15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి
⇒ ఎఫ్ఆర్బీఎంను 5 శాతానికి నిర్ధారించాలి
⇒ ఐదేళ్లు దాటినా రెవెన్యూ లోటే ఉంటుంది
⇒ ప్రయివేటు బిల్లులో ప్రతిపాదించిన వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను 15 ఏళ్ల పాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పదో భాగానికి అదనంగా పది–ఏ భాగంలో ఈ అంశాన్ని చేర్చాలని ఆయన ప్రతిపాదించారు. ఈ భాగం కింద సెక్షన్ 94ఏ, 94 బీ, 94 సీ సెక్షన్లను పొందుపర్చాలని కోరారు.
రెవెన్యూ లోటు తప్పదు..
‘14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు ఎలాంటి వ్యత్యాసం చూపకపోయినా విత్త సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాలకు అమలుచేస్తోంది. ఆ రాష్ట్రాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే వచ్చే ఐదేళ్ల తరువాత కూడా రెవెన్యూ లోటును ఎదుర్కొంటుందని 14వ ఆర్థిక సంఘం తెలిపింది. అందువల్ల ఇతర రాష్ట్రాలతో సమాన బలం చేకూరా లంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయడం తప్పనిసరి..’ అని వైవీ సుబ్బారెడ్డి బిల్లులో పేర్కొన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో చిక్కిన అవకాశం...
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గత ఏడాది జులై వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించిన ప్రయివేటు బిల్లును ఎట్టకేలకు బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రవేశపెట్టగలిగారు. వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో ప్రయివేటు మెంబరు బిజినెస్ ఎజెండాలో పలు మార్లు చోటు దక్కినా ప్రయివేటు మెంబరు బిజినెస్ రాకముందే సభ వాయిదాపడడంతో ఈ బిల్లును ప్రవేశపెట్టలేకపోయారు. ఎట్టకేలకు శుక్రవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
లక్ష్యాలు, కారణాలు ఇవీ..
ప్రయివేటు బిల్లు లక్ష్యాలు, కారణాలు అన్న శీర్షికతో బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నదీ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై చర్చ జరిగిన సందర్భంలో అప్పటి ప్రధాన మంత్రి రాజ్యసభలో పలు హామీలు ఇచ్చారు. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత పట్టణాభివృద్ధి మంత్రి ఆనాడు బిల్లు వచ్చిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రత్యేక హోదాను ఐదేళ్లపాటు వర్తింపజేయాలని కోరారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన తరువాత 10 ఏళ్లపాటు వర్తింపజేస్తామని చెప్పారు. చట్టం 2014 ఫిబ్రవరిలో ఆమోదం పొందింది. ఇప్పటికీ ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆర్థిక, మౌలిక వసతుల పరమైన వెనకబాటు తనాన్ని, ఆర్థిక లోటును పరిగణనలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతుల లేమితో ఉంది. అలాగే ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. అభివృద్ధి అవసరాలను తీర్చలేని పరిస్థితి ఉంది..’ అని పేర్కొన్నారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే..
పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని సాధించుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన లోక్‌సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పట్టించుకోకుండా ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. హోదా సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచుతున్నట్టు చెప్పారు. హోదా సాధనకు ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతామని ఆయన పేర్కొన్నారు.
ఆయా సెక్షన్లలో పొందుపరచాలని వైవీ సూచించిన అంశాలు ఇవీ...
సెక్షన్ 94 ఏ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు 15 ఏళ్ల పాటు ప్రత్యే క కేటగిరీ హోదా వర్తిస్తుంది. ఒకవేళ అవసర మైన పక్షంలో పదిహేనేళ్ల తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించేందుకు తగిన ఉత్తర్వుల ద్వారా చర్యలు తీసుకుంటుంది.
సెక్షన్ 94 బీ: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కింద సాధారణ కేంద్ర సాయం, అదనపు కేంద్ర సాయం, ప్రత్యేక కేంద్ర సాయం అందించాలి. గాడ్జిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఈ సాయం ఉండాలి. స్పెషల్ స్టేటస్ ద్వారా పన్ను ఆదాయం, ఇతర నిధుల పంపిణీ ఇలా ఉండాలి. 1) ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే పరిశ్రమలకు ఆర్థిక శాఖ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలో రాయితీ ఇవ్వాలి. 2) ఇన్కమ్ టాక్స్, కార్పొరేట్ టాక్స్ రేట్లలో రాయితీలు ఇవ్వాలి. 3) పరిశ్రమలు తమ కార్యకలాపాలను, యూనిట్లను విస్తరించాలనుకుంటే వర్కింగ్ క్యాపిటల్‌లో 40 శాతం సబ్సిడీ ఇవ్వాలి.
సెక్షన్ 94 సీ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితిని జీడీపీలో 5 శాతంగా నిర్ధారించాలి.