చింతపల్లి: స్థానిక సబ్ ట్రెజరీ కుంభకోణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధంచేశారు. కుంభకోణంలో ప్రధాన సూత్రధారులైన చింతపల్లి సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ అప్పలరాజు, వైద్య ఆరోగ్యశాఖ యూడీసీ సింహాచలం, ఏడీఎంహెచ్‌ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సంజీవరావులను సోమవారం అరెస్ట్ చేసేందుకు పోలీసు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరు ముగ్గురు ఇప్పటికే పోలీసు ప్రత్యేక బృందం అదుపులో ఉన్నట్లు సమాచారం.
విశాఖ ఏజెన్సీలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగులను సృష్టించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ట్రెజరీ అధికారులు కలిసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. 2013-14కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు మంజూరైన బడ్జెట్‌లో రూ.2.80 కోట్లు న కిలీ ఉద్యోగుల పేరిట డ్రా చేసి స్వాహా చేసిన విషయం ఆడిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిధుల స్వాహాకు చింతపల్లి సబ్ ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజు సహ కరించినందుకు రూ.17 లక్షలు ఆయన తన ఖాతాలో జమ చేసుకోగా, వైద్య ఆరోగ్య శాఖ యూడీసీ సింహాచలం ఏకంగా రూ.1.40 కోట్లు తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
పాడేరు ఏడీఎంహెచ్‌ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సంజీవరావుకు కూడా ఈ కుంభకోణంలో సంబంధం ఉన్నట్లు ఆడిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ట్రెజరీ ఉద్యోగి అప్పలరాజుపై ఆ శాఖ అధికారులు ముందే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. ఈ కేసు విచారణ నిమిత్తం డీఎస్పీ కృష్ణవర్మ ఆధ్వర్యంలోని 9 మంది సభ్యులతో కూడిన బృందాన్ని నియమించారు. వీరు నెల రోజులుగా ట్రెజరీ, పీహెచ్‌సీ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.
ఇందులో చాలా మంది ప్రమేయం ఉన్నప్పటికి ప్రధాన నిందితులుగా ఏ 1 కేసులో ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజు, ఎ 2 కింద యూడీసీ సింహాచలం, ఎ 3 కింద ఏడీఎంహెచ్‌ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ సంజీవరావును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు తెలిసింది. వీరు స్వాహా చేసిన నిధులను ఇప్పటికే చాలా వరకు రికవరీ చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు మిగతా నిధులకు సంబంధించి వారి వారి సొంత ఆస్తుల జప్తుకు సంబంధించి రికార్డులు తయారు చేశారు.
అప్పలరాజు వద్ద అప్పుగా తీసుకున్న పలువురు ఉద్యోగుల నుంచి కూడా ఈ నిధులను రికవరీ చేస్తారు. ఈ వివరాలన్నీ సేకరించేందుకు అధికారులు 3 రోజులుగా వీరిని తమ అదుపులో ఉంచుకున్నారు. సోమవారం వీరిని చింతపల్లిలో అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వీరి అరెస్ట్ తర్వాత మరో 30 మంది వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
ముగ్గురు కీలక ఉద్యోగుల అరెస్టుకు రంగం సిద్ధం
Published Sun, Jan 18 2015 5:32 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement