- నర్సరీ నిర్వహణలో బట్టబయలైన అవినీతి బాగోతం!
- ఉపాధి పనికి వెళ్లని వారి పేర్లతో ఎన్‌ఎంఆర్‌లు
బర్లి (బలిజిపేట రూరల్): మండలంలోని మిర్తివలస వద్ద ఉన్న నర్సరీ నిర్వహణలో అవినీతి బాగోతం బట్టబయలయింది. ఉపాధి పనికి వెళ్లని వేతనదారుల పేర్లతో ఎన్‌ఎంఆర్‌లు తయారుచేసి నిధులు స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మిర్తివలస నర్సరీ వద్ద సుమారు రెండు సంవత్సరాల నుంచి మొక్కల పెంపకం చేపడుతున్నారు. 4లక్షల మొక్కలను పెంచేందుకు రంగం సిద్ధం చేసి దాని నిర్వహణకు ఉపాధి కూలీల చేత పనులు చేయించుకుని నిధులు డ్రాచేసి వారికి చెల్లింపులు చేస్తున్నారు. జూలై నెలలో 013170033 ఐడి నంబరుతో బర్లి గ్రామం నుంచి మూడు గ్రూపులకు చెందిన 53 మంది ఉపాధి కూలీలతో 6 రోజులు పనిచేయించినట్టు ఎన్‌ఎంఆర్ రాశారు.
దీనికి సంబంధించి రూ. 47,412 నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ విషయం ఉపాధి కూలీలకు తెలియదు. దీనిలో నుంచి కలిశెట్టి యశోదమ్మ రూ.896 బర్లి పోస్టాఫీసు నుంచి డ్రా చేయడంతో డొంక కదిలింది. పనిచేయని వాటికి ఎలా నిధులు వచ్చాయని ఉపాధి కూలీలు పాలూరు సింహాచలం, అన్నపూర్ణ, కోట్ల చిన్నమ్మడు, రాంబార్కి గౌరి, బెజ్జిపురపు సూర్యనారాయణ, గంగమ్మ, తదితరులు జుత్తు పీక్కుంటున్నారు. దీనికి సంబంధించి ఉపాధిహామీ పథకం అధికారులు, సిబ్బంది, నర్సరీకి చెందిన వారి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనిచేయని దానికి నిధులు మంజూరవడంతో వేతనదారులు డబ్బులు తీసుకోలేదు. అయితే ఈవిధంగా ఎన్నిరకాల నిధులు దుర్విని యోగమవుతున్నాయోననే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పీఓ హరనాథ్‌ను వివరణ కోరగా ఎటువంటి పొరపాటు జరగలేదని తెలిపారు. పనిచేసిన వారి పేర్లే ఎన్‌ఎంఆర్‌లో ఉన్నాయన్నారు.
‘మొక్కే’శారు?
Published Sat, Sep 6 2014 2:47 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement