pensioner
-
కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు.. ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను ఫిబ్రవరిలో చెల్లించాలని, అందుకు అనుగుణంగానే వీటికి సంబంధించిన బిల్లులను రూపొందించాలని ఆర్థిక శాఖ మరోసారి స్పష్టం చేసింది. వాస్తవానికి జనవరి నెల నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుందన్న కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కా కుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు జారీచేసింది. నిర్దేశించిన సమయంలోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో జారీ చేసింది. జీవోలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. ► ప్రభుత్వశాఖలు, విభాగాలు, విశ్వవిద్యాలయా లు, సొసైటీలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలు చెల్లించాలని తెలిపింది. ► ఫుల్ టైమ్, ఎన్ఎంఆర్, రోజువారీ వేతనాలు, కన్సాలిడేటెడ్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలను చెల్లించాలని స్పష్టం చేసింది. ► ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలపై జారీ చేసిన జీవో ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని పేర్కొంది. -
పెన్షనర్లకు కరువు భృతి
* ప్రస్తుత డీఆర్‌పై 3.144 శాతం పెంపు * ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు * ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం కరువు భృతి (డీఆర్) ప్రకటించింది. పెన్షనర్లకు ప్రస్తుతం 8.908 శాతం డీఆర్ అమల్లో ఉంది. దీనికి అదనంగా 3.144 శాతం కలిపి.. 12.052 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2015 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత వారంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కరువు భత్యం ప్రకటిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువరించింది. తాజాగా పెన్షనర్లకు డీఆర్‌ను వర్తింపజేసింది. జనవరి నుంచి ఆగస్టు వరకు చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్‌తో కలిపి చెల్లించనుంది. అక్టోబర్ 1న బకాయిలతో పాటు పెరిగిన డీఆర్తో కూడిన పెన్షన్ వారి చేతికందుతుంది. ప్రస్తుతం అందుకుంటున్న నెలసరి పెన్షన్ బట్టి ఎవరెవరికి ఎంత డీఆర్ పెరుగుతుందనే పట్టికను సైతం ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులతో పాటు పొందుపరిచింది. దీని ప్రకారం కనిష్టంగా నెలకు రూ.6,500 పెన్షన్ అందుకుంటున్న వారికి రూ.784 డీఆర్ జమ అవుతుంది. గరిష్టంగా రూ.61,392 పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులకు రూ.7,399 డీఆర్ వర్తిస్తుంది. 2013 జూలై 1 తర్వాత రిటైరై పెన్షన్ అందుకుంటున్న ఉద్యోగులతో పాటు.. అప్పటికే పెన్షన్ అందుకుంటున్న వారందరికీ ఈ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థిక శాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.