Sub-Treasury
-
ఖజానా లావాదేవీలు బంద్ !
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని ఖజానా శాఖ ఆధ్వర్యంలోని సబ్ ట్రెజరీల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రభుత్వ మౌఖి క ఆదేశాలమేరకు ఆ శాఖ అధికారులు లావాదేవీలను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రభుత్వ ఖజానాల ద్వారా ఎటువంటి బిల్లులు కానీ, చెక్కులు కానీ జారీకాలేదు. దీంతో బుధవారం ఒక్క రోజు రూ.మూడున్నర కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం నుంచి అన్ని రకాల బిల్లులనూ నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు, సంక్షిప్త సందేశాలు అందాయి. దీంతో తదుపరి సమాచారం వచ్చే వరకూ ఎక్కడి బిల్లులక్కడ ఆపేయాలని జిల్లాలోని అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలకూ ఖజానా శాఖ డీడీ పీవీ భోగారావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా లోని 14 సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. తెర్లాం వంటి కొన్ని సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో రోజుకు రూ. 15లక్షల వరకూ లావాదేవీలు జరుగుతుండగా, విజయనగరం తదితర సబ్‌ట్రెజరీల్లో రూ.50 లక్షల వరకూ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీల్లోగా జీతాల బిల్లులు అందజేస్తారు. ఆ తరువాత 1 వ తేదీ నుంచి సప్లిమెంటరీ, కంటింజెంట్, అడ్వాన్సులు, మెయింటెనెన్స్ బిల్లులు వెళ్తుంటాయి. జిల్లాలో 16 వేల మంది పెన్షనర్లు, 23వేల మంది ఉద్యోగుల బిల్లులు ప్రతీ నెలా వెళ్తుంటాయి. సామాజిక పెన్షన్ల లావాదేవీలు కూడా ట్రెజరీల ద్వారానే నిర్వహిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ బిల్లులన్నీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆగిపోయే పరిస్థితులున్నాయి. సుమారు నాలుగైదు రోజుల పాటు ఈ లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితులున్నాయని భావిస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళన మరో నాలుగు రోజుల పాటు బిల్లుల చెల్లింపు నిలిచిపోతే తమ జీతాలు, పెన్షన్ల పరిస్థితి ఏంటని ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బిల్లులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఆదేశాలు జారీ చేశాం బిల్లుల చెల్లింపులు చేయవద్దని జిల్లాలో అన్ని ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వం నుంచి అందిన మౌఖిక ఆదేశాలతోనే బిల్లులు నిలిపివేశాం. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకూ జిల్లాలోని ఏ ట్రెజరీలోనూ చెల్లింపులు జరగవు. ప్రస్తుతం వేతనాల బిల్లులన్నీ వెళ్లిపోయాయి. ఒకటో తేదీ తరువాతే బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున నిలిచిపోయే బిల్లులేవీ లేవు. - పీవీ భోగారావు, డిప్యూటీ డైరక్టర్, (డెరైక్టర్) జిల్లా ఖజానా శాఖ, విజయనగరం. -
ముగ్గురు కీలక ఉద్యోగుల అరెస్టుకు రంగం సిద్ధం
చింతపల్లి: స్థానిక సబ్ ట్రెజరీ కుంభకోణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధంచేశారు. కుంభకోణంలో ప్రధాన సూత్రధారులైన చింతపల్లి సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ అప్పలరాజు, వైద్య ఆరోగ్యశాఖ యూడీసీ సింహాచలం, ఏడీఎంహెచ్ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సంజీవరావులను సోమవారం అరెస్ట్ చేసేందుకు పోలీసు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరు ముగ్గురు ఇప్పటికే పోలీసు ప్రత్యేక బృందం అదుపులో ఉన్నట్లు సమాచారం. విశాఖ ఏజెన్సీలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగులను సృష్టించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ట్రెజరీ అధికారులు కలిసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. 2013-14కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు మంజూరైన బడ్జెట్లో రూ.2.80 కోట్లు న కిలీ ఉద్యోగుల పేరిట డ్రా చేసి స్వాహా చేసిన విషయం ఆడిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిధుల స్వాహాకు చింతపల్లి సబ్ ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజు సహ కరించినందుకు రూ.17 లక్షలు ఆయన తన ఖాతాలో జమ చేసుకోగా, వైద్య ఆరోగ్య శాఖ యూడీసీ సింహాచలం ఏకంగా రూ.1.40 కోట్లు తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. పాడేరు ఏడీఎంహెచ్ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సంజీవరావుకు కూడా ఈ కుంభకోణంలో సంబంధం ఉన్నట్లు ఆడిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ట్రెజరీ ఉద్యోగి అప్పలరాజుపై ఆ శాఖ అధికారులు ముందే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. ఈ కేసు విచారణ నిమిత్తం డీఎస్పీ కృష్ణవర్మ ఆధ్వర్యంలోని 9 మంది సభ్యులతో కూడిన బృందాన్ని నియమించారు. వీరు నెల రోజులుగా ట్రెజరీ, పీహెచ్సీ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఇందులో చాలా మంది ప్రమేయం ఉన్నప్పటికి ప్రధాన నిందితులుగా ఏ 1 కేసులో ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజు, ఎ 2 కింద యూడీసీ సింహాచలం, ఎ 3 కింద ఏడీఎంహెచ్ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సంజీవరావును ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్లు తెలిసింది. వీరు స్వాహా చేసిన నిధులను ఇప్పటికే చాలా వరకు రికవరీ చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు మిగతా నిధులకు సంబంధించి వారి వారి సొంత ఆస్తుల జప్తుకు సంబంధించి రికార్డులు తయారు చేశారు. అప్పలరాజు వద్ద అప్పుగా తీసుకున్న పలువురు ఉద్యోగుల నుంచి కూడా ఈ నిధులను రికవరీ చేస్తారు. ఈ వివరాలన్నీ సేకరించేందుకు అధికారులు 3 రోజులుగా వీరిని తమ అదుపులో ఉంచుకున్నారు. సోమవారం వీరిని చింతపల్లిలో అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వీరి అరెస్ట్ తర్వాత మరో 30 మంది వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. -
ఒక నెల పనికి..రెండు జీతాలు..!
చింతపల్లి సబ్ ట్రెజరీలో మరో వింత సాంకేతిక లోపమే అంటున్న అధికారులు చింతపల్లి : చింతపల్లి సబ్ ట్రెజరీలో నిధుల దుర్వినియోగం కుంభకోణాన్ని మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. కొందరు ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బందులు పడుతుంటే, మరికొందరు ఉద్యోగులకు ఒకే నెలకు రెండు సార్లు వేతనాలు జమకావడం చర్చనీయాంశమైంది. ఈ సబ్ ట్రెజరీలో వైద్య ఆరోగ్యశాఖలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట రూ.కోట్ల నిధుల దుర్వినియోగంపై ఎస్టీఓ లోకేశ్వరరావు, అకౌంటెంట్ అప్పలరాజులపై వేటు పడటం తెలిసిందే. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాల బడ్జెట్ రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి వేతన బిల్లుల చెల్లింపుల్లో ప్రవేశ పెట్టిన నూతన విధానాలు ఆన్లైన్ చేయించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వివిధ శాఖలకు చెందిన వంద మంది ఉద్యోగుల వేతనాలు వారి అకౌంట్లలో జమకాలేదు. వారంతా వేతనాలకోసం ప్రతి రోజూ సబ్‌ట్రెజరీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. హైదరాబాద్ ప్రధాన ఖజానా కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగులకు ఒకే నెలలో రెండుసార్లు వేతనాలు జమ అయ్యాయి. ఈ విషయాన్ని కొంతమంది సహకార ఉద్యోగులు ట్రెజరీ అధికారులకు సమాచారం అందించారు. చింతపల్లి ఐసీడీఎస్‌కు అదనంగా రూ.7.30 లక్షల వరకు నిధులు జమ అయ్యాయి. స్థానిక కేంద్రీకృత ఆశ్రమ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, పశువుల ఆస్పత్రిలోని కొంతమంది ఉద్యోగులకు ఒకే నెలలో రెండు నెలలకు సంబంధించిన వేతనాలు జమ అయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. బిల్లింగ్ నమోదులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా రెండోసారి వారి ఖాతాల్లోకి వేతనాలు జమ అయ్యాయని, వాటిని సీఎన్బీ ఖాతాల్లోకి బదిలీచేస్తున్నారని ఇన్చార్జి ఎస్టీవో శ్రీనివాసులు తెలిపారు. -
‘పంచాయతీ’లో కాసుల గలగల
