Employment work
-
‘ఉపాధి’లో ఆన్లైన్ హాజరు! జనవరి 1 నుంచి కేంద్రం కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి ఈ పథకం కింద చేపట్టే అన్నిరకాల పనులను నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ (ఎన్ఎంఎంఎస్) ద్వారా నమోదు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉపాధి పనుల్లో కూలీల ‘మాన్యువల్ అటెండెన్స్’కు చెల్లుచీటీ పలికింది. ఇకపై లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారానే అన్నిరకాల పనులకు సంబంధించిన పనుల వివరాలు, కూలీల హాజరును నమోదు చేయాలని స్పష్టం చేసింది. అయితే వ్యక్తిగత మరుగుదొడ్లు, సోక్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ తదితర వ్యక్తిగత ప్రయోజన పనులు, ప్రాజెక్టులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు, ఉపాధి హామీ పథకం కమిషనర్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధిహామీ పథకం అమలు డైరెక్టర్ ధర్మవీర్ ఝా ఉత్తర్వులను పంపించారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడం, పౌర సమాజం పర్యవేక్షణకు వీలుగా కొత్త నిబంధనలు తెచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే మొదలు.. ఉపాధి హామీ కూలీల హాజరును రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా లైవ్ లొకేషన్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలనే నిబంధనను కేంద్రం ఈ ఏడాది మే నెలలోనే తీసుకొచ్చింది. కూలీల అటెండెన్స్ రోజుకు రెండుసార్లు సమయంతో సహా నమోదయ్యేలా, కూలీల ఫొటోలను జియోట్యాగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఇరవై మందికిపైగా కూలీలు పనిచేసే సైట్లలో మాత్రమే వాటిని అమలు చేశారు. ఇప్పుడు ఉపాధి హామీ కింద చేపట్టే అన్ని పనుల్లో (వ్యక్తిగత ప్రయోజన పనులు మినహా) ఎన్ఎంఎంఎస్ ద్వారానే కూలీల హాజరు నమోదు చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ వి«ధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆన్లైన్ నమోదులో ఇబ్బందులెన్నో.. ఉపాధి హామీ పనులు జరిగే మారుమూల ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సమస్య ఉండటం, అందరికీ స్మార్ట్ఫోన్లు, డేటా లేకపోవడం వంటి సమస్యల వల్ల ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల అటెండెన్స్ నమోదు ఇబ్బందికరమేనని క్షేత్రస్థాయిలో ఈ పథకం పరిశీలకులు చెప్తున్నారు. కూలీలు చేసే పనుల కొలతలు, పరిమాణం ప్రకారమే కూలి డబ్బు ఇస్తున్నపుడు కొత్త నిబంధనలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సరిగా పని, కూలి సొమ్ము అందక ఉపాధి హామీ పథకానికి గ్రామీణ పేదలు దూరమవుతున్నారని అంటున్నారు. లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు వంటి చర్యలు మరింత ప్రతిబంధకంగా మారతాయని స్పష్టం చేస్తున్నారు. -
ఉపాధి పనుల్లో బయటపడిన 229 రాగి నాణేలు
బాలానగర్: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మట్టికుండలో 229రాగి నాణేలు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం నందారంలోని లక్ష్మికి చెందిన భూమి (సర్వే నం.83) లో సోమవారం ఈజీఎస్ సిబ్బంది లెవలింగ్ పనులు చేపట్టారు. అడుగులోతు తవ్వగా మట్టికుండ కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి నరేష్ చేరుకుని దానిని విప్పిచూడగా 229 రాగి నాణేలు బయటపడ్డాయి. ఇవి నిజాం కాలం నాటివిగా గుర్తించి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు స్వాధీనపర్చారు. ఈ సంఘటనతో సదరు భూ యజమాని లెవలింగ్ పనులను నిలిపివేయించారు. -
