వడి వడిగా నీలివిప్లవం దిశగా..! | Opinion Article on Ports Development In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వడి వడిగా నీలివిప్లవం దిశగా..!

Published Sat, Jun 17 2023 12:12 AM | Last Updated on Sat, Jun 17 2023 12:12 AM

Opinion Article on Ports Development In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమైన సహజ వనరు లకు నిలయం. ప్రపంచంలోని  చిన్న దేశాలైన సింగపూర్, మలేసియా, మారి షస్, ఐరోపా దేశాలు గొప్పగా అభి
వృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఆ దేశాల్లో ఉన్న సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడమే. ఆయా దేశాల స్థూల ఉత్పత్తిలో(జీడీపీ) దాదాపు 35 శాతం ఈ వనరుల ద్వారానే వస్తుంది. అలాంటి గొప్ప అవకాశం మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉంది. 2019లో అధికారం చేపట్టిన జగన్‌ మోహన్‌ రెడ్డి మన సముద్ర తీర వనరులను వినియోగించుకొని నీలి విప్లవం సృష్టించడానికి శ్రీకారం చుట్టారు.

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ 2వ అతి పెద్ద తీర రేఖ కలిగిన రాష్ట్రం. ఎన్నో పోర్టులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీన్ని గమ నించే జగన్‌ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతుల విధానం 2022– 2027’ ప్రకారం అద్భుతమైన మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతీ తీర రేఖ కలిగిన జిల్లాలో ఎగుమతుల హబ్‌ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర పరిశ్రమల విధానాల్లో సైతం ‘బ్లూ ఎకానమీ’కి సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో సైతం బ్లూ ఎకానమీ పెట్టుబడులపై ప్రధానంగా చర్చ జరిగింది.

కేంద్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు అభివృద్ధికి సహక రిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తోంది.  మేఘవరం పోర్టు (శ్రీకాకుళం),  కాయప్ట్సీన్‌ పోర్టు (కాకినాడ), ముళ్లపేట పోర్టు  (మచిలీపట్టణం), నిజాంపట్నం, వాడరేవు లాంటి పోర్టులను రూ. 30,000 కోట్లతో నిర్మిస్తుంది. వీటి ద్వారా దాదాపు 100 మిలియన్‌ డాలర్ల ఎగుమతుల వ్యాపారం జరగబోతోంది. కడపలోని ఉక్కు, యురేనియం; నెల్లూరులో మైకా; కోస్తా జిల్లాల నుండి  అరటి, కొబ్బరి, పంచదార, పండ్లు లాంటి భారీ ఆదాయాన్ని సమకూర్చే వాటిని మన రాష్ట్రం నుండే ఎగుమతి  చేయొచ్చు. 

కేంద్రం నిర్మిస్తున్న పారిశ్రామిక కారిడార్లలో మన రాష్ట్రంగుండా మూడు వెళ్తున్నాయి. అందులో ముఖ్యమైంది విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్‌. ఈ చిన్న మధ్య తరహా పోర్టుల అభివృద్ధి వలన విదేశీ పెట్టుబడులు పెరిగి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఏపీ చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. బ్లూ ఎకానమీలో చేపల ఉత్పత్తి, ఎగుమతులు చాలా కీలకం. కేవలం చేపల ఉత్పత్తే కాకుండా దానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఐరోపా దేశాల తరహాలో ఫిషింగ్‌ లాండింగ్‌ కేంద్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 6 ఫిషింగ్‌ హార్బర్లతో వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అభివృద్ధి చేస్తుంది. దేశంలోనే మొదటిసారిగా ౖ‘వెఎస్సాఆర్‌ మత్స్యకార భరోసా’ ద్వారా ప్రతి కుటుంబానికీ మత్స్యకారులు ఎవరైనా మరణిస్తే 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. 

రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉంది. బ్లూ ఎకానమీలో  సముద్రపు ఖనిజాల వెలికితీత చాలా ముఖ్యమైన లక్ష్యం. కృష్ణ – గోదావరి బేసిన్‌లోని సహజ వాయువు, విశాఖపట్నంలో పాలి మెటాలిక్‌ నొడ్యూల్స్‌ వెలికితీతకు మంచి అవకాశాలు ఉన్నాయి.  మడ అడవుల అభివృద్ధి, సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చడం వంటి విధానాలు కూడా బ్లూ ఎకానమీలో ప్రధానం. రాష్ట్రంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. అరుదైన లోహాలు సము ద్రాల్లో లభ్యం అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వీటన్నిటినీ
దృష్టిలో పెట్టుకొని చక్కటి ప్రణాళికలను రూపొందిస్తోంది.

విద్యారంగంలో సైతం బ్లూ ఎకానమీ ద్వారా మెరైన్‌ ఇంజ నీరింగ్, షిప్‌ బిల్డింగ్, ఆఫ్‌ షోర్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్సులకు అధిక అవకాశం ఉంది. ఫిషింగ్‌ విశ్వ విద్యాలయం పూర్తయినవెంటనే ఈ రంగాల్లో విద్య అవకాశాలు విరివిగా వస్తాయి. రాష్ట్రం కర్కట రేఖ మీద ఉన్నందున మంచి సూర్యరశ్మి సముద్రంపై లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పవన విద్యుత్తును సముద్రాల్లో తయారు చేయాలని సంకల్పించింది. కేంద్రం ఇటీవల లక్షద్వీప్‌లో సముద్ర ఉష్ణ శక్తి ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అదే తరహాలో మన రాష్ట్రంలో 3 సముద్రపు ఉష్ణ శక్తిప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చక్కగా ముందుకు సాగుతోంది. వచ్చే 2030–2035 నాటికి ప్రభుత్వం తీసుకున్న విధానాల వలన రాష్ట్రంలో బ్లూ ఎకానమీ ద్వారా 10 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సుస్థిరత్వం సాధ్యం అవుతుందనేది ఒక అంచనా.


- కన్నోజు శ్రీహర్ష, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement