టీడీపీ సర్కారుకు నోటీసులు
- ‘కేసుల ఉపసంహరణ’ పై నోటీసులు జారీచేసిన హైకోర్టు
- సంబంధిత జీవోలను కొట్టేయాలంటూ ఎమ్మెల్యే ఆర్కే దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై నమోదైన పలు కేసులను ఉపసంహరించిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.
కేసుల ఉపసంహరణ రాజ్యాంగ విరుద్ధమంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తోన్న కోర్టు.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. నిర్ణీత గడువులోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు అంతా కలుపుకొని మొత్తం 251 మందిపై నమోదయిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం వివిధ తేదీల్లో 120 జీవోలను జారీచేసింది. వీరిపై నమోదైన కేసులకు సంబంధించి పలు కోర్టుల్లో సాగుతున్న ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయా కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, వాటిలో అత్యాచారాలు, హత్యాయత్నాలు వంటి తీవ్రమైన కేసులు కూడా ఉండటంతో ఆ జీవోలపై వివాదం రాజుకుంది.
కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆక్షేపించారు. సంబంధిత జీవోలను కొట్టివేయాలని కోరుతూ జులై 30న ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. పిల్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌లో.. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పలు జిల్లాల కలెక్టర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు సిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, టీవీ రామారావు, గొల్లపల్లి సూర్యారావు, దాట్ల సుబ్బరాజు, దాసరి బాలవర్ధన రావు, చింతమనేని ప్రభాకర్, ఎ.ఆనందరావు, ఎం.అశోక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కరణం బలరాం, రెడ్డి సుబ్రహ్మణ్యంలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలను కలిపి మొత్తం 251 మందిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.