
రూ.96,450కి చేరిక
రూ.2,500 లాభపడిన వెండి
న్యూఢిల్లీ: పసిడి మరోసారి మెరిసింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.50 పెరగడంతో గత వారం నమోదు చేసిన జీవిత కాల గరిష్ట స్థాయి (ఆల్‌టైమ్ హై) రూ.96,450కి పుంజుకుంది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.50 పెరిగి రూ.95,950 వద్ద ముగిసింది. మరోవైపు వెండికి డిమాండ్ ఏర్పడింది. కిలోకి రూ.2,500 పెరిగి రూ.97,500 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం లాభాల బాటలో కొనసాగింది. ఔన్స్‌కు 15 డాలర్లు పెరిగి 3242 డాలర్ల సమీపానికి చేరుకుంది. ‘‘ఆల్‌టైమ్ గరిష్టాల వద్ద బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
డాలర్ బలహీనపడడం, యూఎస్ వాణిజ్య విధానాలపై అనిశ్చితి కొనసాగుతుండడం బంగారం ధరలకు మద్దతునిస్తోంది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. ‘‘బుధవారం యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ నిర్వహించే మీడియా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే లేదా ఆర్థిక పరిస్థితులు బలహీనపడితే సెంట్రల్ బ్యాంక్ ఎలా వ్యవహరిస్తుందన్నదానిపై పావెల్ నుంచి సంకేతాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూస్తున్నారు’’అని మెహతా వివరించారు.