సేల్ సర్టిఫికెట్ జారీ చేయబోం..
- ‘సదావర్తి’ భూములపై హైకోర్టుకు ఏపీ సర్కారు నివేదన
- ఏజీ చెప్పిన విషయాలను నమోదు చేసిన ధర్మాసనం
- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం
- సదావర్తి భూముల వేలంపై ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్
- సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థన
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఉన్న సదావర్తి భూముల్ని వేలం ద్వారా దక్కించుకున్న వారికి సేల్ సర్టిఫికెట్ జారీ చేయబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
సదావర్తి భూముల వేలం వ్యవహారంలో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 150 ఏళ్లక్రితం సదావర్తి సత్రానికి రాజా వాసిరెడ్డి పెద్ద మొత్తంలో భూముల్ని దానంగా ఇచ్చారని, ప్రస్తుతం 83 ఎకరాలే మిగిలిందని, మిగతా వందల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని, ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఇలా జరిగిందని తెలిపారు.
ఏపీ సర్కారు ఇటీవల ఈ 83 ఎకరాల భూమిని ఎకరా రూ.26 లక్షల చొప్పున వేలంద్వారా విక్రయించిందన్నారు. వాస్తవానికి ఎకరా రూ.7 కోట్ల వరకు ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇంతకీ భూములు ఎక్కడున్నాయంది. మద్రాసులో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సమీపంలో ఉన్నాయని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. ఇంతలో ఏజీ కల్పించుకుంటూ.. సదావర్తి భూములు భారీగా ఆక్రమణలకు గురయ్యాయని, ప్రస్తుతం 83 ఎకరాలే మిగిలిందని, దీనిని ఆక్రమణల నుంచి కాపాడేందుకే వేలంద్వారా విక్రయించామని చెప్పారు. ఈ వేలంపై గతంలోనూ పిల్ దాఖలైందని, దాన్ని ఇదే కోర్టు కొట్టేసిందన్నారు.
వేలంద్వారా వచ్చిన మొత్తం కన్నా రూ.5 కోట్లు ఎక్కువ చెల్లిస్తే ఆ భూముల్ని పిటిషనర్‌కు ఇచ్చేందుకు తమకభ్యంతరం లేదన్నారు. రూ.5 కోట్లు డిపాజిట్ చేస్తే గతంలో నిర్వహించిన వేలాన్ని రద్దుచేసి తిరిగి వేలం నిర్వహిస్తామని చెప్పారు. వేలం పూర్తయిందని, అయితే దాన్ని ఇంకా ఖరారు చేయలేదని, అంతేగాక సేల్ సర్టిఫికెట్ కూడా జారీ చేయలేదని, ప్రస్తుతానికి జారీ చేయబోమని వివరించారు. దీన్ని నమోదు చేయమంటారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. నమో దు చేయవచ్చని ఏజీ చెప్పడంతో.. ఆయన పేర్కొన్న విషయాల్ని నమోదు చేసింది.