‘ఉపాధి’కి వడదెబ్బ
► మండుటెండల్లో కూలీల పనులు ► తాగునీటికీ నోచుకోని దైన్యం ► పని చేసే స్థల్లాలో టెంట్లు కరువు ► పిల్లల ఆలనాపాలన కోసం ఆయాలు లేరు ► టెంట్లు.. మెడికల్ కిట్ల సరఫరా నిలిచి నాలుగేళ్లు సాక్షి, మంచిర్యాల : ముదురుతున్న ఎండలు.. ప్రభుత్వ పట్టింపు లేని తనం.. ‘ఉపాధి హామీ’ కూలీల ప్రాణాలను సంకటంలో పడేసింది. పని చేసే స్థలాల్లో కూలీలకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినా వాటి అమలు విషయంలో అధికారులు విఫలమవుతున్నారు. నిప్పులు చిమ్ముతున్న భానుడి ప్రతాపానికి ప్రతి రోజు జిల్లాలో ఏదో చోట ఒకరిద్దరు చనిపోతూనే ఉన్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలోనయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. మండుతున్న ఈ ఎండల్లో ఉపాధి కూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నారు. పని చేసే చోట తాగేందుకు కనీసం నీరు కూడా లేని దైన్యం. మధ్యలో కాసేపు సేద తీరుదామంటే నిలువ నీడా కరువే. చెట్ల కింద నీడను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎండలో పని చే స్తూ స్పృహ తప్పి పడిపోతే కనీసం ప్రాథమిక వైద్యమూ అందుబాటులో లేదు. ఓఆర్ఎస్ ప్యాకెట్లూ లేవు. ఇప్పటికే కాగజ్‌నగర్ మండలం కొత్తఅనుకోడకు చెందిన ఉపాధి హామీ పథకం కూలీ ఒలికిళ్ల చిన్నక్క(40) ఈ నెల 7న వడదెబ్బతో చనిపోయింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక, తాగేందుకు నీరు లేక ప్రతి రోజు ఎంతో మంది కూలీలు స్పృహ తప్పి పడిపోవడం మామూలైంది. ఇక పని చేసే స్థల్లాలో కూలీల పిల్లలకు ఆట వస్తువులు.. వారి ఆలనాపాలన చూసుకునేందుకు ఆయాల నియామకం విషయం దేవుడే ఎరుగు. పనికి వెళ్లకపోతే కడుపు నిండని పరిస్థితి. ఇదీ జిల్లాలో ప్రతిష్టాత్మక ఉపాధి హామీ పథకం అమలు తీరు. క్షేత్రస్థాయిలో ఎన్ని సమస్యలున్నా.. ప్రతి రోజు కూలీలు అసౌకర్యాల నడుమ పనులు చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు. ఉపాధి వైపే మొగ్గు.. వేసవిలో చేసేందుకు పనులు లేకపోవడంతో రైతులు, ఇతర వర్గాల వారందరూ ప్రస్తుతం జిల్లాలో ఉపాధి హామీ పనులపై మొగ్గు చూపుతున్నారు. మరోపక్క ఉపాధి పని దొరక్క, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో ‘ఉపాధి’ని కాదని.. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వ లస వెళ్లే వారు. కానీ.. ఈసారి జిల్లా అధికారుల కృషి ఫలితంగా అనేక ప్రాంతాల్లో వలసలు తగ్గారుు. ప్రస్తుతం వారందరికీ అధికారులు పనులు కల్పిస్తున్నా పని స్థలాల్లో అసౌకర్యాలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని పని కొచ్చిన ఆ కూలీల ప్రాణాలను మాత్రం ప్రమాదంలో పడేశాయని చెప్పొచ్చు. మచ్చుకు.. మంచిర్యాల మండలంలో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేవు. లక్సెట్టిపేట మండలంలో పనులు నిర్వహించే ప్రదేశంలో టెంట్లు, తాగునీరు, ప్రథమచికిత్స లాంటి సౌకర్యాలు అందించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండేపల్లి మండలంలో భూ అభివృద్ధి పనులు, రోడ్లు, కుంటల నిర్మాణాలకు రోజుకు 3,500 నుంచి 4,500 మంది కూలీలు వెళ్తున్నారు. పనులు చేసే చోట కూలీలకు నీడ కల్పించేందుకు రెండేళ్లుగా టెంట్లు సరఫరా లేవు. దీంతో కూలీలు పనులు చేసే చోట సేద తీర్చుకునేందుకు నిలువ నీడలేదు. అక్కడ దగ్గరలో చెట్లు ఉంటే, కాసేపు చెట్ల నీడన సేద తీరుతున్నారు. నిర్మల్, సారంగాపూర్ మండలాల్లో మెడికల్ కిట్లు లేవు. లక్ష్మణచాందలో కూలీలకు తాగునీరు లేదు. దిలావర్పూర్ మండలంలో 9544 జాబ్‌కార్డులు ఉండగా.. ఏడు వారాలుగా కూలీ డబ్బులు విడుదల కాలేదు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఎక్కడా టెంట్లు, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో లేవు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. టెంట్లు ఎత్తేశారు.. పని చేసే చోట కూలీలకు నీడ కల్పించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం జిల్లాకు తొమ్మిది వేలకు పైగా టెంట్లు కేంద్రం అందజేసింది. ప్రస్తుతం వాటిలో ఒక్క టెంటు కూడా కనిపించడం లేదు. దీంతో కూలీలు పని చేసే ప్రాంతాల్లో చెట్ల కింద సేద దీరుతున్నారు. చెట్లు, వేరే ఆసరా లేని చోట కూలీలు ఎండలోనే భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 7లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. టెంట్లు లేకపోవడంతో కూలీలు పని తొందరగా ముగించుకుని ఇంటిబాట పడుతున్నారు. నీటి తిప్పలు.. ముదురుతున్న ఎండలకు తగట్టు దాహమేస్తోంది. దీంతో శరీరంలో ఉన్న నీరు నిర్జలీకరణమవుతోంది. దానికి తోడు పని చేసే స్థలాల్లో తాగునీటి వసతి లేకపోవడంతో ఉపాధి కూలీలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. ఉపాధి కూలీలకు ప్రభుత్వం రోజుకు రూ.5 చొప్పున కూలితోనే కలిపి ఇస్తుంది. కానీ కూలి డబ్బులు సకాలంలో రాకపోవడంతో అధికారులూ చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం కూలీలు ఇళ్ల నుంచే క్యాన్లలో నీళ్లు పట్టుకొచ్చినా.. వచ్చిన అరగంటలోపే వేడెక్కుతున్నాయి. దీంతో వేడి నీటినే తాగాల్సి వస్తోంది. జాడ లేని మెడికల్ కిట్లు.. పని చేసే చోట కూలీలకు ఎప్పుడైనా.. ఏదైనా ప్రమాదం జరగొచ్చు. అలాంటప్పుడు వెంటనే ప్రథమ చికిత్స అందించాలన్నా మెడికల్ కిట్లు ఎక్కడా అందుబాటులో లేవు. ప్రస్తుత ఎండ తీవ్రతకు ఎంతోమంది కూలీలు అనేక చోట్ల సొమ్మసిల్లి పడిపోతూనే ఉన్నారు. వారికి కొంచెం నీళ్లుతాగించి.. ఇంటికి పంపేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కేంద్రం అందజేసిన కిట్లన్నీ ఇప్పుడు మాయమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ల అవసరం ఎంతైనా ఉంది. కేంద్రానికి నివేదించాం నాలుగేళ్ల క్రితం జిల్లాకు టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు సరఫరా అయ్యాయి. ఆ తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి వసతులు రాలేదు. ప్రస్తుతం పలు చోట్ల మాత్రమే టెంట్లు, ఫస్ట్‌ఎయిడ్ బాక్సులున్నాయి. ఎండలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు అవసరమైన వసతుల గురించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు నివేదించాం. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. - శంకర్, పీడీ, డ్వామా -
‘మొక్కే’శారు?
- నర్సరీ నిర్వహణలో బట్టబయలైన అవినీతి బాగోతం! - ఉపాధి పనికి వెళ్లని వారి పేర్లతో ఎన్‌ఎంఆర్‌లు బర్లి (బలిజిపేట రూరల్): మండలంలోని మిర్తివలస వద్ద ఉన్న నర్సరీ నిర్వహణలో అవినీతి బాగోతం బట్టబయలయింది. ఉపాధి పనికి వెళ్లని వేతనదారుల పేర్లతో ఎన్‌ఎంఆర్‌లు తయారుచేసి నిధులు స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మిర్తివలస నర్సరీ వద్ద సుమారు రెండు సంవత్సరాల నుంచి మొక్కల పెంపకం చేపడుతున్నారు. 4లక్షల మొక్కలను పెంచేందుకు రంగం సిద్ధం చేసి దాని నిర్వహణకు ఉపాధి కూలీల చేత పనులు చేయించుకుని నిధులు డ్రాచేసి వారికి చెల్లింపులు చేస్తున్నారు. జూలై నెలలో 013170033 ఐడి నంబరుతో బర్లి గ్రామం నుంచి మూడు గ్రూపులకు చెందిన 53 మంది ఉపాధి కూలీలతో 6 రోజులు పనిచేయించినట్టు ఎన్ఎంఆర్ రాశారు. దీనికి సంబంధించి రూ. 47,412 నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ విషయం ఉపాధి కూలీలకు తెలియదు. దీనిలో నుంచి కలిశెట్టి యశోదమ్మ రూ.896 బర్లి పోస్టాఫీసు నుంచి డ్రా చేయడంతో డొంక కదిలింది. పనిచేయని వాటికి ఎలా నిధులు వచ్చాయని ఉపాధి కూలీలు పాలూరు సింహాచలం, అన్నపూర్ణ, కోట్ల చిన్నమ్మడు, రాంబార్కి గౌరి, బెజ్జిపురపు సూర్యనారాయణ, గంగమ్మ, తదితరులు జుత్తు పీక్కుంటున్నారు. దీనికి సంబంధించి ఉపాధిహామీ పథకం అధికారులు, సిబ్బంది, నర్సరీకి చెందిన వారి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనిచేయని దానికి నిధులు మంజూరవడంతో వేతనదారులు డబ్బులు తీసుకోలేదు. అయితే ఈవిధంగా ఎన్నిరకాల నిధులు దుర్విని యోగమవుతున్నాయోననే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పీఓ హరనాథ్‌ను వివరణ కోరగా ఎటువంటి పొరపాటు జరగలేదని తెలిపారు. పనిచేసిన వారి పేర్లే ఎన్‌ఎంఆర్‌లో ఉన్నాయన్నారు. -
పనులు సరే..పైసలేవీ..?
సాక్షి, కాకినాడ :ఈ ఏడాది అధిక వేసవి పుణ్యమాని ఉపాధి కూలీలకు చేతినిండా పని దొరికింది. రోజుకు సరాసరిన లక్షన్నర పనిదినాలు కల్పించారు. సీజన్ ప్రారంభంలో రోజుకు 30 వేల పనిదినాలు కల్పించగా క్రమే ణా పనిదినాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సాధారణంగా వర్షాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ మొదటి వారం నుంచి ఉపాధి పనులు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ ఈ ఏడాది ఊహించని ఉష్ణోగ్రతలతో జూలై రెండవ వారం వరకు ఎండలు కాస్తూనే ఉన్నా యి. దీంతో ఉపాధి పనులు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. నడివేసవిలో అయితే ఏకంగా రోజుకు రెండున్నర లక్షల పనిదినాలు కల్పించగా, జూన్‌లో సరాసరిన రోజుకు లక్షన్నర పనిదినాలు కల్పించారు. కాస్త చినుకులు పడుతుండడంతో గత నాలుగైదు రోజుల నుంచి పనిదినాల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రోజుకు 90వేల పనిదినాలు కల్పిస్తున్నారు. జిల్లాలో 75 గ్రామాల పరిధిలోని కూలీలకు ఐసీఐ సీఐ బ్యాంకు ద్వారా, మిగిలిన వెయ్యి గ్రామాల పరిధిలోని కూలీలకు పోస్టల్ శాఖ ద్వారానే వేతన చెల్లింపులు జరుపుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కూలీల పాలిట శాపంగామారింది. పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సకాలంలో వేతనాలు అందక కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సాకుగా చూపి వేతన బకాయిల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటూ వచ్చేది. జిల్లాలో ఈ సీజన్లో ఏప్రిల్ నుంచి మే వరకు రూ.90 కోట్లకు పైగా విలువైన పనులు జరిగితే సుమారు రెండునెలల పాటు విభజన ప్రభావంతో నిలిచిన వేతనాలకు సంబంధించి రూ.75 కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. కానీ ఈ మొత్తం సకాలంలో జమ కాక కూలీలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. తలనొప్పిగా మారిన తపాలా పాస్‌పుస్తకాలు వేతనాల చెల్లింపు పాస్‌బుక్‌లు జారీకాక కొంత ఆలస్యమవుతుంటే... సిబ్బంది కొరతను సాకుగా చూపి మరికొంత జాప్యం చేస్తున్నారు. చెల్లింపుల్లో జాప్యం లేదని అధికారులు చెబుతున్న ప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 30 శాతానికి పైగా కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత తక్కువ లెక్కేసుకున్నా మండలానికి 200 నుంచి 500 మంది చొప్పున జిల్లావ్యాప్తంగా సుమారు 3000 మంది వరకు పాస్ పుస్తకాలు జారీ కాక ఇబ్బందులు పడుతున్న కూలీలున్నారు. ఫలితాన్నివ్వని వర్క్ టు వేజ్ పోస్టల్‌శాఖలో సిబ్బంది కొరత కారణంగా వేతనాలు సకాలంలో అందడం లేదని గుర్తించిన డ్వామా పీడీ సంపత్‌కుమార్ ఈ పరిస్థితిని చక్కదిద్దే లక్ష్యంతోనే వర్కు టు వేజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారానికొకరోజు ఫీల్డ్ అసిస్టెంట్స్‌తో పాటు ఒకరిద్దరు డ్వామా సిబ్బంది సంబంధిత గ్రామాల పరిధిలోని పోస్టల్ కార్యాలయంలో మకాం వేసి పనిచేసిన ప్రతి కూలీకి వేతనం అందే వరకు పోస్టల్ సిబ్బందికి సహాయం అందిస్తారు. అయితే చాలా పోస్టల్ కార్యాలయాల్లో పనిఒత్తిడి కారణంగా వీరికి పోస్టల్ శాఖ సహకరించని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల పోస్టల్ సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం వల్ల వందలాది మంది కూలీలు పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. విడుదల కాని వేతనాలు జిల్లాలో నెలరోజుల్లో జరిగిన పనిదినాలకు సంబంధించి సుమారు రూ.20 కోట్ల మేర వేతన బకాయిలు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. విడుదలైన బకాయిలు చేతికందక.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడం వంటి సమస్యలతో కూలీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ వేతన బకాయిల చెల్లింపుల విషయంలో కొన్నిచోట్ల డ్వామా సిబ్బందితో పాటు పోస్టల్ సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కూలీకి మంజూరయ్యే మొత్తంలో ఐదు నుంచి పదిశాతం మామూళ్ల రూపంలో సమర్పించుకోవాల్సి వస్తోందని పలు గ్రామాల్లో కూలీలు అంటుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.