జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం అలుపెరుగకుండా కొనసాగుతూనే ఉంది. ఉద్యమం ప్రారంభమై నెల రోజులు గడచినా అందరిలోనూ అదే ఆత్మ విశ్వాసం, దృఢసంకల్పం తొణికిసలాడుతోంది.సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకూ ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేసేది లేదంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
సాక్షి, కడప : సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఉద్యమం ప్రారంభమై 30 రోజులు అయినప్పటికీ కడప బిడ్డలు మొక్కవోని పట్టుదల, అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు, ఆందోళనలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. సమ్మెతో ప్రభుత్వ కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఉద్యోగులకు జీతాలు రావని తెలిసినా... సామాన్యునికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరూ బాధపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరు ఆగదని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.
కడపలో వైఎస్సార్ సీపీ నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, భూపేష్‌రెడ్డి, అఫ్జల్‌ఖాన్, కిశోర్‌కుమార్‌లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారంతో 4వ రోజు పూర్తయింది. వీరి దీక్షలకు జిల్లా నలుమూలలనుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వినూత్నరీతిలో తెల్లపంచెలు, ధోవతి, కండువాలతో, మహిళా ఉపాధ్యాయులు ఎరుపు రంగు చీరెలతో జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. స్టాంపు రైటర్లు, వెండర్లు నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. సుండుపల్లె, గాలివీడు, వీరబల్లిలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. టీడీపీ నాయకులు అమీర్‌బాబు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సురేష్‌నాయుడు దీక్షలు కొనసాగుతున్నాయి.
జమ్మలమడుగులో తోపుడుబండ్ల వ్యాపారులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. ఆర్టీపీపీలో విద్యుత్ కార్మికులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రెండు వేల మందికి పైగా కలమల్ల పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు.
ప్రొద్దుటూరులో ఎన్జీఓలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి పుట్టపర్తి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. తెలుగుభాషా పండితులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు రోడ్లపైనే క్రీడలు ఆడుతూ నిరసన తెలియజేశారు. భగత్‌సింగ్, విద్యాధరి పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
రైల్వేకోడూరులో అర్ధ లక్ష జన గళ గర్జన పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీతోపాటు విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు చేపట్టిన నిరసన ప్రదర్శనతో రైల్వేకోడూరు అట్టుడికింది. టోల్‌గేట్ సెంటర్ నుంచి బస్టాండు వరకు ర్యాలీని నిర్వహించారు.
రాయచోటి పట్టణంలో సుమో యజమానులు, డ్రైవర్లు వాహనాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు విన్నూతంగా దున్నపోతులపై కేసీఆర్, సోనియా, దిగ్విజయ్‌సింగ్ పేర్లను రాసి పట్టణంలో ఊరేగించారు. ఉర్దూ ఉపాధ్యాయ, విద్యార్థులు ర్యాలీని చేపట్టారు. వీరు రిలే దీక్షలలో పాల్గొనడంతోపాటు విభజన నాటకం, కవి సమ్మెళనం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. సంబేపల్లెలో మహిళలు కలశాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. లక్కిరెడ్డిపల్లెలో క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు.
మైదుకూరులో పూర్వపు విద్యార్థులు, జిమ్‌సెంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీని నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. శ్రీకృష్ణ దేవరాయులు, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.
రాజంపేటలో రెవెన్యూ ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం నుంచి తాళ్లపాక అన్నమాచార్య మందిరం వరకు భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టారు. న్యాయవాదులు మోకాళ్లపై నడిచి నిరసన తెలియజేశారు. వీరబల్లిలో రజకులు రోడ్లపైనే ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. సుండుపల్లెలో నడిరోడ్డుపై వంటా వార్పు చేసి సమైక్య నినాదాలు చేశారు. సిద్దవటంలో రోడ్లపైనే 1500 మంది విద్యార్థులకు విద్యను బోధించారు.
బద్వేలులో పలు సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. వంటా వార్పు చేపట్టారు. రోడ్డుపైనే మార్చ్‌ఫాస్ట్, ఆటలపోటీలు నిర్వహించారు. వార్డెన్ల రిలే దీక్షలు కొనసాగాయి. కాశినాయన మండలంలో స్థానిక తహశీల్దార్, ఎంపీడీఓతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీతోపాటు రాస్తారోకో నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. పోరుమామిళ్లలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.
పులివెందులలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నల్లదుస్తులతో నిరసన తెలిపారు. విచిత్ర వేషధారణలతో ఆందోళనలు చేపట్టారు. కమలాపురంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి.
అలుపెరుగని పోరు
Published Fri, Aug 30 2013 5:16 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement