- సర్పంచులకు జాతీయ పతాక ఆవిష్కరణ గౌరవం దూరం
- సర్కారు నిర్ణయంపై పార్టీలకు అతీతంగా సర్పంచుల ఆవేదన
- భవిష్యత్తులో ఆందోళనకు సన్నద్ధం
‘ప్రథమ పౌరుల’కు పరాభవమే!
Published Sat, Aug 13 2016 11:33 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
స్థానిక సంస్థల్లో కీలకమైంది గ్రామ పంచాయతీ. గ్రామస్థాయిలో సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కూడా ఉంటారు. రాజ్యాంగంలో పంచాయతీలకు పెద్ద పీట వేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఒకప్పుడు పంచాయతీ సర్పంచ్‌లుగా పనిచేసిన వారే. పంచాయతీ సర్పంచ్‌నే గ్రామానికి ప్రథమ పౌరుడిగా రాజ్యాంగం పేర్కొంది. ఇదే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. గ్రామంలో ప్రథమ పౌరుడికి గౌరవం ఇవ్వాలనే సంకల్పంతో స్వాతంత్య్ర దినోత్సవం జరిగే పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే అవకాశాన్ని సర్పంచ్‌లకు కల్పించారు. ఆ రోజు పాఠశాలల్లో జెండా వందనం చేయడాన్ని సర్పంచులు ఎంతో గౌరవంగా భావిస్తూ వస్తున్నారు. అటువంటి అవకాశాన్ని తమ నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఓ జీఓతో ఊడబీకిందని సర్పంచులు మండిపడుతున్నారు. జెండా వందనంచేసే అవకాశాన్ని తమ నుంచి ఎంపీటీసీలకు కల్పించడం ద్వారా తమను తీవ్రంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జన్మభూమి
కమిటీల పెత్తనం
విభజన అనంతరం కూడా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి. అటువంటి జిల్లాలో అత్యధికంగా 1069 పంచాయతీలున్నాయి. వీటిని పరిపాలనా సౌలభ్యం కోసం 774 క్లస్టర్‌లుగా విభజించారు. ఇన్ని పంచాయతీల పరిధిలోని పాఠశాలల్లో జెండా వందనం చేసే అవకాశాన్ని తొలిసారి కోల్పోతున్నామనే బాధ సర్పంచులందరిలో కనిపిస్తోంది. అన్నింటా అగ్రగామి పంచాయతీ సర్పంచులేనని పైకి చెబుతున్న పాలకులు తీరా ఆచరణకొచ్చేసరికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవమానాలకు గురిచేయడం తగునా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలుగుతమ్ముళ్లతో జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి గ్రామాల్లో పరోక్ష పాలనను వారితో సాగిస్తోంది. గ్రామంలో ఒక సంక్షేమ పథకం మంజూరవ్వాలన్నా, నిధులు విడుదలవ్వాలన్నా జన్మభూమి కమిటీలకే సర్వాధికారాలు అప్పగించేసిందని ఇప్పటికే సర్పంచ్‌ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో జరిగే జెండా వందనానికి కూడా తమను నోచుకోకుండా విద్యాశాఖ కమిషనర్ జిల్లా విద్యాశాఖకు మెమో జారీచేయడాన్ని పలువురు గర్హిస్తున్నారు. జాతీయ పతాకావిష్కరణ గౌరవాన్ని సర్పంచులకు కాక ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు అవకాశం కల్పించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని సర్పంచులు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. దీనిపై భవిష్యత్తులో ఆందోళనకు పార్టీరహితంగా సర్పంచ్‌లు సంసిద్ధులవుతున్నారు. త్వరలో వీరంతా సమావేశమయ్యేందుకు సమాలోచనలు జరుపుతున్నారు.
‘బాబు’ జీవో సర్పంచులను అవమానించడమే
స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాఠశాలల్లో జెండా ఎగరవేయకుండా చంద్రబాబు సర్కారు జీఓ జారీ చేయడం సర్పంచులను అవమానపర్చడమే. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా దారుణం.
– పెంకే కృష్ణవేణి, సర్పంచ్, కందుల పాలెం,రామచంద్రపురం నియోజకవర్గం
Advertisement
Advertisement