పంజాబ్‌లో రైతుల బంద్‌ | Punjab Farmers Bandh: Roads Blocked, Trains Cancelled | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో రైతుల బంద్‌

Published Mon, Dec 30 2024 11:17 AM | Last Updated on Tue, Dec 31 2024 5:34 AM

Punjab Farmers Bandh: Roads Blocked, Trains Cancelled

స్తంభించిన జనజీవనం

రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ జామ్‌లు

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

చండీగఢ్‌: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంసహా తమ పలు డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న పంజాబ్‌ కర్షకులు సోమవారం చేపట్టిన తొమ్మిది గంటల రాష్ట్రవ్యాప్త బంద్‌తో జనజీవనం స్తంభించింది. పంజాబ్‌ గుండా సాగే జాతీయ రహదారులపై రాస్తారోకోలు, రైల్వేపట్టాలపై బైఠాయింపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంజాబ్‌–ఢిల్లీ రూట్‌లో రాకపోకలు సాగించే 163 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. 

రాస్తారోకోలతో వాహనాల్లో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలెట్టి సాయంత్రం నాలుగు గంటలకు బంద్‌ను ముగిస్తామని రైతు సంఘాలు ప్రకటించినా బంద్‌ ప్రభావం రోజంతా కనిపించింది. పటియాలా, జలంధర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, బఠిందా, పఠాన్‌కోట్‌లలో బంద్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పటియాలా–చండీగఢ్‌ జాతీయ రహదారిపై ధరేరీ జఠాన్‌ టోల్‌ప్లాజా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల పొడవునా వాహ నాలు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులపా లయ్యారు. 

అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ గేట్‌సహా చాలా పట్టణాల్లో వేల సంఖ్యలో రైతులు బంద్‌లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాలు ఈ బంద్‌కు పిలుపునివ్వడం తెల్సిందే. గత 35 రోజులుగా ఖనౌరీ సరిహద్దు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జీత్‌సింగ్‌ ధల్లేవాల్‌కు బంద్‌ సందర్భంగా రైతులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు దీక్ష మొదలై 35 రోజులు పూర్తవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్ప టికైనా తమ డిమాండ్లపై కేంద్రం దృష్టిసారించాలని సోమవారం ఒక వీడియో విన్నపంలో ధల్లేవాల్‌ కోరారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement