సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే కేంద్ర ప్రభుత్వం సైతం జిల్లా పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. విభజన చట్టం అమలు పర్చడంలో నిర్లక్ష్యం చూపుతోంది. ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తకుండా అభివృద్ధి చేసుకోండని జిల్లాకు కేవలం రూ.50 కోట్లు విదిల్చింది. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా అభివృద్ధి పనులు ఉన్నా ప్రత్యేక చొరవ శ్రద్ధ చూపడంలేదని జిల్లా వాసులు మండిపడుతున్నారు. వేసవి నేపధ్యంలో తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపడేలా నిధులు ఉండడం మినహా ప్రత్యేకమైన అభివృద్ధి చేసుకునే స్థాయిలో లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా వాటా రూ.50కోట్లు...
రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ రూ.350 కోట్లలో జిల్లాకు రూ.50కోట్లు దక్కనుంది. అయితే జిల్లాలో సాగు, తాగునీటి పథకాలతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతను భరించాల్సిన ప్రభుత్వం కేవలం రూ.50 కోట్లుతో సరిపెట్టడం ఏమాత్రం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గాలేరి-నగరి సుజల స్రవంతి పథకం అసంపూర్తిగా ఉంది. గండికోట, సర్వరాయసాగర్, వామికొండ రిజర్వాయర్లు పూర్తి అరుు నిల్వ సామర్థ్యం ఉన్నా నీరు తెచ్చుకోలేని దుస్థితి. మైలవరం, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లు అలంకార ప్రాయంగా ఉండిపోయాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తే జిల్లాలో సాగునీటి సమస్య చాలా వరకు తీరనుంది.
భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం రూపొందించిన సోమశిల బ్యాక్ వాటర్ పథకం కూడా ఇప్పటికీ పూర్తికాలేదు. ఆయా పథకాల కోసం కనీసం రూ.300 కోట్లు కేటాయిస్తే ప్రాథమికంగా కృష్ణజలాలు నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్న విమనాశ్రయం, కలెక్టరేట్ కాంప్లెక్స్‌లను సైతం ప్రారంభించకపోవడమే జిల్లా పట్ల వివక్ష చూపుతున్నారనేందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వమైనా విభజన చట్టాన్ని అమలు చేస్తుందని భావించిన జిల్లా వాసులకు నిరాశే ఎదురైంది. ఉక్కు పరిశ్రమ ఊసెత్తకపోవడమే అందుకు నిదర్శనం. ఈనేపధ్యంలో కేవలం రూ.50 కోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని పలువురు భావిస్తున్నారు.
ఉపయోగం లేని కేటాయింపులు
కేంద్రం ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కేటాయింపులు ఉపయోగం లేనివి. వారు కేటాయించిన ప్రకారం మండలానికి రూ. కోటి ఏమాత్రం సరిపోవు. ఈ కేటాయింపులు అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవు. కేంద్రం ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత మన రాష్ట్రానికి ఇవ్వకపోవడం శోచనీయం. వేల కోట్లు అవసరం కాగా, కంటితుడుపు చర్యగా కేటాయించడం దారుణం.
- నారాయణ, జిల్లా కార్యదర్శి, సీపీఎం
చంద్రబాబు వైఫల్యం
కేంద్రం నుంచి నిధులను రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారు. కేంద్రం ఎందుకూ పనికిరాని విధంగా అరకొర బడ్జెట్‌ను కేటాయించడం తగదు. పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తే తప్ప అభివృద్ధి సాధ్యపడదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టడానికి కృషి చేయాల్సి ఉంది.
- చంద్రమౌళీశ్వరరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకుడు
సీమ ఏర్పాటు ఉద్యమం తప్పదు
కేంద్రం రాష్ట్రానికి దగా కోరు కేటాయింపులు చేసింది. ఈ కేటాయింపుల కారణంగా అన్ని విధాల వెనుకబడిన రాయలసీమకు ఏమాత్రం మేలు జరగదు. ఫలితంగా సీమ ఏర్పాటు ఉద్యమం తప్పదు. రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తమ వ్యాపార ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడంలేదు.
- చంద్ర, నగర కార్యదర్శి, సీపీఐ
ప్యాకేజీ పెంపుదల కోరతాం
ప్యాకేజీ రూపంలో బడ్జెట్ రాదనుకుంటున్న తరుణంలో కేంద్రం స్పందించింది. నామమాత్రంగానైనా ప్యాకేజీని ప్రకటించింది. ఇది తక్కువ ప్యాకేజీ అయినప్పటికీ బడ్జెట్‌ను పెంపుదల చేయాలని కేంద్రాన్ని కోరుతాం.
- అల్లపురెడ్డి హరినాథరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు
గురుతర బాధ్యతను విస్మరిస్తోంది...
వెనుకబడిన ప్రాంతాల్ని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంది. వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చొరవ చూపాలి. రూ.50కోట్లు కేటాయింపులు ఏమూలకు సరిపడవు. జిల్లా పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత స్పష్టంగా కన్పిస్తోంది.
-కొత్తమద్ధి సురేష్‌బాబు, మేయర్, కడప.
అన్యాయమే!
Published Fri, Feb 6 2015 1:35 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement