గర్భం నుంచి వెలికితీసే ఆ మత్స్యకారుల పట్లనే ఆయన శీతకన్ను వేస్తున్నారని అంటే అది అపనింద కాదు కదా!
 (వ్యాసకర్త: బి.తులసీదాస్  ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement