న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్‌సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధానమంత్రి నిధులను దుర్వినియోగం చేసిందంటూ, గాంధీ కుటుంబంపై చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షం నిరసనలకు దిగింది. పీఎం రిలీఫ్ çఫండ్‌ను ఇప్పటి వరకు రిజిస్టర్ చేయించనేలేదని ఠాకూర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు.
దీనిపై కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. పలువురు సభ్యులు తమ స్థానాల నుంచి నిలుచుని మాట్లాడుతుండటంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే సస్పెండ్ చేస్తామని వారిని హెచ్చరించారు. అయినా నిరసనలు ఆపకపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి కూడా సభను రెండుసార్లు వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలకు కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు. ప్రతి రోజు ఉదయం ఉభయ సభలకు చెందిన ఎంపీలు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30% తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శుక్రవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్‌పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్ష సభ్యులు, ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారమే ఆమోదించగా, శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది.
హర్‌సిమ్రత్ రాజీనామా ఆమోదం
కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment