సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో పదివారాల గడువు కోరిన ఎస్సెల్ జీ గ్రూపునకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో తమ గ్రూప్ చర్చలు జరపాల్సి ఉందని.. ఈ విషయంలో ప్రముఖ రాజకీయనేత అమర్‌సింగ్ కూడా ప్రభుత్వంతో సమావేశం కావాల్సి ఉన్నందున మరింత సమయం కోరుతూ ఫౌండేషన్ చేసిన వినతిని హైకోర్టు ధర్మాసనం సోమవారం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. దీనిపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేస్తూ తెరవెనుక వ్యక్తులతో తమకు సంబంధంలేదని తేల్చిచెప్పింది. అంతేకాక, టేకోవర్ విషయంలో తన వైఖరి ఏమిటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. కాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల విలువకు, చెల్లించాల్సిన అప్పులకు పొంతన లేదంటూ టేకోవర్ నుంచి ఫౌండేషన్ ఇప్పటికే తప్పుకుంది. కానీ, తాజాగా ప్రభుత్వంతో చర్చ పేరుతో గడువు కోరడం.. అమర్‌సింగ్ పేరును ప్రస్తావించడంతో ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
ఆస్తులకూ, అప్పులకూ వ్యత్యాసం
విచారణలో భాగంగా సోమవారం సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది పి. శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను మదింపు చేయించామన్నారు. ఆస్తుల విలువ రూ.4,262 కోట్లు ఉండగా అప్పులు రూ.10వేల కోట్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో టేకోవర్ నుంచి పక్కకు తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే సమయంలో తమ ఫౌండేషన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమర్‌సింగ్ తమకు తెలిపారని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి స్పష్టత కోసం 8–10 వారాల గడువునివ్వాలని కోరారు.
ప్రభుత్వమే ఎందుకు తీసుకోదు..?
దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలను టేకోవర్ చేసుకోవడం ఆర్థికంగా మీకు సాధ్యం కానప్పుడు, ఇక వాయిదా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. తప్పుకుంటామని చెబుతూనే తెర వెనుక ఉన్న ఎవరో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని, వాటిని తాము పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. గడువునిచ్చినంత మాత్రాన రూ.7,500 కోట్ల వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోతుందా? అంటూ ప్రశ్నించింది.
తెర వెనుక వ్యక్తి చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తే డిపాజిటర్లను ప్రభుత్వమే కాపాడాల్సి ఉంటుంది. అయినా, సంయుక్తంగా ఎందుకు? ప్రభుత్వమే స్వయంగా ఎందుకు తీసుకోరాదు.?’ అని ప్రశ్నించింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది అర్జున్ స్పందిస్తూ.. ప్రభుత్వమే టేకోవర్ చేస్తామంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. దీనిపై ధర్మాసనం, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్ వివరణ కోరింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు రెండు వారాల గడువు కావాలని ఆయన కోరగా ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అక్షయ గోల్డ్ కేసుల విచారణ సైతం 25వ తేదీకి వాయిదా పడింది. గుర్తించిన ఆస్తుల వేలం డ్రాఫ్ట్ నోటీసును తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
తెరవెనుక వ్యక్తులతో మాకు సంబంధం లేదు
Published Tue, Apr 10 2018 1:46 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment