Misuse of funds
-
మొహమాటం ఖరీదు రూ.3 లక్షలు.. కొండగట్టులో వింత ఆచారం
సాక్షి, కొండగట్టు(కరీంనగర్): కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు తీరడంతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈసందర్భంగా ఆలయానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఇలా వచ్చే నిధులను భక్తుల సౌకర్యాలు, వసతుల కల్పనకు వెచ్చించాల్సి న ఆలయ యంత్రాంగం.. వీఐపీలు, వీవీఐపీల సందర్శనల సందర్భంగా మొహమాటానికి వెళ్తోంది. ఆలయ నిబంధనల మేరకు శాలువాలతో ప్రముఖులను సత్కరించడం ఆనవాయితీ. కానీ, వారితో వచ్చే చిన్నాచితకా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులను సైతం సన్మానిస్తోంది. ఇందుకోసం లెక్కకు మించి శాలువాలను వృథా చేస్తోంది. ఏటా వందమందికిపైగా వీఐపీల రాక.. కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి దర్శనం కోసం ఏటా 100 మందికిపైగానే వీఐపీలు తరలివస్తుంటారు. వారు స్వామివారిని దర్శించుకుని వెళ్లంటారు. ఈసమయంలో ఆలయ అధికారులు ప్రముఖులను శాలువాలు, కండువాలతో సన్మానిస్తున్నారు. అయితే, స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులు ఒకరిద్దరు ఉంటే.. వారివెంట చిన్నాచితకా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక్కోసారి అధికారులూ లెక్కకు మించి ఉంటున్నారు. కొందరి పర్యటనలో 25 మంది – 30 మంది వరకు ఉంటే.. మరికొందరి వెంట ఆ సంఖ్య రెట్టింపుకన్నా అధికంగానే ఉంటోంది. కరోనా సమయంలోనూ ఒకరిద్దరు రావాల్సి ఉండగా, పదుల సంఖ్యలో హాజరవడం విస్మయం కలిగించింది. ప్రముఖులు పూజలో కూర్చుండగానే వారి అనుయాయులూ అనుసరిస్తున్నారు. ఎంతైనా ప్రముఖులతోనే వచ్చారు కదా, వారిని కూడా సత్కరించకుంటే వీఐపీలు ఏమనుకుంటారోనని మొహమాటానికి గురవుతున్నారు అధికారులు. దీంతో ప్రముఖుల వెంట వచ్చిన అనధికారులను సైతం శాలువాలు, కండువాలతో సన్మానిస్తున్నారు. క్యూలైన్లలో తాగునీటికి తిప్పలు.. అంజన్న దర్శనం కోసం క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు తాగునీటి సౌకర్యంలేక తపిస్తున్నారు. అనధికారులకు వెచ్చిస్తున్న సొమ్ముతో క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని కొందరు అధికారులు భావిస్తున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో శాలువా ధర రూ.25– రూ.200.. నాణ్యత, బ్రాండ్‌ను బట్టి ఒక్కో శాలువా రూ. 25–200 వరకు ధర ఉంటుంది. అయితే, కేవలం ప్రముఖులనే సన్మానిస్తే అంజన్న ఆలయంపై ఏటా సుమారు రూ.లక్ష వరకే ఉంటుందని అంచనా. కానీ, అనధికారులనూ సన్మానిస్తుండడంతో శాలువాలు, కండువాలు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. తద్వారా అంజన్నపై ఏటా రూ.3లక్షల వరకు భారం పడుతోంది. ఇదంతా భక్తుల ద్వారా ఆలయానికి సమకూరిన సొమ్మే. దీనిని ఇష్టం వచ్చిన వారికి వెచ్చించడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. చదవండి: CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి -
నాలుగుసార్లు లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్‌సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధానమంత్రి నిధులను దుర్వినియోగం చేసిందంటూ, గాంధీ కుటుంబంపై చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షం నిరసనలకు దిగింది. పీఎం రిలీఫ్ çఫండ్‌ను ఇప్పటి వరకు రిజిస్టర్ చేయించనేలేదని ఠాకూర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. పలువురు సభ్యులు తమ స్థానాల నుంచి నిలుచుని మాట్లాడుతుండటంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే సస్పెండ్ చేస్తామని వారిని హెచ్చరించారు. అయినా నిరసనలు ఆపకపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి కూడా సభను రెండుసార్లు వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలకు కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు. ప్రతి రోజు ఉదయం ఉభయ సభలకు చెందిన ఎంపీలు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30% తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శుక్రవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్‌పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్ష సభ్యులు, ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారమే ఆమోదించగా, శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. హర్సిమ్రత్ రాజీనామా ఆమోదం కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
స్వాహా పక్కా.. తేలని లెక్క
బేతంచెర్ల మండలం గూటుపల్లి, అంబాపురం, ఉసేనాపురం, నాగమళ్లకుంట, ఆర్.బుక్కాపురం, ఆర్ఎస్ రంగాపురం, రహిమాన్‌పురం గ్రామైక్య సంఘాలకు రూ.57.79 లక్షల వాటర్‌షెడ్ నిధులు విడుదలయ్యాయి. ఇందులో రూ.37.59 లక్షలు లబ్ధిదారులకు ఇచ్చినట్లు వెలుగు సిబ్బంది లెక్కలు చూపారు. మిగిలిన రూ.20.20 లక్షలు ఏమయ్యాయో ఎవరికీ తెలియడం లేదు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద లేవని వెలుగు సిబ్బంది అంటున్నారు. కేవలం బేతంచెర్ల మండలంలోనే కాదు.. జిల్లాలోని దాదాపు అన్ని మైక్రో వాటర్‌షెడ్ గ్రామాల్లోనూ ఇదే తరహా అక్రమాలు జరిగాయి. కోడుమూరు: వాటర్‌షెడ్ నిర్వాహకులు, వెలుగు సిబ్బంది, టీడీపీ నాయకులు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారు. మహిళా సంఘాల లీడర్ల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని పొదుపు మహిళలకు అందాల్సిన నిధులను తమ జేబుల్లోకి వేసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ (ఐడబ్ల్యూఎంపీ) కింద జిల్లాలోని బేతంచెర్ల, ఆళ్లగడ్డ, సి.బెళగల్, సంజామల, అవుకు, కోసిగి, తుగ్గలి, నంద్యాల, ఓర్వకల్లు, హాలహర్వి, ఆత్మకూరు, జూపాడుబంగ్లా, ఎమ్మిగనూరు మండలాల్లోని 119 మైక్రో వాటర్షెడ్లకు 2010 – 2013 సంవత్సరాల మధ్య దాదాపు రూ.280 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ వాటర్షెడ్ల కాల పరిమితి ఐదేళ్లు. 