అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పాపానికి ఒడిగట్టిన యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడుతున్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 82వ రోజైన ఆదివారం కూడా ‘సమైక్య’ పోరును హోరెత్తించారు. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అనంతపురం నగరంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలు సింహగర్జన చేశారు. స్థానిక టవర్‌క్లాక్ వద్దనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట చేపట్టిన ఈ కార్యక్రమానికి మాదిగలతో పాటు కుల,మతాలకు అతీతంగా సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎస్కేయూలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. బత్తలపల్లిలో సమైక్యవాదులు ర్యాలీ చేశారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ నాయకుల రిలేదీక్షలు 64వ రోజుకు చేరాయి.
పామిడిలో సమైక్యవాదులు మౌనదీక్ష చేశారు. టీసీ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యమం 82వ రోజుకు చేరిన సందర్భంగా ఆ సంఖ్య ఆకారంలో కూర్చొని.. నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి, ఎస్‌డీఎస్ కళాశాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన మెప్మా అధికారి రాయల్ విజయభాస్కర్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో నిరశన దీక్ష ప్రారంభించారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. రాయదుర్గంలో రాజకీయ జేఏసీ నేతలు, సమైక్యవాదుల రిలేదీక్షలు కొనసాగాయి. రాజకీయ జేఏసీ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కిరణ్ వైఖరిపై మండిపడ్డారు.
సమైక్యాంధ్రకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్ తియ్యటి విషం లాంటివాడని అభివర్ణించారు. అలాగే పట్టణంలో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. కణేకల్లులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. తాడిపత్రి మండలం చుక్కలూరులో గ్రామస్తులు వంటా వార్పు నిర్వహించారు. తాడిపత్రిలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రిలేదీక్షలు కొనసాగించారు. పెనుకొండ, శింగనమల, రాప్తాడు, కళ్యాణదుర్గం, ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల పరిధిలో ‘సమైక్య’ నిరసనలు కొనసాగాయి.
చల్లారని ప్రజాగ్రహం
Published Mon, Oct 21 2013 2:27 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement