కడప రూరల్, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోంది. నిన్న అమాంతం గ్యాస్ ధరలను పెంచేసింది. తాజాగా మళ్లీ పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ పెరుగుతున్న ధరలను చూసి సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఇదేమి ప్రభుత్వం రా.. బాబోయ్ అంటున్నాడు.
పది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై 50 పైసలు పెంచింది. తాజాగా లీటరు పెట్రోలు దాదాపు రూ. 76.95 ఉండగా, అదనంగా 75 పైసలు పెరిగింది. డీజిల్ లీటరు రూ. 57.95 ఉండగా, అదనంగా 50 పైసలు పెంచారు. ఈ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.
జిల్లాలో రోజుకు దాదాపు పెట్రోలు 20 వేలు, డీజిల్ 40 వేల లీటర్లు ఖర్చవుతోందని అంచనా. కేవలం ఇప్పుడు పెరిగిన ధరల కారణంగా పెట్రోలుపై రోజుకు రూ. 15 వేలు, డీజిల్‌పై రూ. 20 వేలు అదనపు భారం పడనుంది. అంటే దాదాపు పెట్రోలుపై నెలకు రూ. 4.50 లక్షలు, డీజల్‌పైరూ. 6 లక్షల అదనపు భారం పడనుంది.
ఇప్పటికే కేంద్రం సిలిండర్‌పై అమాంతంగా రూ. 215ను పెంచింది. ఆ దెబ్బనుంచి ప్రజలు కోలుకోకముందే మరోమారు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచింది. ఇప్పటికే ఆకాశాన్నంటిన ధరలతో నిరుపేదల సంగతి అటుంచితే మధ్య తరగతి, ఆపై కుటుంబాల వారే పెరిగిన ధరలను చూసి జడుసుకుంటున్నారు. ఈనేపధ్యంలో సంక్రాంతి పండుగ ముందు ఎడాపెడా గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.