పనులు సరే..పైసలేవీ..?
సాక్షి, కాకినాడ :ఈ ఏడాది అధిక వేసవి పుణ్యమాని ఉపాధి కూలీలకు చేతినిండా పని దొరికింది. రోజుకు సరాసరిన లక్షన్నర పనిదినాలు కల్పించారు. సీజన్ ప్రారంభంలో రోజుకు 30 వేల పనిదినాలు కల్పించగా క్రమే ణా పనిదినాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సాధారణంగా వర్షాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ మొదటి వారం నుంచి ఉపాధి పనులు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ ఈ ఏడాది ఊహించని ఉష్ణోగ్రతలతో జూలై రెండవ వారం వరకు ఎండలు కాస్తూనే ఉన్నా యి. దీంతో ఉపాధి పనులు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. నడివేసవిలో అయితే ఏకంగా రోజుకు రెండున్నర లక్షల పనిదినాలు కల్పించగా, జూన్‌లో సరాసరిన రోజుకు లక్షన్నర పనిదినాలు కల్పించారు. కాస్త చినుకులు పడుతుండడంతో గత నాలుగైదు రోజుల నుంచి పనిదినాల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రోజుకు 90వేల పనిదినాలు కల్పిస్తున్నారు.
జిల్లాలో 75 గ్రామాల పరిధిలోని కూలీలకు ఐసీఐ సీఐ బ్యాంకు ద్వారా, మిగిలిన వెయ్యి గ్రామాల పరిధిలోని కూలీలకు పోస్టల్ శాఖ ద్వారానే వేతన చెల్లింపులు జరుపుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కూలీల పాలిట శాపంగామారింది. పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సకాలంలో వేతనాలు అందక కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సాకుగా చూపి వేతన బకాయిల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటూ వచ్చేది. జిల్లాలో ఈ సీజన్‌లో ఏప్రిల్ నుంచి మే వరకు రూ.90 కోట్లకు పైగా విలువైన పనులు జరిగితే సుమారు రెండునెలల పాటు విభజన ప్రభావంతో నిలిచిన వేతనాలకు సంబంధించి రూ.75 కోట్లు ఇటీవలే విడుదలయ్యాయి. కానీ ఈ మొత్తం సకాలంలో జమ కాక కూలీలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.
తలనొప్పిగా మారిన తపాలా పాస్‌పుస్తకాలు
వేతనాల చెల్లింపు పాస్‌బుక్‌లు జారీకాక కొంత ఆలస్యమవుతుంటే... సిబ్బంది కొరతను సాకుగా చూపి మరికొంత జాప్యం చేస్తున్నారు. చెల్లింపుల్లో జాప్యం లేదని అధికారులు చెబుతున్న ప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 30 శాతానికి పైగా కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత తక్కువ లెక్కేసుకున్నా మండలానికి 200 నుంచి 500 మంది చొప్పున జిల్లావ్యాప్తంగా సుమారు 3000 మంది వరకు పాస్ పుస్తకాలు జారీ కాక ఇబ్బందులు పడుతున్న కూలీలున్నారు.
ఫలితాన్నివ్వని వర్క్ టు వేజ్
పోస్టల్‌శాఖలో సిబ్బంది కొరత కారణంగా వేతనాలు సకాలంలో అందడం లేదని గుర్తించిన డ్వామా పీడీ సంపత్‌కుమార్ ఈ పరిస్థితిని చక్కదిద్దే లక్ష్యంతోనే వర్కు టు వేజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారానికొకరోజు ఫీల్డ్ అసిస్టెంట్స్‌తో పాటు ఒకరిద్దరు డ్వామా సిబ్బంది సంబంధిత గ్రామాల పరిధిలోని పోస్టల్ కార్యాలయంలో మకాం వేసి పనిచేసిన ప్రతి కూలీకి వేతనం అందే వరకు పోస్టల్ సిబ్బందికి సహాయం అందిస్తారు. అయితే చాలా పోస్టల్ కార్యాలయాల్లో పనిఒత్తిడి కారణంగా వీరికి పోస్టల్ శాఖ సహకరించని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల పోస్టల్ సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం వల్ల వందలాది మంది కూలీలు పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
విడుదల కాని వేతనాలు
జిల్లాలో నెలరోజుల్లో జరిగిన పనిదినాలకు సంబంధించి సుమారు రూ.20 కోట్ల మేర వేతన బకాయిలు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. విడుదలైన బకాయిలు చేతికందక.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడం వంటి సమస్యలతో కూలీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ వేతన బకాయిల చెల్లింపుల విషయంలో కొన్నిచోట్ల డ్వామా సిబ్బందితో పాటు పోస్టల్ సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కూలీకి మంజూరయ్యే మొత్తంలో ఐదు నుంచి పదిశాతం మామూళ్ల రూపంలో సమర్పించుకోవాల్సి వస్తోందని పలు గ్రామాల్లో కూలీలు అంటుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.