ఇందూరు, న్యూస్‌లైన్ : పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇకముందు నిధుల కొరత ఉండబోదు. పల్లెల అభివృద్ధి పనులకు కావాల్సిన్ని నిధులు పంచాయతీల ఖాతాల్లో వచ్చి చేరాయి. ఎన్నడూ లేనంతగా పంచాయతీల ఖజానా నిండుకుండలాగా మారింది. ఇటీవల ఆర్థిక శాఖ పంచాయతీలకు రూ.13,88,45,200 నిధులను కేటాయించి వాటి విడుదలకు ట్రెజరీ శాఖకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే 2013-14 సంవత్సరానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో కొద్దిగా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా 2013-14కు చెందిన రూ. 12,61,71,900 నిధుల విడుదలకు ఆర్థిశాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఇందుకు పంచాయతీ అధికారులు గతంలోనే పంపిన బిల్లుల ఫైలును జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు బయటకు తీశారు. బిల్లులను సబ్ ట్రెజరీగా వారీగా కేటాయించారు. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి విడుధలైన 13వ ఆర్థిక సంఘం నిధులు కలిపితే ప్రస్తుతం రూ.26,51,17,100లకు చేరింది. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా సర్దుబాటు చేయాలని పంచాయతీ అధికారులు ట్రెజరీ శాఖ అధికారులకు సూచించారు. మొన్నటి వరకు పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక జీరో బ్యాలెన్స్ చూపించాయి. గ్రామ సర్పంచులు కూడా పనులు చేయించలేకపోయారు. ప్రస్తుతం లక్షల్లో పంచాయతీల ఖాతాల్లో నిధులు వచ్చి చేరాయి. ఇక పల్లెల్లో అవసరమైన పనులకు, అభివృద్ధి పనులకు నిధులు పుష్కలంగా ఉంటాయి. నిధుల సర్దుబాటు ఇలా... జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు నిధులను సర్దుబాటు చేశారు. జిల్లా ట్రెజరీ నుంచి సబ్ ట్రెజరీలకు నిధులను కేటాయించారు. వాటిని రెండు రోజుల్లో సర్దుబాటు చేసి పంచాయతీల ఖాతాల్లో వేస్తారు. ఆర్మూర్ సబ్ ట్రెజరీకి రూ.1,70,33,655, బాన్సువాడ రూ.1,26,03,440, భీంగల్ రూ.1,57,93,101, బోధన్ రూ.1,69,74,294, కామారెడ్డి రూ.2,01,63,699, మద్నూర్ రూ.1,09,57,521, నిజామాబాద్ రూ.2,10,39,743, ఎల్లారెడ్డి రూ.1,16,06,447 -
జీతాల్లేవ్.. జీవనమెలా?
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర కోసం సమరశంఖం పూరించిన ఉద్యోగులకు ఆగస్టు మాసం పెను సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులకు ఒక నెల జీతాలు ఆగిపోయాయి. ‘జీతాలు లేక జీవితాలు గడిపేది ఎలా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ‘పస్తులైనా ఉంటాం.. ఉద్యమాన్ని వీడేది లేదు’ అని మొక్కవోని ధైర్యంతో చెబుతున్నారు. జిల్లాలోని ఖజానా (ట్రెజరీ) శాఖకు చెందిన 18 సబ్ ట్రెజరీల్లోని 175 మంది ఉద్యోగులు గత నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. అదేరోజు నుంచి జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన 135 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సైతం సమ్మెబాట పట్టారు. ట్రెజరీల్లో స్తంభించిన కార్యకలాపాలు.. మచిలీపట్నంలోని ట్రెజరీ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలోని 18 సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఉద్యోగుల వేతనాల బిల్లులు, పంచాయతీ, మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు అవసరమైన బిల్లుల చెల్లింపునకు ట్రెజరీ శాఖ ఆమోద ముద్ర తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని అత్యవసర, అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు జాప్యం చేసినా అంత ఒత్తిడి లేదు. అత్యవసర పనులు, బిల్లుల మాట ఎలా ఉన్నా ఉద్యోగుల జీతాల బిల్లులు సైతం మంజూరు కాలేదు. ఈసారి ట్రెజరీ ఉద్యోగులు సైతం సమ్మెబాట పట్టడంతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు రూ.85 కోట్ల మేర జీతాల బిల్లులు నిలిచిపోయాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగ కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నెలాఖరున వచ్చే జీతంపై ఆశపెట్టుకుని.. కారు, ఇల్లు, విద్య, వ్యక్తిగత రుణాలు చెల్లించుకునేలా అప్పులు చేస్తారు. వాటిని వాయిదా సమయానికి చెల్లించకపోతే వడ్డీ భారం పెరిగే ప్రమాదం ఉంది. ఇది చాలదన్నట్టు ఇంటి అద్దెలు, నెలవారీ పచారీ, ఇతర ఖర్చులు తప్పవు. ఆగస్టు జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు సైతం అప్పులపాలుకాక తప్పని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పోలీసులు మాత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖమ్మం జిల్లాలో జీతాల బిల్లులు చేయించుకోవడం చర్చనీయాంశమైంది.