2014 నుంచి 2019 మధ్య నిధుల వినియోగం ఎక్కువగా జరిగింది. వాస్తవానికి ఈ నిధులతో నీటి సంరక్షణ కోసం వాగులు, వంకల్లో చెక్‌డ్యాంలు, నీటికత్వాలు, ఇంకుడుగుంతల నిర్మాణం తదితర పనులు చేపట్టాలి. అలాగే వాటర్షెడ్ల పరిధిలోని గ్రామాల్లో మహిళలకు జీవనోపాధి కల్పించాలి. మొత్తం నిధుల్లో తొమ్మిది శాతం మహిళల జీవనోపాధికి వెచ్చించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 280 కోట్లలో రూ.25.20 కోట్లు జీవనోపాధి కార్యక్రమాలకు వెచ్చించాల్సి ఉండగా..చాలా వరకు పక్కదారి పట్టించారు. కుమ్మక్కై కొల్లగొట్టారు! మైక్రో వాటర్‌షెడ్ గ్రామాలకు జీవనోపాధి కింద విడుదలైన నిధులను గ్రామైక్య సంఘాల ఖాతాల్లో జమ చేశారు. పొదుపు సంఘాల్లోని మహిళలను అత్యంత నిరుపేదలు, నిరుపేదలు, పేదలుగా విభజించి, వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యతిచ్చి.. చిన్నపాటి వ్యాపారాలు, పాడిగేదెలు, పొట్టేళ్ల పెంపకం కోసం రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే..పలుచోట్ల వెలుగు, వాటర్‌షెడ్ సిబ్బంది, టీడీపీ నాయకులు కుమ్మక్కై బినామీ పేర్లను చేర్చి నిధులు చాలావరకు పక్కదారి పట్టించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవనోపాధి నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు కావాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో వెలుగు (ప్రస్తుతం వైఎస్సార్ క్రాంతి పథం) అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. అసలు తమకు రుణమే ఇవ్వలేదని కొంతమంది చెబుతుండగా, తాము తీసుకున్న అప్పు గతంలోనే చెల్లించామని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం సగం డబ్బు వెలుగు సిబ్బంది తీసుకుని, మిగిలిన మొత్తాన్ని చేతికిచ్చి ఎక్కువ రుణం తీసుకున్నట్టు సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపిస్తున్నారు. కోసిగి మండలం డి.బెళగల్ వాటర్‌షెడ్ పరిధిలోని గ్రామైక్య సంఘాలకు రూ.40.5 లక్షలు విడుదలయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.36 లక్షలు వసూలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉంది. అక్రమాలకు నిదర్శనాలివిగో.. -సి.బెళగల్ మండలంలోని అరుణోదయ గ్రామైక్య సంఘానికి విడుదలైన జీవనోపాధి నిధులను బినామీల పేరిట ఓ సీసీ స్థానిక టీడీపీ నేతలతో కుమ్మక్కై స్వాహా చేశారు. దాదాపు రూ.12 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. -కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామానికి రూ.8 లక్షలు విడుదలయ్యాయి. అప్పటి వెలుగు సిబ్బంది.. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేసుకుని.. రూ.25 వేల నుంచి రూ.40వేలు అప్పులిచ్చినట్టు పొదుపు మహిళలతో సంతకాలు పెట్టించుకున్నారు. రికవరీ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. -కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామైక్య సంఘానికి రూ.28 లక్షలు విడుదలయ్యాయి. టీడీపీ నేతలు, వెలుగు సిబ్బంది కుమ్మక్కై బినామీ పేర్లతో నిధులన్నీ స్వాహా చేశారు. మహాలక్ష్మి, ప్రియదర్శిని, మదార్ పొదుపు సంఘాల్లోని సుంకులమ్మ (రూ.45వేలు), సాలమ్మ (రూ.35వేలు), బాలవెంకటమ్మ (రూ.25వేలు) అప్పు తీసుకున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అసలు తాము అప్పే తీసుకోలేదని వారు వాపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుతం రికవరీకి వెళ్లిన సిబ్బందికి రాతపూర్వకంగా తెలియజేశారు. జిల్లాలోని మిగిలిన వాటర్‌షెడ్ గ్రామాల్లోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి. విచారణ చేపడతాం.. మైక్రో వాటర్షెడ్ల నిధుల వినియోగంపై విచారణ చేపడతాం. పొదుపు సంఘాల మహిళలకు జీవనోపాధి కోసం కేటాయించిన నిధులు అర్హులకు చేరాయా, లేదా అనే అంశాన్ని పరిశీలిస్తాం. ఎక్కడైనా దుర్వినియోగం అయినట్లు తేలితే చర్యలు తప్పవు. – శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ, కర్నూలు -
ప్రసాదంలా..నిధుల పందేరం
కోర్కెలు తీర్చే అప్పన్నకు భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న మొక్కులు, విరాళాలు స్వాహార్పణం అయిపోయాయి. బిల్లులు లేకపోయినా.. పనులు జరగకపోయినా చాలా ఉదారంగా ప్రసాదం పంచినట్లు అప్పన్న నిధులను దేవస్థానం అధికారులు పంచిపెట్టేశారు. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కాలేదు. టీడీపీ హయాంలో గత ఐదేళ్లలోనూ ఇదే తంతు సాగింది. నిధుల వ్యయం, బిల్లుల చెల్లింపులు ఎంత దారుణంగా జరిగాయంటే.. ఏకంగా 105 అంశాల్లోనే సరైన లెక్కాపత్రాలు లేకుండా కోట్లకు కోట్లు ఖర్చు చేసేశారు. ఈ మొత్తం సుమారు 29 కోట్లు. ఇది ఎవరో ఊసుపోక చేసిన ఆరోపణ కాదు. స్వయంగా ఆడిట్లో తేలిన అంశం. ఆ శాఖే నివేదించిన కఠోర వాస్తవం. మొత్తంగా చూసుకుంటే 375 అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని ఆ శాఖ నిగ్గు తేల్చింది. అంతర్గత విజిలెన్స్ వ్యవస్థ లేకపోవడం.. బ్లాక్‌లిస్టులో చేర్చాల్సిన కాంట్రాక్టర్లు, షాపుల యజమానులే మళ్లీ మళ్లీ కాంట్రాక్టులు, షాపుల లీజులు పొందుతుండటంతో అడ్డగోలు చెల్లింపులు, ఎగవేతలకు అడ్డుకట్ట పడటం లేదని ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే పేరుగాంచిన నారసింహ క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉన్న సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నిధులు అడ్డగోలుగా దుర్వినియోగమవుతున్నాయి. టీడీపీ అధికారం చెలాయించిన గత ఐదేళ్లలో దేవస్థానం ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇష్టారాజ్యంగా అడ్వాన్స్ పేమెంట్లు, బిల్లులు లేకపోయినా నగదు చెల్లింపులు.. ఇలా అడ్డగోలుగా అప్పన్న ఖజానాకు భారీ చిల్లులు పడ్డాయి. ఆడిట్ అధికారుల నివేదికతో ఈ అవినీతి పర్వం వెలుగు చూసింది. రూ.61 కోట్ల చెల్లింపులపై అభ్యంతరం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రూ.61 కోట్ల 32 లక్షల 87వేల చెల్లింపులపై ఆడిట్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ చెల్లింపులకు దేవస్థానం సిబ్బంది సమర్పించిన బిల్లులు చూసి ఆడిట్ అధికారులు విస్తుపోయినట్టు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 375 అంశాల్లో(కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి) చెల్లింపులు జరిగాయని తేలింది. అంతే కాకుండా కోట్లాది రూపాయలను అవసరానికి మించి అదనంగా చెల్లించేశారని ఆడిట్ అధికారులు లెక్కవేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 అంశాల్లో కోట్లకు కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయి. రూ.2.09 కోట్ల సర్దుబాటు చెల్లింపులకు అసలు బిల్లులే లేవట. రూ. 27.42 కోట్ల చెల్లింపులకు సరైన రికార్డుల్లేవని, ఇంకొన్ని బిల్లులకు సంబంధించి రూ. 29 కోట్ల మేర అదనంగా చెల్లించారని ఆడిట్ శాఖ నిగ్గుతేల్చింది. ఇంజినీరింగ్, పరిపాలన విభాగం తప్పులు 105.. ఇక ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో 105 అంశాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు, ఆడిట్ అనుమతి లేకుండా అభ్యంతరకర అదనపు చెల్లింపులు చేసినట్లు తేలింది. ఇదే విషయమై ఈ ఏడాది మార్చిలో ఆడిట్‌శాఖ అప్పటి ఈవో రామచంద్రమోహన్‌కు ఒక నివేదిక సమర్పించింది. ఇందులో 35 అంశాలకు సంబంధించి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది. దేవస్థానం ఉన్నతాధికారిగా రామచంద్రమోహన్ ఆ అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వగా.. వాటిలో 13 వివరణలకు మాత్రమే ఆడిట్ అధికారులు ఒకింత సంతృప్తి చెందారు. మిగిలిన 22 అంశాల విషయంలో ఇప్పటికీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉండాల్సిన బకాయిదారులదే ఇష్టారాజ్యం.. 2016–17 ఆడిట్ రిపోర్టు ప్రకారం సుమారు రూ.6.75 కోట్ల బకాయిలు ఇంకా కాంట్రాక్టర్లు, షాపుల యజమానుల నుంచి రావాల్సిఉంది. 2019 మార్చి నాటికి ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. బకాయిల వసూలులో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. బకాయిలు అడగకుండా ఉండడటానికి కాంట్రాక్టర్లు, షాపుల యజమానులు ఎప్పటికప్పుడు సిబ్బందికి చేతులు తడుపుతున్నారనేది బహిరంగ రహస్యం. బ్లాక్ లిస్టులో ఉండాల్సిన బకాయిదారులే తిరిగి కాంట్రాక్టులు, వేలం పాటల్లో యథేచ్చగా పాల్గొంటున్నారు. పాత బకాయిలు కట్టకపోయినా అధికారులు వారితో కుమ్మక్కవ్వడం వల్లే దేవస్థానానికి రావాల్సిన కోట్లాది రూపాయలు రాకుండా పోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆదాయం రూ.147కోట్లు... ఖర్చు రూ.144కోట్లు.. 2016–17లో దేవస్థానానికి రూ.147.26 కోట్ల ఆదాయం రాగా అందులో రూ.144.50 కోట్లు ఖర్చుగా చూపించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేవస్థానంలో అంతర్గత విజిలెన్స్ టీం ఏర్పాటు చేయాలని ఆడిట్ విభాగం ఎప్పటి నుంచో కోరుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు చెల్లింపులు, ఆడిట్ అభ్యంతరాలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. -
జైసింగ్ దంపతుల ఇళ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌లపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) దాడులు నిర్వహించింది. విదేశీ నిధుల చట్టం నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. గురువారం తెల్లవారుజామున 5గంటలకు ఢిల్లీలోని ఇందిరా జైసింగ్ ఇల్లు, జంగ్‌పురాలో లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీస్‌లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ ప్రకటించింది. ఆనంద్ గ్రోవర్ తన ఆధ్వర్యంలో నడుస్తోన్న లాయర్స్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2006 నుంచి 2014 మధ్య ఆనంద్ గ్రోవర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.32.39 కోట్లకుపైగా అవకతవకలకు పాల్పడ్డారని హోం శాఖ ఫిర్యాదిచ్చింది. దీంతో సంస్థ అధ్యక్షుడు గ్రోవర్‌పై విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఎ) ఉల్లంఘించారన్న ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగానే గురువారం సోదాలు నిర్వహించింది. ఫిర్యాదులో ఇందిరను నిందితురాలిగా పేర్కొనలేదు. 2009–14లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఇందిర పనిచేశారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇందిర, గ్రోవర్, లాయర్స్ కలెక్టివ్ తరఫున ఓ ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఓ మాజీ ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణల కేసును ఇందిర వాదిస్తుండడంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఖండించిన రాజకీయ పార్టీలు.. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ దాడులను టీఎంసీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎంపీలు మూకుమ్మడిగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ మేరకు వారంతా ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. -
‘మా’ సమస్య పరిష్కారమైంది
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నరేశ్ మధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఈ వివాదం త్వరగానే సద్దుమణిగింది. ఇండస్ట్రీ ప్రముఖులం ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ ఏర్పరచుకొని, జరిగిన సమస్యను పరిష్కరించుకున్నాం అంటూ శనివారం ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, కౌన్సిల్ మరికొన్ని.. వాటిన్నింటిని కలిపితేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇటీవల మా మధ్యలో కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాని కోసం అందరం కలసి ఓ సపరేట్ బాడీ ఏర్పర్చుకున్నాం. ఏదైనా ఇష్యూ ఉంటే ముందు మాలో మేం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ఇష్యూ జరిగినట్టు ఇంకోసారి జరగకూడదని భావించాం. ‘మా’కి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేశాయి. అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. వాళ్లు సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. అగ్రిమెంట్లో లేని చాలా విషయాలు ఇండస్ట్రీ చేతుల్లో ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఏర్పడే వాటిని మేం సెటిల్ చేయలేం కదా? దాని వల్ల మాకు ఎటువంటి లాస్ రాలేదు’’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ‘‘ఇటీవలే ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ అని పెట్టుకున్నాం. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి అనుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా చిన్న సమస్య ఏర్పడింది. అది పరిష్కరించాం. ఇక నుంచి కూడా హెల్తీగానే జరుగుతుంది, జరగాలి కూడా. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కలెక్టివ్ కమిటీనే చూస్తుంది. సాల్వ్ చేస్తుంది. ప్యూచర్లో చేసే ఈవెంట్స్ కూడా ఇది వరకులానే మాములుగానే చేస్తారు’’ అన్నారు. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు, సామాన్యులకు డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంది. ఇందులో కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు రావడం సహజం. మనుషులు కలసి పని చేసేది కాబట్టి. టీఎఫ్ఐ కమిటీ ఏర్పాటు చేసి పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళకు మా సమస్యలను వివరించి, చర్చించుకున్నాం. ఇండస్ట్రీ ఇంకా బెటర్ అవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. గతం గతః. రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బాగా చేయడమే మా లక్ష్యం. త్వరలో మహేశ్‌బాబు ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ సక్సెస్ చేస్తాం. దానికి పూర్తి సపోర్ట్ చేస్తాం. ఇక నుంచి అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా 100శాతం సక్సెస్ చేస్తాం. ఒకటో తారీఖు నుంచి జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాను’’ అన్నారు. ‘‘టీఎఫ్‌సీసీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అన్ని ఫైల్స్‌నీ పెద్దల చేతుల్లో పెట్టాం. ఈ పెద్దలంతా మా ఇద్దరికీ చుట్టాలు కాదు. మొత్తం చూసి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు. ఇకముందు మహేశ్‌బాబు, ప్రభాస్ ప్రోగ్రామ్‌లను కలసి కట్టుగా చేస్తాం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని ఉన్నత స్థితిలో నిలబెట్టడమే మా లక్ష్యం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పి.కిరణ్, డా. కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘మా’ డబ్బుతో టీ కూడా తాగలేదు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో(మా) మరో వివాదం తలెత్తింది. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయింది. దీనిపై స్పందించిన ‘మా’ కార్యవర్గం సోమవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో సమావేశమై చర్చించింది. సమావేశం అనంతరం ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా విలేకరులతో మాట్లాడుతూ –‘‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయనే వార్తల్లో నిజం లేదు. అసోసియేషన్ డబ్బుతో నేను ఇప్పటి వరకూ టీ కూడా తాగలేదు. ఫోన్ కూడా సొంతదే వాడుతున్నా. నా పిల్లల మీద ఒట్టు.. నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని.. కనీసం 5పైసలు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుని, నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తా. అంతేకాదు.. ‘మా’ సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేసుకుంటా. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైంది. త్వరలో ‘మా’ ఎన్నికలు సమీపిస్తున్నందున కొంతమంది తాము చేసే ప్రతి పనిని తప్పుబడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు’’ అన్నారు. ‘మా’ కార్యవర్గ సభ్యుడు, హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. మా సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నూతన బిల్డింగ్ కట్టబోతున్నాం. దీని కోసం చిరంజీవిగారిని కలిస్తే రెండు కోట్లు డొనేషన్ ఇస్తానని చెప్పి, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారు. ఫండ్స్ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేయడంతో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్ కూడా వస్తారు’’ అన్నారు. ‘‘మా’ అసోసియేషన్‌లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయి’’ అని ‘మా’ కోశాధికారి, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. నన్ను దూరం పెట్టారు ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ‘మా’ జనరల్ సెక్రటరీ, నటుడు నరేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందే. విదేశీ కార్యక్రమాల గురించి తను ఎటువంటి వివరాలు నాకు చెప్పలేదు. అమెరికా ఈవెంట్ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్ క్లాస్‌లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేసిన డబ్బంతా ఎవరిది? మహేశ్‌బాబు ప్రోగ్రాం కోసం శివాజీరాజాను నమ్రత దగ్గరకు నేనే తీసుకువెళ్లా. ఆ తర్వాత వేరే వాళ్ల నుంచి నాకు కాల్స్ వచ్చాయని నమ్రత నాకు చెప్పారు. ఈ ప్రయత్నాలు నన్ను తప్పించడానికే. వచ్చే ‘మా’ ఎన్నికల్లో పోటీచేయదలచుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి నా కాల్స్‌కి శివాజీరాజా స్పందించటం లేదు. నిధుల దుర్వినియోగం వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో హైపవర్ నిజనిర్ధాణ కమిటీ వేద్దామంటే శివాజీరాజా అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని చిరంజీవిగారి దృష్టికి కూడా తీసుకువెళ్లాను’’ అన్నారు. -
చర్యలు శూన్యం
► ఐటీడీఏలో అవినీతి పరులను పట్టించుకోని ప్రభుత్వం ► తప్పించుకు తిరుగుతున్న అక్రమార్కులు ► మరికొంత మంది ఇంకా దోచేస్తున్న వైనం సీతంపేట: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఐటీడీఏలో అయితే మరీ చెప్పనక్కర్లేదు. అధికారులే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. గుట్టుచప్పుడుగా ఇప్పటికీ కొంతమంది తమ అక్రమాలను కానిచ్చేస్తుండగా, ఇప్పటికే అక్రమాలు చేసి, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన కొంతమంది అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. మరికొందరు పక్క జిల్లాలకు బదిలీలు చేసుకున్నారు. ఉపకార వేతనాల కుంభకోణాల తరహాలోనే ఐటీడీఏలో చాలా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉపకార వేతనాల కుంభకోణంలో మొత్తం 11 మందిని అరెస్టు చేయడంతో సంచలనం రేగింది. దీనిలో ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖకు చెందిన ఒక డీడీ, ఏటీడబ్ల్యూవో, ఇద్దరు హాన్రోరియం డైరెక్టర్లు ఉన్నారు. వీరి అరెస్టు సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో గతంలో నిధులు దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎరువుల కుంభకోణంలో రూ. 