లోక్‌సభలో జగన్ జై 'సమైక్యాంధ్ర' నినాదాలు
-
స్పీకర్ పోడియం వద్ద బైఠాయింపు..
-
జత కలిసిన ఎంపీలు మేకపాటి, ఎస్పీవై
-
‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలి’ అంటూ ప్లకార్డుల ప్రదర్శన..
-
స్తంభించిన సభ.. కొనసాగిన వాయిదాల పర్వం
-
మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీల నిరసన
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో తీవ్రస్థాయిలో ఆందోళన సాగించారు. మంగళవారం సభలో ఆయన స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించారు. ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆయన వెంట పోడియం వద్ద బైఠాయించిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినదించారు. ‘సేవ్ డెమొక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ’, ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’ అని మేకపాటి, ఎస్పీవై ప్లకార్డులు ప్రదర్శించారు. గతవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జగన్‌తో ఎంపీలు మేకపాటి, ఎస్పీవైతో కలిసి విభజనకు వ్యతిరేకంగా ఆందోళన సాగించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉభయసభలు కేంద్రమంత్రి శీష్‌రాం ఓలా మృతికి నివాళులర్పించి మంగళవారానికి వాయిదాపడ్డాయి. మంగళవారం లోక్‌సభలో గతవారం మాదిరిగానే వాయిదాల పర్వం కొనసాగింది.
దీంతో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే సభ బుధవారానికి వాయిదాపడింది. రాజ్యసభ కూడా ఉదయం 11 గంటలకు సమావేశమైన వెంటనే గొడవతో 12కు వాయిదాపడింది. 12కు తిరిగి సమావేశమైనపుడు రాజ్యసభ లోక్‌పాల్ బిల్లుపై చర్చించి ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
రెండుసార్లు జగన్ బైఠాయింపు: ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ఇతర పార్టీల సభ్యులతోపాటు జగన్, మేకపాటి, ఎస్పీవై పోడియం వద్దకు వెళ్లారు. జగన్, ఎస్పీవై అక్కడే బైఠాయించి నినాదాలు అందుకున్నారు. ఇటువైపు ఈ ముగ్గురూ, అటువైపు టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు, ఇంకా ఇతరపక్షాల సభ్యులు కలిసి సాగించిన ఆందోళనతో లోక్‌సభ దద్దరిల్లింది. వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన సాగించిన సభ్యుల్లో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్, టీడీపీ నుంచి ఎన్.శివప్రసాద్, ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణరావు ఉన్నారు.
సభ సాగడానికి సహకరించాలని స్పీకర్ మీరా కుమార్ చేసిన విజ్ఞప్తిని ఆందోళన చేస్తున్న సభ్యులు లెక్కపెట్టలేదు. ఫలితంగా.. ప్రారంభమైన రెండు నిమిషాలకే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమైనప్పుడు ఉదయం దృశ్యాలే పునరావృతమయ్యాయి. జగన్, ఎస్పీవై, మేకపాటి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి బైఠాయించి నినాదాలు చేయసాగారు. అటుపక్కన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉదయం తరహాలోనే తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. జస్టిస్ గంగూలీని తొలగించాలంటూ సౌగత రాయ్ (తృణమూల్) నినాదాలు చేశారు. చైనా దళాలు తరచూ భారత భూభాగంలోకి చొరబడడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ సమాజ్‌వాది పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. వేరే అంశాలపై మరికొందరు సభ్యులు ఆందోళనకు దిగారు.
గందరగోళంలోనే బిల్లులు, పద్దులు: సభలో గందరగోళం నెలకొన్నా.. వివిధ శాఖల పార్లమెంటరీ స్థాయీ సంఘాల నివేదికలు, బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతించారు. మంత్రులు, సభ్యులు.. మొత్తం 30 మంది నివేదికలు, సవరణ బిల్లులను సభ ముందు ఉంచారు. ఆఖరున.. తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎస్టీల జాబితాను సవరించడానికి వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ బిల్లును సభకు సమర్పించారు. ఈ తతంగమంతా పూర్తికావడానికి 15 నిమిషాలు పట్టింది. అంతసేపూ జగన్ పోడియం వద్ద కూర్చుని నినదిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తయిన వెంటనే స్పీకర్ అవిశ్వాస నోటీసును ప్రస్తావించారు. ‘‘టీడీపీ ఎంపీ ఎం.వేణుగోపాలరెడ్డి, ఇతరులు ఇచ్చిన అవిశ్వాస నోటీసును సభ ముందుంచడం నా బాధ్యత. నోటీసును చేపట్టాలంటే.. సభలో 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. సభ సజావుగా సాగితే.. 50 మంది సభ్యులను లెక్కబెట్టడానికి వీలవుతుంది. సభ సాగడానికి సహకరించండి’’ అని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మిగతా సభ్యులెవరూ పట్టువీడటానికి సిద్ధంగా లేకపోవడంతో ఆమె 12.17కు సభను బుధవారానికి వాయిదా వేశారు.
మీకో దండం: దిగ్విజయ్‌తో జగన్
లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఎంపీలు మేకపాటి, ఎస్పీవై రెడ్డితో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి కొంతసేపు పార్లమెంటు సెంట్రల్‌హాలులో గడిపారు. వెలుపలికి వస్తున్న సమయంలో జగన్‌ను... హాలు ద్వారానికి ఓ వైపున విలేకరులతో మాటామంతీ సాగిస్తున్న దిగ్విజయ్‌సింగ్ గమనించారు. ఆయన జగన్‌వైపు తిరిగి... ‘జగన్, మిస్టర్ జగన్... ప్లీజ్ కం.. ప్లీజ్ కం’ అని రమ్మని పిలిచారు. దీనికి జగన్ ప్రతిస్పందిస్తూ తానున్న చోటునుంచే చేతులెత్తి నమస్కారం పెట్టి ముందుకు కదలబోయారు. ఇది చూసిన దిగ్విజయ్, ‘మీరు నాతో మాట్లాడదల్చుకోలేదా?’ అని జగన్‌ను ప్రశ్నించారు. ‘అవును, నేను మాట్లాడదల్చుకోలేదు’ అని జగన్ బదులిచ్చి సహ ఎంపీలతో కలిసి ముందుకు నడిచి అక్కడినుంచి నిష్ర్కమించారు.