శివాజీ రాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, శ్రీకాంత్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో(మా) మరో వివాదం తలెత్తింది. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయింది. దీనిపై స్పందించిన ‘మా’ కార్యవర్గం సోమవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో సమావేశమై చర్చించింది. సమావేశం అనంతరం ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా విలేకరులతో మాట్లాడుతూ –‘‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయనే వార్తల్లో నిజం లేదు. అసోసియేషన్ డబ్బుతో నేను ఇప్పటి వరకూ టీ కూడా తాగలేదు.
ఫోన్ కూడా సొంతదే వాడుతున్నా. నా పిల్లల మీద ఒట్టు.. నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని.. కనీసం 5పైసలు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుని, నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తా. అంతేకాదు.. ‘మా’ సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేసుకుంటా. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైంది. త్వరలో ‘మా’ ఎన్నికలు సమీపిస్తున్నందున కొంతమంది తాము చేసే ప్రతి పనిని తప్పుబడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు’’ అన్నారు.
‘మా’ కార్యవర్గ సభ్యుడు, హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. మా సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నూతన బిల్డింగ్ కట్టబోతున్నాం. దీని కోసం చిరంజీవిగారిని కలిస్తే రెండు కోట్లు డొనేషన్ ఇస్తానని చెప్పి, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారు. ఫండ్స్ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేయడంతో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్ కూడా వస్తారు’’ అన్నారు. ‘‘మా’ అసోసియేషన్‌లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయి’’ అని ‘మా’ కోశాధికారి, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు.
నన్ను దూరం పెట్టారు
‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ‘మా’ జనరల్ సెక్రటరీ, నటుడు నరేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందే. విదేశీ కార్యక్రమాల గురించి తను ఎటువంటి వివరాలు నాకు చెప్పలేదు.
అమెరికా ఈవెంట్ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్ క్లాస్‌లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేసిన డబ్బంతా ఎవరిది? మహేశ్‌బాబు ప్రోగ్రాం కోసం శివాజీరాజాను నమ్రత దగ్గరకు నేనే తీసుకువెళ్లా. ఆ తర్వాత వేరే వాళ్ల నుంచి నాకు కాల్స్ వచ్చాయని నమ్రత నాకు చెప్పారు. ఈ ప్రయత్నాలు నన్ను తప్పించడానికే. వచ్చే ‘మా’ ఎన్నికల్లో పోటీచేయదలచుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి నా కాల్స్‌కి శివాజీరాజా స్పందించటం లేదు. నిధుల దుర్వినియోగం వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో హైపవర్ నిజనిర్ధాణ కమిటీ వేద్దామంటే శివాజీరాజా అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని చిరంజీవిగారి దృష్టికి కూడా తీసుకువెళ్లాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment