సురేశ్‌బాబు, శివాజీరాజా, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, నరేశ్, కిరణ్
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నరేశ్ మధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఈ వివాదం త్వరగానే సద్దుమణిగింది. ఇండస్ట్రీ ప్రముఖులం ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ ఏర్పరచుకొని, జరిగిన సమస్యను పరిష్కరించుకున్నాం అంటూ శనివారం ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, కౌన్సిల్ మరికొన్ని.. వాటిన్నింటిని కలిపితేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇటీవల మా మధ్యలో కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాని కోసం అందరం కలసి ఓ సపరేట్ బాడీ ఏర్పర్చుకున్నాం. ఏదైనా ఇష్యూ ఉంటే ముందు మాలో మేం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ఇష్యూ జరిగినట్టు ఇంకోసారి జరగకూడదని భావించాం. ‘మా’కి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేశాయి. అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు.
వాళ్లు సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. అగ్రిమెంట్‌లో లేని చాలా విషయాలు ఇండస్ట్రీ చేతుల్లో ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఏర్పడే వాటిని మేం సెటిల్ చేయలేం కదా? దాని వల్ల మాకు ఎటువంటి లాస్ రాలేదు’’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ‘‘ఇటీవలే ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ అని పెట్టుకున్నాం. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి అనుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా చిన్న సమస్య ఏర్పడింది. అది పరిష్కరించాం.
ఇక నుంచి కూడా హెల్తీగానే జరుగుతుంది, జరగాలి కూడా. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కలెక్టివ్ కమిటీనే చూస్తుంది. సాల్వ్ చేస్తుంది. ప్యూచర్‌లో చేసే ఈవెంట్స్ కూడా ఇది వరకులానే మాములుగానే చేస్తారు’’ అన్నారు. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు, సామాన్యులకు డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంది. ఇందులో కొన్ని వెల్‌ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు రావడం సహజం.
మనుషులు కలసి పని చేసేది కాబట్టి. టీఎఫ్‌ఐ కమిటీ ఏర్పాటు చేసి పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళకు మా సమస్యలను వివరించి, చర్చించుకున్నాం. ఇండస్ట్రీ ఇంకా బెటర్ అవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. గతం గతః. రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బాగా చేయడమే మా లక్ష్యం. త్వరలో మహేశ్‌బాబు ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ సక్సెస్ చేస్తాం. దానికి పూర్తి సపోర్ట్ చేస్తాం. ఇక నుంచి అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా 100శాతం సక్సెస్ చేస్తాం. ఒకటో తారీఖు నుంచి జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాను’’ అన్నారు.
‘‘టీఎఫ్‌సీసీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అన్ని ఫైల్స్‌నీ పెద్దల చేతుల్లో పెట్టాం. ఈ పెద్దలంతా మా ఇద్దరికీ చుట్టాలు కాదు. మొత్తం చూసి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు. ఇకముందు మహేశ్‌బాబు, ప్రభాస్ ప్రోగ్రామ్‌లను కలసి కట్టుగా చేస్తాం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని ఉన్నత స్థితిలో నిలబెట్టడమే మా లక్ష్యం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పి.కిరణ్, డా. కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment