సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర కోసం సమరశంఖం పూరించిన ఉద్యోగులకు ఆగస్టు మాసం పెను సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులకు ఒక నెల జీతాలు ఆగిపోయాయి. ‘జీతాలు లేక జీవితాలు గడిపేది ఎలా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ‘పస్తులైనా ఉంటాం.. ఉద్యమాన్ని వీడేది లేదు’ అని మొక్కవోని ధైర్యంతో చెబుతున్నారు. జిల్లాలోని ఖజానా (ట్రెజరీ) శాఖకు చెందిన 18 సబ్ ట్రెజరీల్లోని 175 మంది ఉద్యోగులు గత నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. అదేరోజు నుంచి జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన 135 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సైతం సమ్మెబాట పట్టారు.
ట్రెజరీల్లో స్తంభించిన కార్యకలాపాలు..
మచిలీపట్నంలోని ట్రెజరీ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలోని 18 సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఉద్యోగుల వేతనాల బిల్లులు, పంచాయతీ, మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు అవసరమైన బిల్లుల చెల్లింపునకు ట్రెజరీ శాఖ ఆమోద ముద్ర తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని అత్యవసర, అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు జాప్యం చేసినా అంత ఒత్తిడి లేదు. అత్యవసర పనులు, బిల్లుల మాట ఎలా ఉన్నా ఉద్యోగుల జీతాల బిల్లులు సైతం మంజూరు కాలేదు. ఈసారి ట్రెజరీ ఉద్యోగులు సైతం సమ్మెబాట పట్టడంతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు రూ.85 కోట్ల మేర జీతాల బిల్లులు నిలిచిపోయాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగ కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నెలాఖరున వచ్చే జీతంపై ఆశపెట్టుకుని.. కారు, ఇల్లు, విద్య, వ్యక్తిగత రుణాలు చెల్లించుకునేలా అప్పులు చేస్తారు. వాటిని వాయిదా సమయానికి చెల్లించకపోతే వడ్డీ భారం పెరిగే ప్రమాదం ఉంది. ఇది చాలదన్నట్టు ఇంటి అద్దెలు, నెలవారీ పచారీ, ఇతర ఖర్చులు తప్పవు. ఆగస్టు జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు సైతం అప్పులపాలుకాక తప్పని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పోలీసులు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖమ్మం జిల్లాలో జీతాల బిల్లులు చేయించుకోవడం చర్చనీయాంశమైంది.
జీతాల్లేవ్.. జీవనమెలా?
Published Thu, Sep 5 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement