సాక్షి, మచిలీపట్నం : అధినాయకత్వానికి చెప్పుకోలేక.. సమైక్యానికి జైకొట్టలేక.. అటుఇటు కాని హృదయంతోటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు నలిగిపోతున్నారు. విభజన చిచ్చుకు ఆ రెండు పార్టీలే ప్రధాన కారణమని జనం విశ్వసిస్తున్నారు. ఈ రెండు పార్టీల నేతలు ప్రాంతాలవారీగా విడిపోయి మాట్లాడడం, అధిష్ఠానాలు విభజన నిర్ణయానికి రావడంతో జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ నేతలను జనం పట్టించుకోవడంలేదు. సీడబ్ల్యూసీ విజభన నిర్ణయం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ వారు స్తబ్దుగా ఉండిపోవడం, టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త రాజధానికోసం రూ.ఐదు లక్షల కోట్లు కావాలని ప్రకటించడం జనానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.
ఇప్పుడు సమైక్యాంధ్ర ఆందోళనల్లో పాల్గొంటున్నా ఆ పార్టీల నేతల చిత్తశుద్ధిని జనం శంకిస్తున్నారు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా జనం స్వచ్ఛందంగా బజారుల్లోకి వచ్చారు. ఈ దశలో వైఎస్సార్‌సీపీ సమైక్య సమర శంఖారావం పూరించింది. నిబద్ధత, చిత్తశుద్ధితో ఆందోళనలు, రాజీనామాలతోపాటు సమన్యాయం చేస్తారా లేక రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచుతారా అంటూ వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టారు. దాన్ని పోలీసులు, పాలకులు పాశవికంగా భగ్నంచేసిన వెంటనే చంచల్‌గూడ జైల్లోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు సీమాంధ్ర దన్నుగా నిలిచింది. ఉద్యమం జనప్రభంజనమైంది.
నియోజకవర్గాలవారీగా నిరసనలు, మానవహారాలు, రాస్తారోకోలు, ఆమరణ, రిలే దీక్షలు చేపడుతూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు అధినేత జగన్ బాటలో సమరోత్సాహంతో కదులుతున్నాయి. నాన్ పొలిటికల్ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమాల్లో కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొంటున్నాయి. ఆ సంఘాలు కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో సమైక్యాంధ్ర ఉద్యమం మొత్తంగా వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న పోరాటంగా మారిపోయింది.
దీంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏమి చేయాలో పాలుపోక గందరగోళానికి గురవుతుంటే, తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధినేత వైఖరిని విమర్శించలేక, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని కొనసాగించలేక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఉద్యమ ప్రభంజనాన్ని ఎలా తట్టుకోవాలి.. తమ ఉనికి ఎలా నిలబెట్టుకోవాలి అనేది అర్థంగాక సతమతమవుతున్నారు. సమైక్య దీక్షాశిబిరాల వద్దకు సంఘీభావం తెలిపి ఫోటోలు తీయించుకుంటూ తాము కూడా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పుకోవడానికి ఆ రెండు పార్టీల నేతలు పరిమితమవుతున్నారు. అంతేకాదు, వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు, కుయుక్తులతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయి.
పెనమలూరు, మైలవరంలో పోటీ దీక్షలు..
సమైక్యవాదాన్ని బలంగా వినిపించడంలో విఫలమైన కాంగ్రెస్, టీడీపీలు.. వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు మాత్రం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో సుమారు 25 రోజులుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఉద్యమంలో వైఎస్సార్ సీపీ పాలుపంచుకుంటోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు మదతుగా పెనమలూరు నియోజకవర్గ ఆ పార్టీ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు నేతృత్వంలో మంగళవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.
ఆ పార్టీకి ప్రజాదరణ వస్తుందన్న కంగారుతో ఉయ్యూరులోని అదే ప్రాంతంలో కాంగ్రెస్ ఒకటి, టీడీపీ రెండు రిలే నిరాహార దీక్షాశిబిరాలను బుధవారం హడావుడిగా ప్రారంభించాయి. రాజకీయాల కారణంగా సమైక్య ఉద్యమం దెబ్బతినకూడదని, నాన్ పొలిటికల్ జేఏసీ నాయకత్వంలోనే తాము కూడా పోరాటం చేస్తామని సురేష్‌బాబు ప్రకటించారు. ఆయన బుధవారం తన శిబిరాన్ని తొలగించి జేఏసీ టెంట్‌లోనే రిలే దీక్షలను కొనసాగించారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం తమ టెంట్‌లను అలాగే ఉంచి రిలే దీక్షలను కొనసాగించడం తీవ్ర విమర్శలకు గురైంది. పోరంకిలోనూ టీడీపీ పోటీ దీక్షలను కొనసాగించడంతో విమర్శలపాలవుతోంది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా ఎమ్మెల్యేగా నేతృత్వం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు తనయుడు శ్రీనాథ్‌లు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఆమరణ దీక్షకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో కంగారు పడిన ఉమా బలవంతంగా టీడీపీకి చెందిన ఇద్దరితో పోటీగా ఆమరణదీక్షను నిర్వహిస్తున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి జిల్లాలో సమైక్య యాత్ర చేస్తానని ఉమా ప్రకటించారు. ఇంతకుమించి సమైక్యాంధ్ర ఉద్యమంలో టీడీపీ పెద్దగా పాలుపంచుకున్నది లేకపోగా, కాంగ్రెస్ పూర్తిగా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది.