చింతపల్లి సబ్ ట్రెజరీలో మరో వింత
సాంకేతిక లోపమే అంటున్న అధికారులు
చింతపల్లి : చింతపల్లి సబ్ ట్రెజరీలో నిధుల దుర్వినియోగం కుంభకోణాన్ని మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. కొందరు ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బందులు పడుతుంటే, మరికొందరు ఉద్యోగులకు ఒకే నెలకు రెండు సార్లు వేతనాలు జమకావడం చర్చనీయాంశమైంది. ఈ సబ్ ట్రెజరీలో వైద్య ఆరోగ్యశాఖలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట రూ.కోట్ల నిధుల దుర్వినియోగంపై ఎస్‌టీఓ లోకేశ్వరరావు, అకౌంటెంట్ అప్పలరాజులపై వేటు పడటం తెలిసిందే. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణ, అంగన్‌వాడీ కేంద్రాల బడ్జెట్ రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి వేతన బిల్లుల చెల్లింపుల్లో ప్రవేశ పెట్టిన నూతన విధానాలు ఆన్‌లైన్ చేయించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వివిధ శాఖలకు చెందిన వంద మంది ఉద్యోగుల వేతనాలు వారి అకౌంట్లలో జమకాలేదు. వారంతా వేతనాలకోసం ప్రతి రోజూ సబ్‌ట్రెజరీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
హైదరాబాద్ ప్రధాన ఖజానా కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగులకు ఒకే నెలలో రెండుసార్లు వేతనాలు జమ అయ్యాయి. ఈ విషయాన్ని కొంతమంది సహకార ఉద్యోగులు ట్రెజరీ అధికారులకు సమాచారం అందించారు. చింతపల్లి ఐసీడీఎస్‌కు అదనంగా రూ.7.30 లక్షల వరకు నిధులు జమ అయ్యాయి. స్థానిక కేంద్రీకృత ఆశ్రమ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, పశువుల ఆస్పత్రిలోని కొంతమంది ఉద్యోగులకు ఒకే నెలలో రెండు నెలలకు సంబంధించిన వేతనాలు జమ అయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. బిల్లింగ్ నమోదులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా రెండోసారి వారి ఖాతాల్లోకి వేతనాలు జమ అయ్యాయని, వాటిని సీఎన్‌బీ ఖాతాల్లోకి బదిలీచేస్తున్నారని ఇన్‌చార్జి ఎస్టీవో శ్రీనివాసులు తెలిపారు.
ఒక నెల పనికి..రెండు జీతాలు..!
Published Sat, Dec 13 2014 1:12 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement