అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా ధనాన్ని కొల్లగొట్టాలనుకున్న వారి ఆశలు సాగలేదు. అధికారపార్టీకి చెందిన ఇద్దరు నేతలకు శృంగభంగం ఎదురైంది. నేషనల్ హైవే-67 రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్లను పోటీ లేకుండా చేసి రూ.26.5కోట్లు దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. మొదట ఎక్సెస్‌కు టెండర్లు దక్కించుకునే ప్రయత్నం చేయగా ఫిర్యాదులు రావడంతో చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం రీ టెండర్లకు ఆదేశించింది. దాంతో కొంత వరకు అడ్డుకట్టపడింది. తాజా టెండర్లలో 17.5 శాతం లెస్‌కు టెండర్లు దాఖలు కావడంతో మొత్తంగా రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది.
సాక్షి ప్రతినిధి, కడప: నేషనల్ హైవే- 67 రోడ్డు విస్తరణలో భాగంగా జిల్లాలోని బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో రూ.184 కోట్లు పనులకు గత డిసెంబర్‌లో టెండర్లు పిలిచారు. జిల్లాలోని ఇరువురు టీడీపీ నేతలు వీటిని తమవారికి వచ్చేలా ముమ్మర ప్రయత్నం చేశారు. ఆమేరకు కాంట్రాక్టు సంస్థలను పోటీకి రాకుండా చేశారు. తాము అనుకున్న సంస్థకు 14.5 శాతం అధిక ధరలకు కాంట్రాక్టు పనులు ఖరారు అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమేరకు రూ.26.6 కోట్లు అప్పనంగా ఆర్జించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. అనంతరం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవాలను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం రీ టెండర్లు ఆహ్వానించింది.
17.5 శాతం తక్కువకు దక్కించుకున్న ఎస్సార్కే....
వైఎస్సార్ జిల్లాలోని ఎన్‌హెచ్-67 రోడ్డు పనుల కోసం చేపట్టిన రూ.184 కోట్ల రీ టెండరులో 17.5 శాతం తక్కువకే ఎస్సార్కే సంస్థ దక్కించుకుంది. రీ టెండర్ల సందర్భంగా టీడీపీ కుయుక్తులను వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు పి రవీంద్రనాథరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, సి ఆదినారాయణరెడ్డి ఎక్కువ మంది కాంట్రాక్టర్లు దాఖలు చేసేలా చూశారు.
దాంతో అధికరేట్లకు కోట్ చేస్తే కాంట్రాక్టు పనులు ఏమాత్రం దక్కవని టీడీపీ నేతలు గ్రహించారు. ఎవరి పరిధిలో వారు వారికి అనువైన ధరలకు కోట్ చేశారు. తుదకు ఎస్సార్కే సంస్థ బద్వేల్, మైదుకూరు పరిధిలోని రూ.184కోట్ల పనులు 17.5 శాతం తక్కువకు దక్కించుకుంది. బద్వేల్ నుంచి ఆత్మకూరు వరకూ రోడ్డు కోసం రూ.226 కోట్లుకు నిర్వహించిన టెండర్లలో సైతం అదే సంస్థ 19 శాతం తక్కువ ధరకు దక్కించుకుంది. ఆ మేరకు టెండర్లను ఖరారు చేస్తూ నేషనల్ హైవే ఆథారిటీ ధ్రువీకరించింది.
రూ.100 కోట్లు ప్రజాధనం సేఫ్...
అధికార పార్టీ అన్న ఏకైక కారణంతో నేషనల్ హైవే రోడ్డు పనుల ద్వారా భారీగా లబ్ధిపొందాలని భావించిన తెలుగు తమ్ముళ్ల వ్యూహం విఫలమైంది. జిల్లాకు చెందిన అధికార పార్టీలోని ఓ ఎంపీ, కాంట్రాక్టర్‌గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన మరోనేత చేపట్టిన ఎత్తుగడలు నిష్ర్పయోజనం అయ్యాయి.
రూ.26కోట్ల అదనపు మొత్తాన్ని ఇరువురు పంచుకోవాలనే తలంపుతో రాష్ట్ర ముఖ్యనేత ద్వారా పోటీదారులకు పైరవీలు చేయించారు. అయితే వారి ఆటలు సాగలేదు. దాంతో జిల్లాలోని బద్వేల్, మైదుకూరు రోడ్డు పనులల్లో రూ.32.3 కోట్లు తక్కువకు టెండర్ దక్కింది. అలాగే బద్వేల్ నుంచి ఆత్మకూరు రోడ్డు రూ.43కోట్లు తక్కువకు టెండర్ దక్కింది. దాంతో రూ.75కోట్లు ప్రజాధనం మిగిలింది. మొదట రూ.26కోట్ల అధిక ధరకు కోట్ చేసి టీడీపీ దక్కించుకునేందుకు సన్నద్ధం చేయడం తెలిసింది. మొత్తంగా రూ.100 కోట్లు ప్రజాధనాన్ని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు కాపాడగలిగారు.
ఎదురుదెబ్బ
Published Sun, Feb 15 2015 2:44 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement