‘ఉపాధి’కి వడదెబ్బ | Employment work drinking water problems in high | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి వడదెబ్బ

Published Sun, Apr 10 2016 2:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

‘ఉపాధి’కి వడదెబ్బ - Sakshi

‘ఉపాధి’కి వడదెబ్బ

మండుటెండల్లో కూలీల పనులు
తాగునీటికీ    నోచుకోని దైన్యం
పని చేసే స్థల్లాలో టెంట్లు కరువు
పిల్లల ఆలనాపాలన కోసం ఆయాలు లేరు
టెంట్లు.. మెడికల్ కిట్ల సరఫరా నిలిచి నాలుగేళ్లు

 
 
సాక్షి, మంచిర్యాల :  ముదురుతున్న ఎండలు.. ప్రభుత్వ పట్టింపు లేని తనం.. ‘ఉపాధి హామీ’ కూలీల ప్రాణాలను సంకటంలో పడేసింది. పని చేసే స్థలాల్లో కూలీలకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినా వాటి అమలు విషయంలో అధికారులు విఫలమవుతున్నారు. నిప్పులు చిమ్ముతున్న భానుడి ప్రతాపానికి ప్రతి రోజు జిల్లాలో ఏదో చోట ఒకరిద్దరు చనిపోతూనే ఉన్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలోనయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. మండుతున్న ఈ ఎండల్లో ఉపాధి కూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నారు.

పని చేసే చోట తాగేందుకు కనీసం నీరు కూడా లేని దైన్యం. మధ్యలో కాసేపు సేద తీరుదామంటే నిలువ నీడా కరువే. చెట్ల కింద నీడను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎండలో పని చే స్తూ స్పృహ తప్పి పడిపోతే కనీసం ప్రాథమిక వైద్యమూ అందుబాటులో లేదు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లూ లేవు. ఇప్పటికే కాగజ్‌నగర్ మండలం కొత్తఅనుకోడకు చెందిన ఉపాధి హామీ పథకం కూలీ ఒలికిళ్ల చిన్నక్క(40) ఈ నెల 7న వడదెబ్బతో చనిపోయింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక, తాగేందుకు నీరు లేక ప్రతి
 
 
రోజు ఎంతో మంది కూలీలు స్పృహ తప్పి పడిపోవడం మామూలైంది. ఇక పని చేసే స్థల్లాలో కూలీల పిల్లలకు ఆట వస్తువులు.. వారి ఆలనాపాలన చూసుకునేందుకు ఆయాల నియామకం విషయం దేవుడే ఎరుగు. పనికి వెళ్లకపోతే కడుపు నిండని పరిస్థితి. ఇదీ జిల్లాలో ప్రతిష్టాత్మక ఉపాధి హామీ పథకం అమలు తీరు. క్షేత్రస్థాయిలో ఎన్ని సమస్యలున్నా.. ప్రతి రోజు కూలీలు అసౌకర్యాల నడుమ పనులు చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు.


 ఉపాధి వైపే మొగ్గు..
 వేసవిలో చేసేందుకు పనులు లేకపోవడంతో రైతులు, ఇతర వర్గాల వారందరూ ప్రస్తుతం జిల్లాలో ఉపాధి హామీ పనులపై మొగ్గు చూపుతున్నారు. మరోపక్క ఉపాధి పని దొరక్క, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో ‘ఉపాధి’ని కాదని.. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వ లస వెళ్లే వారు. కానీ.. ఈసారి జిల్లా అధికారుల కృషి ఫలితంగా అనేక ప్రాంతాల్లో వలసలు తగ్గారుు. ప్రస్తుతం వారందరికీ అధికారులు పనులు కల్పిస్తున్నా పని స్థలాల్లో అసౌకర్యాలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని పని కొచ్చిన ఆ కూలీల ప్రాణాలను మాత్రం ప్రమాదంలో పడేశాయని చెప్పొచ్చు.

 మచ్చుకు..
 మంచిర్యాల మండలంలో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేవు. లక్సెట్టిపేట మండలంలో పనులు నిర్వహించే ప్రదేశంలో టెంట్లు, తాగునీరు, ప్రథమచికిత్స లాంటి సౌకర్యాలు అందించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండేపల్లి మండలంలో భూ అభివృద్ధి పనులు, రోడ్లు, కుంటల నిర్మాణాలకు రోజుకు 3,500 నుంచి 4,500 మంది కూలీలు వెళ్తున్నారు. పనులు చేసే చోట కూలీలకు నీడ కల్పించేందుకు రెండేళ్లుగా టెంట్లు సరఫరా లేవు. దీంతో కూలీలు పనులు చేసే చోట సేద తీర్చుకునేందుకు నిలువ నీడలేదు. అక్కడ దగ్గరలో చెట్లు ఉంటే, కాసేపు చెట్ల నీడన సేద తీరుతున్నారు. నిర్మల్, సారంగాపూర్ మండలాల్లో మెడికల్ కిట్లు లేవు. లక్ష్మణచాందలో కూలీలకు తాగునీరు లేదు. దిలావర్‌పూర్ మండలంలో 9544  జాబ్‌కార్డులు ఉండగా.. ఏడు వారాలుగా కూలీ డబ్బులు విడుదల కాలేదు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఎక్కడా టెంట్లు, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో లేవు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.


 టెంట్లు ఎత్తేశారు..
 పని చేసే చోట కూలీలకు నీడ కల్పించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం జిల్లాకు తొమ్మిది వేలకు పైగా టెంట్లు కేంద్రం అందజేసింది. ప్రస్తుతం వాటిలో ఒక్క టెంటు కూడా కనిపించడం లేదు. దీంతో కూలీలు పని చేసే ప్రాంతాల్లో చెట్ల కింద సేద దీరుతున్నారు. చెట్లు, వేరే ఆసరా లేని చోట కూలీలు ఎండలోనే భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 7లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. టెంట్లు లేకపోవడంతో కూలీలు పని తొందరగా ముగించుకుని ఇంటిబాట పడుతున్నారు.


 నీటి తిప్పలు..
 ముదురుతున్న ఎండలకు తగట్టు దాహమేస్తోంది. దీంతో శరీరంలో ఉన్న నీరు నిర్జలీకరణమవుతోంది. దానికి తోడు పని చేసే స్థలాల్లో తాగునీటి వసతి లేకపోవడంతో ఉపాధి కూలీలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. ఉపాధి కూలీలకు ప్రభుత్వం రోజుకు రూ.5 చొప్పున కూలితోనే కలిపి ఇస్తుంది. కానీ కూలి డబ్బులు సకాలంలో రాకపోవడంతో అధికారులూ చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం కూలీలు ఇళ్ల నుంచే క్యాన్లలో నీళ్లు పట్టుకొచ్చినా.. వచ్చిన అరగంటలోపే వేడెక్కుతున్నాయి. దీంతో వేడి నీటినే తాగాల్సి వస్తోంది.

 జాడ లేని మెడికల్ కిట్లు..
 పని చేసే చోట కూలీలకు ఎప్పుడైనా.. ఏదైనా ప్రమాదం జరగొచ్చు. అలాంటప్పుడు వెంటనే ప్రథమ చికిత్స అందించాలన్నా మెడికల్ కిట్లు ఎక్కడా అందుబాటులో లేవు. ప్రస్తుత ఎండ తీవ్రతకు ఎంతోమంది కూలీలు అనేక చోట్ల సొమ్మసిల్లి పడిపోతూనే ఉన్నారు. వారికి కొంచెం నీళ్లుతాగించి.. ఇంటికి పంపేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కేంద్రం అందజేసిన కిట్లన్నీ ఇప్పుడు మాయమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ల అవసరం ఎంతైనా ఉంది.
 
 
 కేంద్రానికి నివేదించాం
 నాలుగేళ్ల క్రితం జిల్లాకు టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు సరఫరా అయ్యాయి. ఆ తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి వసతులు రాలేదు. ప్రస్తుతం పలు చోట్ల మాత్రమే టెంట్లు, ఫస్ట్‌ఎయిడ్ బాక్సులున్నాయి. ఎండలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు అవసరమైన వసతుల గురించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు నివేదించాం. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.  - శంకర్, పీడీ, డ్వామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement