సదావర్తి భూముల కేసులో ఏపీ సర్కార్ కు షాక్
హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల వేలం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగలింది. కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కొందరికి లబ్ధి చేకూర్చేందుకు మార్కెట్ విలువ కంటే తక్కువగా భూములు విక్రయించారంటూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు హైకోర్టు ఆదేశాలను ఎమ్మెల్యే ఆర్కే స్వాగతించారు. సత్రం భూముల అమ్మినవారికి తక్షణమే సేల్ సర్టిఫికెట్ ఇవ్వరాదని కోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. దేవుడ్ని కూడా చంద్రబాబు లెక్క చేయటం లేదని ఆయన అన్నారు.
కాగా తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాల సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో వారు దక్కించుకున్నట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా ఇప్పటికే వెలుగులోకి తీసుకొచ్చింది. అత్యంత విలువైన సత్రం భూములను అధికార పార్టీ నేతలు వేలంలో తక్కువ ధరకే దక్కించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రూ.1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు వేలంలో రూ.22 కోట్లకే సొంతం చేసుకున్నారని, దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.