రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కలెక్టర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ ప్రజా ప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తున్నారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులకు సమాధానం ఇవ్వకపోగా మైండ్‌గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కడప: కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుతెన్నులను తెలుసుకునేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. పార్లమెంటు సభ్యులు ఛెర్మైన్, కో-ఛెర్మైన్‌గా, కలెక్టర్ మెంబర్ సెక్రెటరీగా ఇందులో ఉంటారు. ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛెర్మైన్, కలెక్టర్ సిఫార్సులతో నియమించబడిన స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్‌జీఓలు సైతం ఇందులో సభ్యులు. ఈ సమావేశాన్ని ప్రతి మూడు మాసాలకు ఒకసారి విధిగా నిర్వర్తించాల్సి ఉంది.
మెంబర్ సెక్రెటరీ అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమావేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ జీవనోపాధుల పథకం, ఇందిరా ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకం, వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ రూరల్ డెవలప్‌మెంట్ పథకాలను సమీక్షించనున్నారు. కాగా, జిల్లా విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 25న నిర్వహించదలిచారు. ఆ మేరకు సభ్యులకు సమాచారం సైతం అందజేశారు. అయితే మెంబర్ సెక్రెటరీ అయిన కలెక్టర్ కేవీ రమణ సెలవులో వెళ్లిపోయారు.
నాడు జెడ్పీ మీటింగ్.. నేడు డీవీఎంసీ..
మార్చి 31 న నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ కేవీ రమణ గైర్హాజరు అయ్యారు. జిల్లాలో 48 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. సుమారు 600 పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ దశలో జెడ్పీ సమావేశానికి కడపలో ఉండి కూడా కలెక్టర్ హాజరు కాలేదు. ఈ అంశంపై జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఉత్సవాల పర్యవేక్షణకు వెళ్తున్నట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు.
సమీక్షకు హాజరై అదే విషయాన్ని తెలియజెప్పి వెళ్లి ఉండొచ్చు, అయినా కలెక్టర్ ప్రజాప్రతినిధుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా నాడు ఒంటిమిట్టకు వెళ్లారు. విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సెక్రెటరీగా ఉన్న కలెక్టర్ కేవీ రమణ కమిటీ సమావేశాన్ని ఈనెల 25న నిర్వహించేందుకు ఆదేశాలిచ్చారు. ఆ సమయం దగ్గర పడగానే సెలవులో వెళ్లారు. కారణాలు ఏమైనా తేదీ నిర్ణయించాక సెక్రెటరీ హోదాలో ఉన్న వ్యక్తి, ఛెర్మైన్‌కు కనీస సమాచారం ఇచ్చి వెళ్లి ఉంటే సమంజసంగా ఉండేదని పలువురు పేర్కొంటున్నారు.
అలా చేసి ఉంటే తప్పును ఎత్తిచూపేందుకు ఆస్కారం లేకుండా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం వర కు సెలవులో వెళ్లిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు నిర్వహించే సమావేశానికి కలెక్టర్ గైర్హాజరు అయ్యేందుకే ఇష్టపడుతున్నట్లు అర్థం అవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై ప్రజాప్రతినిధులు నిలదీస్తారనే భయం, లేదా నియంతృత్వంతో వ్యవహరిస్తున్న వైనాన్ని ఎండగడతారనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని పరిశీలకుల అభిప్రాయం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా కలెక్టర్ తీరు ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
డీవీఎంసీ సమావేశాన్ని వాయిదా వేయండి: వైఎస్ అవినాష్‌రెడ్డి
గత నెలలో నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశానికి కలెక్టర్ హాజరు కాలేదు, కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులు అధ్వానంగా ఉన్నాయి. కలెక్టర్ కేవీ రమణ అందుబాటులో లేని కారణంగా సమావేశాన్ని వాయిదా వేయాలని జిల్లా విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ ఛెర్మైన్ వైఎస్ అవినాష్‌రెడ్డి డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్న నేపథ్యంలో మెంబర్ సెక్రెటరీగా ఉన్న కలెక్టర్ విధుల్లో ఉన్న రోజునే సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆ మేరకు వాయిదా వేయాలని ఆయన ఛెర్మైన్ హోదాలో సూచించారు.
ఇదేం తీరు..!
Published Thu, Apr 23 2015 3:17 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement