కాంగ్రెస్ ఒంటరి పోరాటం
Published Fri, Sep 20 2013 3:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, తిరుపతి:సమైక్య ఉద్యమంలో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తోంది. జిల్లాలో చిత్తూరు మినహా మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమంలో ఇతర సంఘాలు, యూనియన్లతో కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే.బాబు ఆధ్వర్యంలో సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇతర నియోజకవర్గాల్లో విభజన ప్రకటన మీ పార్టీ వల్లే వచ్చిందని అంటే ఏం స మాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సంకటస్థితిలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి కూడా శిబిరాల వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా మాట్లాడి రావడం మినహా సొంతంగా ఆందోళన కా ర్యక్రమాలు నిర్వహించడం లేదు. జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 50 రోజులు దాటినా కాంగ్రెస్ అంటరాని పార్టీలాగా మారింది.
ఏ ఉద్యమ శిబిరం వద్దకూ కాంగ్రెస్ నాయకులను ప్రజలు రానివ్వడం లేదు. తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ తన అనుచరులను కొందరిని వెంటేసుకుని టౌన్‌బ్యాంక్ అధ్యక్షుడు పులుగోరు మురళి ఆధ్వర్యంలో రెం డు రోజులుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయిస్తూ హడావుడి చేస్తున్నారు. సొంతంగా టెంట్ వేసి దీక్ష శిబిరం నిర్వహించేందుకు జనం రాకపోవడంతో నగరంలో ఇప్పటికే వెలసిన దీక్షా శిబిరాల వద్దకు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ తొలి రోజు నుంచి నగరంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి రోజూ ఆందోళనలు సాగిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గల్లా అరుణకుమారి ప్రారంభం లో ఆర్భాటంగా తిరుపతిలో అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులతో ర్యాలీ చేయించి, ఆ తర్వాత చేతులేత్తేశారు.
ఇప్పటివరకు జిల్లా ఉద్యమాల్లో ఎక్కడా ఆమె ప్రత్యక్షంగా పాల్గొనలేదు. నియోజకవర్గంలో ప్రజలు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా ఉద్యమాలు నడుపుకుంటున్నారు. పీలేరు నియోజకవర్గంలో సీఎం తమ్ముడు గా నీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ ఉద్యమాలు నిర్వహించే ప రిస్థితి లేదు. మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొదట్లో హడావుడి చేసినా ప్రజల చీత్కారంతో పక్కకు తప్పుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నాయకులు సొంతంగా ఉద్యమం చేయలేని పరిస్థితి నెలకొంది. పుంగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఇద్దరు ఇన్‌చార్జ్‌లు కావడం, వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని స్థితి ఉండడంతో పార్టీ కార్యకర్తలు ఉద్యమం చేయడం లేదు.
పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి హడావుడి చేయాలని చూసినా ప్రజల మద్దతు లేకపోవడంతో కొద్దికాలానికే కాంగ్రెస్ శిబిరం చల్లబడింది. నగరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. మాజీ మం త్రి చెంగారెడ్డి, అయన అనుచరులు ప్రత్యక్ష ఉద్యమాల్లో ఎక్కడా తిరగడం లేదు. పుత్తూరులోనూ ఇతర పార్టీలు చేసినంత జో రుగా కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి ఊసేలేదు. ఇక్కడ నాయకులు ఎవరికి వారు తమకెందుకులే అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ జయచంద్రనాయుడు ఉన్నా ఆయన ఏనాడు ఉద్యమాల కోసం రోడ్డెక్కలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.
Advertisement