90 లక్షల దుర్వినియోగం ఐటీడీఏ టీపీఎంయూ మండలాలైన సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో ఉద్యానవన రైతులకు ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ఏడాదిన్నర క్రితం రూ. 2 కోట్ల నిధులు వెచ్చించారు. ఉద్యానవన శాఖ ద్వారా వీటిని అందించాల్సి ఉంది. అయితే ఎరువులు, పురుగు మందులు పూర్తిస్థాయిలో సరఫరా చేయకుండా చేసినట్టు రికార్డులు చూపి నిధులు కైంకర్యం చేశారు. రూ. 90 లక్షల మేర నిధులు దుర్వినియోగం కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ కూడా చేశారు. అయితే ఆ విచారణ ఏమైందో తెలియని పరిస్థితి. అలాగే ఎరువులు పంపిణీ చేయకుండా స్థానిక హెచ్ఎన్టీసీలో ఉంచడం, తర్వాత పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వాటిపై ఆరాతీయడం వంటివి జరిగాయి. అయితే సంబంధిత పీహెచ్‌వోకు ఇతర జిల్లాలకు బదిలీ జరిగింది తప్ప చర్యలు చేపట్టలేదు. హౌసింగ్ అక్రమాలపై చర్యలేవి? ఇందిరమ్మ గృహనిర్మాణాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపి చాలాచోట్ల నిధులను హౌసింగ్ సిబ్బంది కాజేశారు. సుమారు రూ. 2 కోట్ల మేర వీటిలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతికి పాల్పడిన సిబ్బందిపై ఎటువంటి చర్యలు లేవు. మళ్లీ కొంతమంది వర్క్ ఇన్స్పెక్టర్లకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు కట్టబెట్టినట్టు తెలిసింది. మరోవైపు గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌శాఖలో అక్రమాలకు అడ్డూ అదుపు లేదు.గతంలో ఇంజినీరింగ్‌శాఖ ద్వారా నిర్మించిన రహదారుల్లో 42 చోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.వీటిపై విచారణ చేయాలని పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు నిలదీశారు. పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తీర్మానించారు. విచారణ అతీగతి లేదు. బాలబడులు, న్యూట్రీషియన్ కేంద్రాల్లో సుమారు రూ. 2 కోట్లు అక్రమాలు జరిగాయని ఆ శాఖాధికారులే గుసగుసలాడుకుంటున్నారు. దీనిపై విచారణ చేశారు. అనంతరం సంబంధిత ఏపీఎంలకు వేరే జిల్లాల్లో పోస్టింగ్‌లు సైతం ఇచ్చేశారు. దీనిపై ఎటువంటి చర్యలు లేవు. రెండేళ్ల క్రితం మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీ నిధులు ఎంఆర్సీలో స్వాహా జరిగాయి. వాటిపై విచారణలు తప్ప చర్యలు శూన్యం. ఐటీడీఏ పీవో ఏమన్నారంటే... ఈ విషయాలపై ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. పాత కుంభకోణాల విషయమై పరిశీలించాల్సి ఉందన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. ఐటీడీఏలో కోట్లాది రూపాయలు కుంభకోణాలు జరిగితే గిరి జన సంక్షేమ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎటువంటి విచారణలు చేపట్టడంలేదు. ప్రభుత్వం అవినీతి పరులకు కొమ్ముకాస్తుంది. ఇప్పటికైనా స్పందన రావాలి. నిజాలు నిగ్గుతేల్చాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ -
మరమ్మతుల పేరుతో దోపిడీ
కార్పొరేషన్లో వాహనాల బాగోతం కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై వాటాల పంపిణీ నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థలో అడుగడుగునా దోపిడీ జరుగుతోంది. ప్రతి విభాగంలో కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు కమీషన్ల రూపేణా దోచుకుంటున్నారు. చెత్తను తరలించే వాహనాల మరమ్మతుల పేరుతో ప్రతి నెలా రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ చెందిన సొంత వాహనాలు 83 ఉన్నాయి. వీటిలో 20 లారీలు, 54 ఆటోలు, 4 ట్రాక్టర్లు, 5 డంపర్లు ఉన్నాయి. వీటిలో కేవలం 60 వాహనాలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో చెత్తను సేకరించి దొంతాలి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తుంటారు. అయితే నిత్యం చెత్తవాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. కేవలం మరమ్మతులకే ఏడాదికి రూ.50 లక్షలపైన ఖర్చు చేస్తుండటం గమనార్హం. పాత వాహనాలే వినియోగం నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్న సమయం నుంచి వినియోగిస్తున్న వాహనాలనే ప్రస్తుతం అధికారులు నెట్టుకొస్తున్నారు. ఏ క్షణం ఎక్కడ వాహనం నిలిచిపోతుందో అర్థకాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని వాహనాలకు బ్రేకులు పడకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఉన్న వాహనాలతోనే చెత్తను తరలిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాల్లో 90 శాతం కాలం చెల్లినవే ఉన్నాయి. కార్పొరేషన్ వాహనాలు కావడంతో రవాణా శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దోపిడీ.. వాహనాలు నిత్యం మరమ్మతులకు గురికావడంతో కార్పొరేషన్ నిధుల నుంచి ప్రతి నెలా లక్షలను ఖర్చుచేయాల్సి వస్తోంది. వాహనాల రిపేర్లు, స్పేర్‌పార్ట్స్‌ను తీసుకొచ్చే పనులను కాంట్రాక్టర్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో స్పేర్‌పార్ట్స్ ధర రూ.వెయ్యి కాగా రూ.రెండు వేలుగా ఎస్టిమేషన్ వేసి దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రిపేర్లు చేస్తున్నట్లు రూ.వేల కార్పొరేషన్ నిధులను కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టర్లు డీఈ, ఏఈ స్థాయిలో అధికారులకు పర్సంటేజీలను ప్రతి నెలా ఇస్తుండాలి. ఇవి రాకపోతే బిల్లులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తుంటారు. కొత్త వాహనాల కొనుగోలుపై దృష్టేదీ..? ఏళ్ల నాటి వాహనాలను వినియోగిస్తున్న కార్పొరేషన్‌కు కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా పాలకవర్గం చోద్యం చూస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా ఖర్చు పెట్టే నిధుల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరుతుంది. అధికార పార్టీ చెందిన ఓ నాయకుడు మరమ్మతులు చేసే కాంట్రాక్టర్ వద్ద ప్రతి నెలా పర్సంటేజీలను తీసుకుంటున్నారని సమాచారం. -
చిక్కుల్లో పాడేరు డీఎల్పీఓ ?
- నివేదిక ఇవ్వడంలో అలసత్వం వహినందుకే? - నేడో రేపో కమిషనర్‌కు ఫిర్యాదు - డీఎల్పీఓకు రెండు నోటీసులు ఇచ్చిన డీపీఓ! మహారాణిపేట: నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదులో విచారణ చేపట్టిన పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి రామ్‌ప్రసాద్ చిక్కుల్లో కూరుకుపోతున్నట్లు కనబడుతోంది. నిధుల దుర్వినియోగం పూర్తి స్థాయి విచారణ చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వస్తుండడంతో.. పై అధికారులు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. పాడేరు డివిజన్లో పది నెలల కిందట 18 పంచాయతీల్లో సుమారు రూ. 57 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఓ ఎమ్మెల్సీ కలెక్టర్ చేసిన ఫిర్యాదుతో అసలు డొంక కదిలింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో విచారణ చేపట్టి ఆ నిధులను వెనక్కి రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరావును కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన డీఎల్పీఓ రామ్ ప్రసాద్‌ను దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఇదంతా గతేడాది ఆగస్టులో జరిగిన తతంగం. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఒక్క డుంబ్రిగూడ మండలంలోనే 18 పంచాయతీల్లోనే రూ.57.76లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో ఆయా పంచాయతీల సర్పంచ్ల చెక్ పవర్లను రద్దు చేసి ఆ అధికారాన్ని ఈఓపీఆర్టీలకు అప్పగించారు. పంచాయతీల్లో అవసరం మేరకే నిధులు డ్రా చేసి ఖర్చు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ పంచాయతీల్లో పని చేస్తూ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన గ్రామ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని కోరారు. ఏడాదవుతున్నా నిధులు ఎందుకు రికవరీ చేయలేదు.. నిధులు దుర్వినియోగం పై విచారణ జరిగి పదినెలలవుతున్నా ఆ నిధులను ఎందుకు రికవరీ చేయలేకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు డీఎల్పీఓ కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉండడంతో.. ఈ విచారణ నివేదికను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారని పలువురు అంటున్నారు. సోమవారంలోగా నిధుల దుర్వినియోగం పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వకపోతే డీఎల్పీఓ పై పంచాయతీ శాఖ కమిషనర్ కు కలెక్టర్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో డీఎల్పీఓకు డీపీఓ రెండు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ నిధుల భాగోతం ఏ మలుపులు తిరుగుతుందో మరి.? చెక్ పవర్ రద్దు చేశాం.. నిధుల దుర్వినియోగం అవుతున్నాయనే ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. జిల్లాలో పాడేరు డివిజన్లో 18 పంచాయతీల సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేశాం. నిధుల రికవరీకి ఆదేశించాం. త్వరలో నిధులు వెనక్కి రాబడతాం. వీటితో పాటు విశాఖ డివిజన్లో మరో 4 పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై చేపట్టిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆయా సర్పంచ్ల చెక్పవర్లను రద్దు చేశాం. టి.వెంకటేశ్వరరావు,జిల్లా పంచాయతీ అధికారి -
ఒక నెల పనికి..రెండు జీతాలు..!
చింతపల్లి సబ్ ట్రెజరీలో మరో వింత సాంకేతిక లోపమే అంటున్న అధికారులు చింతపల్లి : చింతపల్లి సబ్ ట్రెజరీలో నిధుల దుర్వినియోగం కుంభకోణాన్ని మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. కొందరు ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బందులు పడుతుంటే, మరికొందరు ఉద్యోగులకు ఒకే నెలకు రెండు సార్లు వేతనాలు జమకావడం చర్చనీయాంశమైంది. ఈ సబ్ ట్రెజరీలో వైద్య ఆరోగ్యశాఖలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట రూ.కోట్ల నిధుల దుర్వినియోగంపై ఎస్టీఓ లోకేశ్వరరావు, అకౌంటెంట్ అప్పలరాజులపై వేటు పడటం తెలిసిందే. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాల బడ్జెట్ రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి వేతన బిల్లుల చెల్లింపుల్లో ప్రవేశ పెట్టిన నూతన విధానాలు ఆన్లైన్ చేయించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వివిధ శాఖలకు చెందిన వంద మంది ఉద్యోగుల వేతనాలు వారి అకౌంట్లలో జమకాలేదు. వారంతా వేతనాలకోసం ప్రతి రోజూ సబ్‌ట్రెజరీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. హైదరాబాద్ ప్రధాన ఖజానా కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగులకు ఒకే నెలలో రెండుసార్లు వేతనాలు జమ అయ్యాయి. ఈ విషయాన్ని కొంతమంది సహకార ఉద్యోగులు ట్రెజరీ అధికారులకు సమాచారం అందించారు. చింతపల్లి ఐసీడీఎస్‌కు అదనంగా రూ.7.30 లక్షల వరకు నిధులు జమ అయ్యాయి. స్థానిక కేంద్రీకృత ఆశ్రమ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, పశువుల ఆస్పత్రిలోని కొంతమంది ఉద్యోగులకు ఒకే నెలలో రెండు నెలలకు సంబంధించిన వేతనాలు జమ అయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. బిల్లింగ్ నమోదులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా రెండోసారి వారి ఖాతాల్లోకి వేతనాలు జమ అయ్యాయని, వాటిని సీఎన్బీ ఖాతాల్లోకి బదిలీచేస్తున్నారని ఇన్చార్జి ఎస్టీవో శ్రీనివాసులు తెలిపారు. -
