సాక్షి ప్రతినిధి, కడప: నేషనల్ హైవే-67 రోడ్డు పనుల్లో భాగంగా ముద్దనూరు- జమ్మలమడుగు రోడ్డుకు మహర్దశ పట్టింది. రూ.143 కోట్లుతో చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ముద్దనూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం, ఘాట్‌రోడ్డు పనులు చేపట్టనున్నారు.
ఎన్‌హెచ్-67లోని 513వ కిలోమీటరు (యామవరం) నుంచి 545వ కిలోమీటరు (జమ్మలమడుగు) వరకూ రోడ్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముద్దనూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి, ముద్దనూరు ఘాట్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. 32 కిలోమీటర్ల పరిధిలో నిర్వహించనున్న ఈ రోడ్డు పనులను రూ.143.8 కోట్లతో ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) ద్వారా చేపట్టనున్నారు. అందులో 3 కిలోమీటర్లు ఆయా గ్రామాల మధ్య ఫోర్‌లైన్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. మార్చిలో
టెండర్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు దశాబ్దాల నిరీక్షణ....
ముద్దనూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఘాట్ రోడ్డు పునరుద్దరణ చేపట్టాలని జమ్మలమడుగు వాసులు మూడు దశాబ్దాలుగా ఆకాంక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి అభ్యర్థనల మేరకు అప్పటి పార్లమెంటు సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి నుంచి ఇప్పటి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వరకూ అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వందలాది రోడ్డు ప్రమాదాలు ఆ మార్గంలో సంభవించడమే అందుకు కారణం. ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు నేషనల్ హైవే ఆథారిటీ ముందుకు రావడాన్ని జమ్మలమడుగు వాసులు హర్షిస్తున్నారు.
ముద్దనూరు-జమ్మలమడుగు రోడ్డుకు మహర్దశ!
Published Fri, Feb 13 2015 1:57 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement