Employee strike
-
32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు
వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన ప్రముఖ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ ఉద్యోగులతో యాజమాన్యం మరోసారి చర్చలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27న ఈమేరకు కార్మికుల యూనియన్‌తో చర్చించనుంది. ఉద్యోగుల సమ్మె కారణంగా తయారీ కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితం చెందనట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంపెనీకి భారీ ఆర్డర్లున్న 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు చెప్పారు.బోయింగ్ ఉద్యోగులు 2008 తర్వాత చేస్తున్న ఈ సమ్మెలో పలు డిమాండ్లను లేవనెత్తారు. యూనియన్‌లోని దాదాపు 32,000 మంది సభ్యులు 40 శాతం వేతనం పెంచాలంటున్నారు. దాంతోపాటు ఉద్యోగుల పెన్షన్ స్లాబ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం 30 శాతం వేతనాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. కానీ సంస్థ ఆఫర్‌కు యూనియన్ సిద్ధంగా లేదని ఉద్యోగులు లేచ్చి చెప్పారు. తప్పకుండా 40 శాతం వేతన పెంపు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల బోయింగ్ యాజమాన్యం యూనియన్‌తో చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. వచ్చే నాలుగేళ్లలో 25 శాతం వేతన పెంపు చేస్తామని కంపెనీ ఇప్పటికే హామీ ఇచ్చింది. అయితే ఆ ప్రతిపాదనను ఉద్యోగులు తోసిపుచ్చారు. దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా వేతనాల పెరుగుదలపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాగైనా తమ డిమాండ్‌ను భర్తీ చేయాలని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై 27న మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..ఉద్యోగుల నిరసనలో భాగంగా సీటెల్, పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్‌లో విమానాల తయారీ నిలిచిపోయింది. సెప్టెంబర్ 13 నుంచి కొనసాగుతున్న ఈ సమ్మె వల్ల ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. బోయింగ్ అత్యధికంగా అమ్ముతున్న 737 మ్యాక్స్ మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తిని సైతం నిలిపేసినట్లు చెప్పారు. -
ఉద్యోగం పోతుందని హెచ్చరిక!
చెన్నైలోని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా పరిధిలో నిరసనకు దిగిన ఉద్యోగులకు కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందజేయమని, ఉద్యోగంలో నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. చెన్నై ప్లాంట్‌లోని సామ్సంగ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని, తమ యూనియన్‌కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9 నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించింది.‘నో వర్క్..నోపే ప్రాతిపదికనను కంపెనీ పాటిస్తుంది. సమ్మె ప్రారంభమైన సెప్టెంబర్ 9 నుంచి నిరసనలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు ఉండవు. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. నిరసన కొనసాగిస్తే ఉద్యోగాల నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉంది. నాలుగు రోజుల్లోగా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరకపోతే, వారిని సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి’ అని కంపెనీ హెచ్ఆర్ విభాగం అధికారులు ఈమెయిల్ పంపించారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకంభారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉద్యోగులు వేతనాలు పెంచాలని, తమ యూనియన్ను కంపెనీ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులను సమీకరించడంలో సహాయపడిన సీఐటీయూ వివరాల ప్రకారం సామ్సంగ్ ఉద్యోగులు నెలకు సగటున రూ.25,000 వేతనం అందుకుంటున్నారు. మూడేళ్లలో రూ.36,000కు పెంచాలని డిమాండ్ ఉంది. -
గ్రామీణ బ్యాంకుల బంద్ నేడు
దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నేడు (శుక్రవారం) బంద్ కానున్నాయి. రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. అన్ని స్థాయిలకు చెందిన 91,000 మంది శాశ్వత, 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో మూకుమ్మడిగా పాల్గొంటున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేస్తున్న బ్యాంకులకు సమానంగా పే స్కేలు, ప్రమోషన్, రిక్రూట్మెంట్ రూల్సు, పెన్షన్లు ఇవ్వడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టాల్నది వీరి ప్రధాన డిమాండ్. దేశవ్యాప్తంగా 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. 22,000 పైచిలుకు శాఖలను నిర్వహిస్తున్నాయి. ఏటా ఇవి రూ.6 లక్షల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. స్పాన్సర్ బ్యాంకుల ఉద్యోగులకు సమానంగా పే స్కేలు, విధులు ఉండాలన్న నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ 1990లో ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి కార్యాచరణకై జూలై 10న ఢిల్లీలో సమావేశం అవుతున్నట్టు తెలిపారు.