వీరంరాజ్‌పల్లిలో అధికారులతో విచారిస్తున్న జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్
సాక్షి, నాగర్‌కర్నూల్: కేన్సర్ వ్యాధితో హాస్పిటల్‌లో చేరిన వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి చెందినా.. రిపోర్ట్‌లు రాకముందే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అంటగట్టి చేతులు దులుపుకోవడంతో అధికారులు, మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం వీరంరాజ్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి(52) 15 ఏళ్ల క్రితం గ్రామం నుంచి హైదరాబాద్ వలస వెళ్లి అల్వాల్ ప్రాంతంలోని నేతాజీనగర్‌లో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈయన ఈ నెల 14న అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించగా.. గొంతు కేన్సర్‌గా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు లక్డికాపూల్ ఎంఎన్‌జేæ కేన్సర్ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు.
కాగా అతని రక్త నమూనాలను ఈ నెల 5న సేకరించి టెస్టులకు పంపించగా.. 6వ తేదీ ఉదయం 7 గంటలకు ఆయన మృతిచెందాడు. దీంతో హాస్పిటల్ నిర్వాహకులు, సిబ్బంది మృతదేహాన్ని వెంటనే తీసుకెళ్లాలని అతని కుమార్తెకు తెలియజేయడంతో ఆమె తన బంధువు సాయంతో అంబులెన్స్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వగ్రామమైన వీరంరాజుపల్లికి తీసుకొచ్చింది. గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మధ్యాహ్నం 2:30 గంటలకు మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన బంధువులు 46 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దహన సంస్కారాల అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హాస్పిటల్ నుంచి అతనికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం వచ్చింది. ఈ విషయం ఆదివారం సర్పంచ్ భర్త మనోహర్‌కు తెలియడంతో ఆయన అధికారులకు సమాచారం అందించారు. చదవండి: చేస్తున్నది అటెండర్ ఉద్యోగం.. చేసేది కలెక్టర్ సంతకం
వివరాలు సేకరించిన డీఎంహెచ్‌ఓ 22 మందిని క్యారంటైన్‌కు తరలించే చర్యలు తీసుకుంటున్నామని, మిగతా వారిని హోం క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు, గ్రామం మొత్తం జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచాలని ఎస్‌ఐతో పాటు డాక్టర్లకు సూచించారు. ఈ సంఘటనతో గ్రామంలోని జనం బిక్కుబిక్కు మంటూ బయటికి రావడానికి జంకుతున్నారు.
గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌ఓ
కరోనా పాజిటివ్ కేసు వ్యక్తి మృతదేహానికి అత్యక్రియలు జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్, తహసీల్దార్ రాధాకృష్ణ, ఎస్‌ఐ వీరబాబు, డాక్టర్లు సురేష్, శ్రావణ్‌లతో పాటు వైద్య సిబ్బంది ఆదివారం గ్రామాన్ని సందర్శించారు. మృతుని కుమార్తె, భార్యతో హాస్పిటల్‌లో చోటుచేసుకున్న పరిణామాలను తెలుసుకున్నారు. కేన్సర్‌తోనే మా తండ్రి మృతి చెందినట్లు ఎంఎన్‌జె హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు తెలుపడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశామని తెలియజేశారు. అంత్యక్రియల్లో 46 మంది పాల్గొనగా.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని తాకినట్లు వెల్లడించారు. అంత్యక్రియల అనంతరం తమకు హాస్పిటల్ నుంచి మా నాన్నకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అల్వాల్ పోలీసుల ద్వారా సమాచారం అందినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment