![January wages as per new PRC In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/27/EMPLOYEES.jpg.webp?itok=euiOm5L2)
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను ఫిబ్రవరిలో చెల్లించాలని, అందుకు అనుగుణంగానే వీటికి సంబంధించిన బిల్లులను రూపొందించాలని ఆర్థిక శాఖ మరోసారి స్పష్టం చేసింది. వాస్తవానికి జనవరి నెల నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుందన్న కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కా కుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు జారీచేసింది. నిర్దేశించిన సమయంలోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో జారీ చేసింది. జీవోలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది.
► ప్రభుత్వశాఖలు, విభాగాలు, విశ్వవిద్యాలయా లు, సొసైటీలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలు చెల్లించాలని తెలిపింది.
► ఫుల్ టైమ్, ఎన్‌ఎంఆర్, రోజువారీ వేతనాలు, కన్సాలిడేటెడ్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలను చెల్లించాలని స్పష్టం చేసింది.
► ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలపై జారీ చేసిన జీవో ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment