సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవోల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో రూ. 787 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం స్పందించింది. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీసీఎస్ డీసీపీలతో పాటు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రాజమల్లయ్య, మరో ఇద్దరు దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రమేష్ రంగనాథన్ బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రీపాద ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. సొసైటీ అధ్యక్షుడు స్వామిగౌడ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, అనర్హులకు సభ్యత్వం ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
సంబంధం లేని ఉద్యోగులను, ఇతర జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులను సొసైటీలో చేర్చుకున్నారని.. అది సొసైటీ బైలాస్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై ఇంతకుముందే హైకోర్టును ఆశ్రయించామని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో స్వామిగౌడ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ నిర్ణయాలు తీసుకుందని, పలువురు వ్యక్తులకు అయాచిత లబ్ధి చేకూర్చిందని ప్రభుత్వం తన విచారణలో తేల్చిందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా సహకార అధికారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్వామిగౌడ్‌పై గత ఏడాది కేసు నమోదు చేశారని.. కానీ ఇప్పటివరకూ ఆయనను అరెస్ట్ చేయలేదని చెప్పారు. దీనిని బట్టి దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని అర్థమవుతోందని ప్రభాకర్ కోర్టుకు వివరించారు. ఈ కేసును సీసీఎస్‌కు బదలాయించినా పురోగతి లేదని, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేశారు.
సీబీఐతో దర్యాప్తు చేయించండి: హైకోర్టు
Published Thu, Oct 24 2013 1:45 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement