ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: రాజీనామాను ఆమోదించుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డిని జేఏసీ నాయకులు నిలదీశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి తన వాహనంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తులసిరెడ్డి సమైక్యవాదుల వద్దకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంలో పదవులకు రాజీనామాలు చేయడం కాదని రాజీనామాలు ఆమోదించుకుని వచ్చి మాట్లాడాలని ప్రొద్దుటూరు జేఏసీ గౌరవాధ్యక్షుడు వంకదారి వీరభద్రయ్య, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మిదేవిలు ప్రశ్నించారు. దీనికి తులసిరెడ్డి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా వేదిక వద్ద ఉన్న ప్రజలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంలో తులసిరెడ్డి ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా ఆయనకు మాట్లాడేందుకు అవకాశం లభించలేదు. తాను సమైక్యవాదినేనని మొదటగా తన పదవికి రాజీనామా చేసింది తానేనని ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు.
సమైక్యాంధ్రకే తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరిరారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తులసిరెడ్డి సెక్యూరిటీ ఆయనను కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. తులసిరెడ్డి కారుపైకి ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొడగొట్టి మీసం తిప్పుతూ సవాల్ విసిరారు. కాగా, తులసిరెడ్డిపై చెప్పులు విసిరిన సంఘటనను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, జేఏసీ గౌరవాధ్యక్షుడు వంకదారి వీరభద్రయ్య తెలిపారు.
తులసిరెడ్డీ గో బ్యాక్
Published Thu, Aug 29 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement