సాక్షి, అనంతపురం : సమైక్యవాదులు సమరోత్సాహంతో ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర విభజన ఆపేదాకా విశ్రమించబోమంటూ శపథం చేస్తున్నారు. 22వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ప్రజలు, వివిధ జేఏసీల నాయకులు, ఎన్‌జీఓలతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు చురుగ్గా పొల్గొన్నారు. అనంతపురం నగరంలో జేఏసీ, ఎన్‌జీఓల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. శ్రీకంఠం సర్కిల్‌లో అరగంట పాటు మానవహారం నిర్మించారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే రాజీనామా చేసి.. ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో స్థానిక సప్తగిరి సర్కిల్‌లో బైక్‌లతో రౌండ్లు కొడుతూ.. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. డ్వామా ఉద్యోగులు ప్రదర్శన చేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ వరకు రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు వేలాది మంది రైతులతో ర్యాలీ చేశారు.
చిన్న ట్రాక్టర్లతో ర్యాలీ చేయడంతో నగరమంతా హారన్లతో మార్మోగింది. ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వ ఆస్పత్రి, వాణిజ్య పన్నులశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ , నీటిపారుదల ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్యే గురునాథరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన నగరంలో వాహనాలకు సమైక్యాంధ్ర స్టిక్కర్లు అతికించారు. నగరానికి చెందిన వేలాది మంది మహిళలు, వృద్ధులు కూడా ర్యాలీ నిర్వహించారు.
‘హైదరాబాద్ వెళ్లేవారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండా ఐదు నిమిషాల్లో పాస్‌పోర్టు, వీసా జారీ చేస్తామం’టూ సమైక్యవాదులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్‌లో కట్టిన బ్యానర్ ఆకట్టుకుంది. ఎస్కేయూ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది వర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగభూషణ్‌రెడ్డి, ఇటుకలపల్లి సర్పంచ్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లతో వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ సమీపంలోని మారుతీనగర్ కాలనీ మహిళలు ర్యాలీగా వచ్చి.. వర్సిటీ ఎదుట సోనియా దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ దహనం చేశారు. సేతు, పాంచజన్య, రాధాస్కూల్ ఆఫ్ లర్నింగ్ పాఠశాలల విద్యార్థులు వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి మధ్యాహ్న భోజనం చేశారు. ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం, రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మద్దతు తెలిపాయి. గుంతకల్లులో సమైక్యవాదులు జాతీయరహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో ఉపాధ్యాయులు క్యాట్ వాక్ చేస్తూ నిరసన తెలిపారు. పామిడిలో సమైక్యవాదులు, హిందూపురంలో సమైక్యాంధ్ర జేఏసీ, జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రెడ్డిసేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు చేశారు. కదిరిలో మహిళా టీచర్లు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ చేశారు. కటారుపల్లి రైతులు, విద్యార్థి జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. కళ్యాణదుర్గంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. జేఏసీ నాయకులు, సమైక్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. మడకశిరలో వక్కలిగులు ఎడ్లబండ్ల ప్రదర్శన, రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. వెటర్నరీ సిబ్బంది, వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
గుడిబండలో సమైక్యవాదుల ఆందోళనలు మిన్నంటా యి. అమరాపురంలో ఉపాధ్యాయులు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు రిలే దీక్షలు చేపట్టారు. ఓడీసీ, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో సమైక్య నిరసనలు కొనసాగాయి. పెనుకొండలో సమైక్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాయదుర్గంలో సై మెక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, న్యాయవాదులు, కురిహినశెట్టి సమాజ జనుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో ఇద్దరు సమైక్యవాదులు ఆమరణ దీక్ష చేపట్టారు. సీకేపల్లిలో జాతీయ రహదారిపై వంటా వార్పు చేపట్టారు. ఆత్మకూరులో ఐకేపీ ఉద్యోగులు, రామగిరిలో విద్యార్థులు, శింగనమలలో పెయింటర్లు, నార్పలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
తాడిపత్రిలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మునిసిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి.. రోడ్డుపై యోగాసనాలు వేశారు. యాడికిలో జేఏసీ నాయకులు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో జేఏసీ రిలేదీక్షలకు వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఉరవకొండలో ప్రదర్శన నిర్వహించారు. విడపనకల్లులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
జన గర్జన
Published Thu, Aug 22 2013 3:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement