
రాగి నాణేలను పరిశీలిస్తున్న అధికారులు, నిజాం కాలం నాటి నాణేలు
బాలానగర్: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు మట్టికుండలో 229రాగి నాణేలు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం నందారంలోని లక్ష్మికి చెందిన భూమి (సర్వే నం.83) లో సోమవారం ఈజీఎస్ సిబ్బంది లెవలింగ్ పనులు చేపట్టారు. అడుగులోతు తవ్వగా మట్టికుండ కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి నరేష్ చేరుకుని దానిని విప్పిచూడగా 229 రాగి నాణేలు బయటపడ్డాయి. ఇవి నిజాం కాలం నాటివిగా గుర్తించి ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు స్వాధీనపర్చారు. ఈ సంఘటనతో సదరు భూ యజమాని లెవలింగ్ పనులను నిలిపివేయించారు.