పంచాయతీ నిధులు రూ.1.26 కోట్లు స్వాహా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామానికి ప్రథమ పౌరులు సర్పంచులు. అయితే, నిధుల దుర్వినియోగంతో కొందరు తమ పేరుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో నిధుల విని యోగంలో చేతివాటం చూపిస్తున్నారు. పలువురు సర్పంచులు పనులు చేయకుండానే రూ.3.23 కోట్లు కాజేశారు. 2006 నుంచి 2013 వరకు అనే క పద్దుల కింద గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల య్యాయి. వీటితోపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్)ను ఇష్టారాజ్యంగా వాడుకున్న సర్పంచులపై నేటికీ చర్యలు లేవు. పదవి నుంచి వైదొలగిన 165 మంది మాజీ సర్పంచుల వద్దే రూ.1,25,54,516 ఉన్నాయి. 2013 జూన్‌లో జరిగిన ఎన్నికలలో కొత్త సర్పంచులు అధికారం చేపట్టారు. ఇందులో కొందరు గత సర్పంచులనే ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇదీ సంగతి నిధుల దుర్వినియోగంలో జిల్లావ్యాప్తంగా 17 మంది సర్పంచులపై ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు వెనుకబడిన ప్రాం తాల అభివృ ద్ధి నిధుల(బీఆర్జీఎఫ్)ను విడుదల చేసింది. జడ్పీ, ఎంపీ, జీపీ సెక్టార్ల కింద రూ.106.50 కోట్లు విడుదల కాగా, ఇందులో గ్రామ పంచాయతీ సెక్టారు కింద సుమా రుగా రూ. 53 కోట్ల వరకు ఉన్నాయి. ఏడాదికి రూ.21.54 కోట్ల వరకు బీఆర్జీ నిధులు విడుదల కాగా, జడ్పీ సెక్టార్‌కు 20 శాతం, మండల సెక్టార్‌కు 30 శాతం పోను గ్రామ పంచాయతీ సెక్టార్‌కు 50 శాతం కేటాయిస్తూ వచ్చా రు. ఏటా గ్రామాలలో అభివద్ధి పేరిట బీఆర్జీ నిధులను ముందస్తుగా డ్రా చేసిన ప్రజాప్రతినిధులు నిధుల వి నియోగానికి సంబంధించిన ఎంబీ(మేజర్మెంట్ బుక్)లు, యూసీ(యూటిలైజేషన్ సర్టిఫికెట్)లు సమర్పించడంలో విపరీతమైన జాప్యాన్ని ప్రదర్శించారు. ఈ వ్యవహా రంపై మూడేళ్ల తర్వాత ఆరా తీసిన అధికారులు అక్రమాలు జరిగినట్లు తేల్చారు. కొంతమంది సర్పంచుల చెక్‌పవర్ రద్దు చేసి, ఇంకొందరిపై కేసులు పెట్టారు. 2012 డిసెంబర్ నాటికి మొత్తంగా రూ.3,23,16,550 దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. 2013 మేలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, బకాయి ఉంటే పోటీకి అనర్హు లని, ఆర్ఆర్ యాక్టు, క్రిమినల్ కేసులు పెడతామని ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేసిన అధికారులు రూ.1.97 కోట్లు రికవరీ చేశారు. జూన్‌లో జరిగిన ఎన్నికలలో కొ త్త పాలకవర్గం ఎన్నిక కాగా, మాజీ సర్పంచులు 165 మంది మాత్రం రూ.1,25,54,516 తమవద్దే పెట్టుకున్నారు. హిట్ లిస్టులో 29 మంది మాజీలు రూ.1.26 కోట్ల బీఆర్జీఎఫ్ స్వాహాపై చర్యలు నోటీసులకే పరిమితం అవుతున్నాయి. జిల్లా పంచాయతీ అధికారి పలుమార్లు నోటీసులు జారీ చేసినా క్షేత్రస్థాయి అధి కారులు కొందరు స్వాహారాయుళ్లకు అండగా ఉండటం చర్చనీయాంశం అవుతోంది. వసూలు చేయగా మిగిలిన రూ.1.26 కోట్లలో 165 మంది మాజీ సర్పంచుల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఇందులో రూ. లక్ష నుంచి రూ.6.54 లక్షలకు వరకు నిధులు మింగిన 29 మంది మాజీలను హిట్‌లిస్టులో చేర్చారు. పిట్లం, బిచ్కుంద, రెంజల్, మద్నూరు, సదాశివనగర్, దోమకొండ, మాచారెడ్డి, గాంధారి, లింగంపేట, నిజాంసాగర్, సిరికొండ, బాల్కొండ, బోధన్, నవీపేట, ధర్పల్లి, డిచ్పల్లి మండలాలకు చెంది న పలువురు ఉన్నారు. అధికారుల ఉదాసీనత ఇదిలా ఉండగా, గతంలో నిధుల స్వాహాకు పాల్పడిన కొందరు సర్పంచుల నుంచి నిధులు రికవరీ చేయకుండా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శ లున్నాయి. కొత్తగా ఎన్నికైన కొందరు సర్పం చులు దీనిని అదునుగా తీసుకుని నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో 17 మం దిపై ఇటీవల ఆరోపణలు రాగా వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆర్మూరు మండలం గోవింద్‌పేట సర్పంచ్ ప్రభాకర్‌కు మాత్రం షోకాజ్ నోటీసు జారీ చేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీ నిధులు మొత్తం రూ.3,48,337 దుర్వినియోగం అయినట్లు విచారణ జరిపిన ఆర్మూరు డీఎల్పీఓ నివేదిక సమర్పించారు. ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం డీపీఓ ఇటీవల సర్పంచుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో సర్పంచులలో కలకలం బయలు దేరింది. ఏదేమై నా గతంలో స్వాహా అయిన నిధులను పూర్తిగా రికవరీ చేయడంతోపాటు, భవిష్యత్‌లోను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని ప్రజలు ఉన్నతాధికారుల ను కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్కారు నిధులను దుర్వినియోగం చేస్తే రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్టు) ప్రయోగించాలని, లేదా క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినా, క్రిందిస్థాయి సిబ్బంది ఎక్కడా పాటించిన దాఖలాలు లేవు. -
గిరిజన సంక్షేమంలో ఫిర్యాదులపై విచారణ
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో సిబ్బంది పనితీరు, నిధుల దుర్వినియోగం పై వెల్లువెత్తిన ఫిర్యాదులపై ఆ శాఖ కమిషనరేట్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్. రత్నమాల విచారణ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కర్నూలుకు చేరుకున్న ఆమె మంగళవారం మధ్యాహ్నం వరకు జిల్లా కార్యాలయంలో, నగరంలోని ఆ శాఖ కార్యాలయాలకు వెళ్లి పలు ఫైళ్లను పరిశీలించారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయ ఉద్యోగులను ఆమె ప్రత్యేకంగా ఒక్కొక్కరిని పిలిపించి విచారించి రాత పూర్వకంగా వారి వాదనలను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే గిరిజన విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పలువురు కార్యాలయానికి వచ్చి డీడీకి వినతి పత్రాలను అందజేశారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒకరిద్దరు ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన విషయాన్ని కూడా ఆమె తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే గిరిజన సంక్షేమంలో భాగంగా వివిధ పథకాల అమలుకు సంబంధించి విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం తదితర విషయాలను ఆరా ఆమె తీశారు. అధికారి, సిబ్బంధి మధ్య ఉన్న సమన్వయంతో పాటు కార్యాలయంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఫిర్యాదు మేరకు ఆయా ఫైళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ విచారణకు వచ్చిన విషయం వాస్తవమేనని, అయితే ఫిర్యాదులకు సంబంధించి చేపట్టిన విచారణ కాన్ఫిడెన్షియల్ అని, విచారణ నివేదికలతో పాటు సంబంధిత ఫైళ్లను కమిషనర్‌కు అందజేస్తామని డీడీ చెప్పారు. -
సమాంతర సామాజిక తనిఖీకి మంగళం
గోడలపై నిలిచిపోయిన రాతల ప్రక్రియ లక్షలాది నిధులు దుర్వినియోగం ‘ఉపాధి హామీ’లో ఇష్టారాజ్యం సమగ్ర పారదర్శకత ఇక కరువే గజ్వేల్, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించే ల క్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలకు అర్ధంతరంగా బ్రేక్ పడింది. ఆరు నెలలకోసారి చేపడుతున్న సామాజిక తనిఖీ ద్వారా అక్రమాల నివారణ సాధ్యం కావడం లేదనే భావనతో ప్రభుత్వం నెలకోసారి సమాంతర సామాజిక తనిఖీ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ విధానం సత్ఫలితాలను ఇవ్వడంలేదనే సాకు తో అధికారులు ఎత్తేసినట్లు తెలుస్తోది. ఫలి తంగా అన్ని గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద గోడలపై రాసి నెలవారీ నివేదికలు పొందుపరచాల్సివుండగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలోని అయా మండలాల్లో సమాం తర సామాజిక తనిఖీ బాధ్యతలను గతంలో ఎంపీడీఓలు, ఉపాధి హామీ పథకం ఏపీడీ, ఏపీఓలకు అప్పగించారు. ఉపాధి హామీ ద్వారా చేపట్టిన పనులపై ప్రతి ఆరు నెలలకోసారి సామాజిక తనిఖీలు జరుగుతుండగా దీనిద్వారా అక్రమాల నివారణ పూర్తిస్థాయిలో జరగడం లేదనే భావనతో కొత్తగా నెలకోసారి సమాంతర సామాజిక తనిఖీని చేపట్టాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రతి గ్రామంలో ప్రధాన కూడలి వద్ద గోడలను ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో నెలవారీగా జరుగుతున్న ఉపాధి హామీ పనుల వివరాలు, శ్రమశక్తి సం ఘాల వివరాలు, కూలీల వివరాలు, వేతనాల వివరాలు పారదర్శకంగా తెలియజేసే విధంగా పెయింటింగ్ చేస్తారు. ఏమైనా అక్రమాలు కనుక చోటు చేసుకుంటే కూలీలు అప్పటికప్పుడు అధికారులకు ఫిర్యా దు చేసి న్యాయం పొందవచ్చని ఈ తనిఖీ ఉద్దేశం. ఈ క్రమంలోనే జిల్లాలోని కొన్ని మం డలాల్లో 2012 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం జిల్లాలోని ఒక్కో మం డలానికి కొలతల రూపేణా లక్షల్లో నిధు లు వచ్చాయి. గోడలపై రాతల విషయంలో ఎక్క డా కూడా నిబంధనలు అమలు కాలేదు. ఎంపీడీఓలు స్థానికంగా అందుబాటులో ఉన్న ము గ్గురు నుంచి నలుగురు వరకు ఆర్టిస్టులను ఎం పిక చేసుకొని వేగవంతంగా ప్రక్రియ పూర్తిచేయాల్సివుండగా.. అసమగ్రంగా సాగింది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్, ములుగు, తూప్రాన్, జగదేవ్‌పూర్ మండలా ల్లో సమాంతర సామాజిక తనిఖీ ప్రక్రియ కా గా ఆయా గ్రామాల్లో పెయింటింగ్ వేసిన బో ర్డులపై ఇంకా శ్రమశక్తి సంఘాల పనుల విలువ, నెలరోజుల్లో వారికి చెల్లించిన వేతనాల మొత్తం వంటి వివరాలు ఇప్పటికీ నమోదు కాలేదు. ఆగిన ప్రక్రియ... ఉపాధి పనుల్లో పారదర్శకతను పెంపొందించాల్సిన వాల్‌రైటింగ్ ప్రక్రియలో నిబంధనలు అమలుకు నోచుకోక ఆర్టిస్టులతో కుమ్మక్కై మండలస్థాయి అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిని నివారించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సంబంధిత అధికారులు బాధ్యతను మరిచి... లక్ష్యం నెరవేరడంలేదనే సాకుతో అర్ధంతరంగా నిలిపివేశారు. అందువల్లే రెండేళ్లుగా గ్రామాల్లో సమాంతర సామాజిక తనిఖీ వాల్‌రైటింగ్స్ గ్రామాల్లో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఉన్నతస్థాయి సమీక్షలో వివరాలు తెలుస్తాయి... సమాంతర సామాజికి తనిఖీ వ్యవహారం రెండేళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉంది. ఇకముందు ఉంటుందా? లేదా? అనే విషయం కొద్దిరోజుల్లో ఉన్నతస్థాయిలో నిర్వహించనున్న సమీక్షలో తేలనుంది. జిల్లాలోని పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. -హరినాథ్‌బాబు, ఉపాధిహామీ పథకం జిల్లా అదనపు ప్రాజెక్ట్ డెరైక్టర్ -
సీబీఐతో దర్యాప్తు చేయించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవోల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో రూ. 787 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం స్పందించింది. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీసీఎస్ డీసీపీలతో పాటు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రాజమల్లయ్య, మరో ఇద్దరు దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రమేష్ రంగనాథన్ బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రీపాద ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. సొసైటీ అధ్యక్షుడు స్వామిగౌడ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, అనర్హులకు సభ్యత్వం ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సంబంధం లేని ఉద్యోగులను, ఇతర జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులను సొసైటీలో చేర్చుకున్నారని.. అది సొసైటీ బైలాస్కు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై ఇంతకుముందే హైకోర్టును ఆశ్రయించామని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో స్వామిగౌడ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ నిర్ణయాలు తీసుకుందని, పలువురు వ్యక్తులకు అయాచిత లబ్ధి చేకూర్చిందని ప్రభుత్వం తన విచారణలో తేల్చిందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా సహకార అధికారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్వామిగౌడ్‌పై గత ఏడాది కేసు నమోదు చేశారని.. కానీ ఇప్పటివరకూ ఆయనను అరెస్ట్ చేయలేదని చెప్పారు. దీనిని బట్టి దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని అర్థమవుతోందని ప్రభాకర్ కోర్టుకు వివరించారు. ఈ కేసును సీసీఎస్‌కు బదలాయించినా పురోగతి లేదని, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేశారు.