చెన్నైలోని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా పరిధిలో నిరసనకు దిగిన ఉద్యోగులకు కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందజేయమని, ఉద్యోగంలో నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. చెన్నై ప్లాంట్‌లోని సామ్‌సంగ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని, తమ యూనియన్‌కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9 నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించింది.
‘నో వర్క్..నోపే ప్రాతిపదికనను కంపెనీ పాటిస్తుంది. సమ్మె ప్రారంభమైన సెప్టెంబర్ 9 నుంచి నిరసనలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు ఉండవు. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. నిరసన కొనసాగిస్తే ఉద్యోగాల నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉంది. నాలుగు రోజుల్లోగా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరకపోతే, వారిని సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి’ అని కంపెనీ హెచ్‌ఆర్ విభాగం అధికారులు ఈమెయిల్ పంపించారు.
ఇదీ చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకం
భారత్‌లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్‌సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్ మెషీన్‌లు, ఎయిర్ కండిషనర్‌లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉద్యోగులు వేతనాలు పెంచాలని, తమ యూనియన్‌ను కంపెనీ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులను సమీకరించడంలో సహాయపడిన సీఐటీయూ వివరాల ప్రకారం సామ్‌సంగ్ ఉద్యోగులు నెలకు సగటున రూ.25,000 వేతనం అందుకుంటున్నారు. మూడేళ్లలో రూ.36,000కు పెంచాలని డిమాండ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment