గ్రామీణ బ్యాంకుల బంద్ నేడు
దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నేడు (శుక్రవారం) బంద్ కానున్నాయి. రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. అన్ని స్థాయిలకు చెందిన 91,000 మంది శాశ్వత, 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో మూకుమ్మడిగా పాల్గొంటున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేస్తున్న బ్యాంకులకు సమానంగా పే స్కేలు, ప్రమోషన్, రిక్రూట్‌మెంట్ రూల్సు, పెన్షన్లు ఇవ్వడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టాల్నది వీరి ప్రధాన డిమాండ్. దేశవ్యాప్తంగా 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి.
22,000 పైచిలుకు శాఖలను నిర్వహిస్తున్నాయి. ఏటా ఇవి రూ.6 లక్షల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. స్పాన్సర్ బ్యాంకుల ఉద్యోగులకు సమానంగా పే స్కేలు, విధులు ఉండాలన్న నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ 1990లో ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి కార్యాచరణకై జూలై 10న ఢిల్లీలో సమావేశం అవుతున్నట్టు తెలిపారు.