వేతనాలు పెంచాలని నిరసనకు దిగిన 150 మంది సామ్‌సంగ్ ఉద్యోగులను సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో కార్మికులు ర్యాలీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి మంజూరైన అనుమతులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దాంతో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేసేందుకు దాదాపు 400కుపైగా కార్మికులు సోమవారం కాంచీపురం కలెక్టరేట్‌కు బయలుదేరారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన 150 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన ఇండియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ నాయకుడు ముత్తు కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు కార్మికులు తెలిపారు.
సామ్‌సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వేతన సవరణ కోరుతూ సమ్మెకు దిగారు. ఇప్పటికే సమ్మె ప్రారంభించి ఎనిమిది రోజులు అయింది. అయినా సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ర్యాలీ నిర్వహించాలని భావించి కలెక్టర్ అనుమతి కోరారు. చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..‘కాంచీపురంలోని సామ్‌సంగ్ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలి సమ్మె. స్థానికంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌లో దాదాపు 1,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి వేతనాలు ఇతర సంస్థల్లోని అదే స్థాయి ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 16 సంవత్సరాలుగా ఈ కార్మికులకు ఎలాంటి రిజిస్టర్డ్ యూనియన్ లేదు. వేతనాలు సవరించాలని సంస్థకు ఎన్నిసార్లు లేఖలు రాసినా లాభం లేకుండాపోయింది. సంస్థ వేతనాలపై స్పందించకపోగా కార్మికులపై పనిభారం మోపుతోంది. సామసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ పేరుతో సమ్మెకు దిగాం. సంస్థలో 25 శాతం మంది అప్రెంటిస్ కార్మికులున్నారు’ అని తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్
భారత్‌లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్‌సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్ మెషీన్‌లు, ఎయిర్ కండిషనర్‌లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment