మెరుగవుతున్న మెట్రానమిక్స్‌ థెరపీ! | New Ways Improving In Cancer Treatment | Sakshi
Sakshi News home page

మెరుగవుతున్న మెట్రానమిక్స్‌ థెరపీ!

Published Thu, Jan 30 2020 12:05 AM | Last Updated on Thu, Jan 30 2020 12:05 AM

New Ways Improving In Cancer Treatment - Sakshi

ఒక శతాబ్దకాలంగా వైద్యరంగంలో అత్యంత వినూత్యమైన మార్పులు వస్తూ ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత భయానకమైన వ్యాధుల్లో ఒకటిగా పేరొందిన క్యాన్సర్‌కు మాత్రం ఇంకా మందు కనుక్కోలేకపోయాం. కానీ ఈ రంగంలోని పురోగతే రోగుల జీవితాన్ని మరింత సౌకర్యంగా మారుస్తోంది. అందుకు ఆధునిక విజ్ఞానానికి మనమెంతగానో రుణపడి ఉండాల్సిందే. ఏదైనా ఒక పరిశోధన జరిగిందనుకోండి. అదెంతవరకు సఫలమైందో చెప్పడానికి ఓ అంచనా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశకాలే ఆ పరిశోధనకు గీటురాయి.

రోగి పరిస్థితి ఎలా ఉందో అంచనావేసేందుకు... అతడి అంతర్గత అవయవాల కార్యకలాపాలు (ఫిజియలాజికల్‌ స్టేటస్‌), రోగి ఎంతగా బాగున్నాడు (ఫిట్‌నెస్‌) అనే అంశాలు ఆ పరిశోధన ఏ మేరకు సత్ఫలితాలు సాధించిందో చెబుతాయి. ఈ రకంగా రోగి జీవితం/పరిస్థితి (పర్‌ఫార్మెన్స్‌ స్టేటస్‌) బాగుంటే పరిశోధన విజయవంతమైనట్లే. కానీ క్యాన్సర్‌కు మనం చికిత్స చేసే సమయంలో కొన్ని సందేహాలు మనల్ని (అంటే డాక్టర్లనీ, రోగి కుటుంబ సభ్యులనూ) వెంటాడుతుంటాయి. అవేమిటంటే...

►ఇప్పటికే జబ్బు కారణంగా రోగి శరీరమెంతో కృశించి పోయి ఉంది. ఇలాంటప్పుడు చికిత్స (ఉదాహరణకు కీమోథెరపీలాంటివి) ఇచ్చి అతడిని మరింత కుంగిపోయేలా చేయవచ్చా? దాంతో అతడి జీవితం (పెర్‌ఫార్మెన్స్‌ స్టేటస్‌) బాగుపడేదెంత?
►అమ్మో... ఈ చికిత్స తీవ్రతను రోగి శరీరం తట్టుకోలేదేమో అంటూ అతడికి చికిత్స ఇవ్వకుండా ఉంచడం ఏ మేరకు సరైనది అంటూ కొందరికి చికిత్స అందించడం కంటే అలా వదిలేయడమే మంచిదంటారు. కానీ ►అందరిలాగే అతడికీ ఓ జబ్బులేని జీవితం, సుదీర్ఘకాలం బతికే అవకాశం ఇవ్వద్దా?
ఈ ప్రశ్నలకు మనమే అంటే మన భారతీయ సైంటిస్టులే ప్రపంచానికి ఓ జవాబు చెబుతున్నారు. అనాదిగా మనకు తెలిసిన విజ్ఞానాన్ని ఉపయోగించి ‘మెట్రానామిక్స్‌ థెరపీ’ ద్వారా పై సందేహాలకు సమాధానం చెబుతున్నారు.

 క్యాన్సర్‌ చికిత్సలో కొత్తవెలుగు
ఒకరికి క్యాన్సర్‌ వ్యాధి ఉంది. సాధారణంగా క్యాన్సర్‌ వ్యాధుల్లో అది ఏ మేరకు పాకింది, దాని తీవ్రత ఎంత అన్న అంశం ఆధారంగా స్టేజ్‌–1, స్టేజ్‌–2, స్టేట్‌–3, స్టేజ్‌–4 అని నాలుగు దశలుగా విభజిస్తారన్న విషయం తెలిసిందే. సాధారణంగా స్టేజ్‌–1, స్టేజ్‌–2 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తారు. స్టేజ్‌–3, స్టేజ్‌–4 ఉన్నవారిలో వ్యాధి ముదిరిందనీ, చికిత్స ఇవ్వడం కంటే అలా వదిలేయడమే మంచిదని చాలా సందర్భాల్లో అంటుంటారు. అంటే వారికి చికిత్స ఇవ్వడంలోని బాధలు భరిస్తూ... జీవితాన్ని కొనసాగించడం కంటే... ఆ జీవించి ఉన్న కాలంలోనే అలాంటి బాధలేమీ లేకుండా హాయిగా బతికితే మంచిదంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ ఇలాంటి వారికీ ఒక్కోసారి జీవితాన్ని పొడిగిస్తే అది మంచి పరిణామానికి దారితీసే అవకాశాలు ఉండవచ్చు. ఉదాహరణకు బాధాకరమైన చికిత్స ఇవ్వడం ద్వారా ఒకరి జీవితాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే పొడిగించే అవకాశం ఉందనుకుందాం.

అలా చేయకపోతే ఏ మూడు నుంచి నాలుగు నెలలు ఎలాంటి బాధా లేకుండా జీవింవచ్చనుకుందాం. అలాంటప్పుడు ఆ అదనపు మూడు నెలల జీవితకాలం కోసం ఆ ప్రాణిని అంతగా బాధపెట్టాలా అన్న భావన చాలామందిలో రావచ్చు. కానీ వైద్యవిజ్ఞానంలో చాలావేగంగా ఇప్పుడు చోటు చేసుకుంటున్న పురోగతి కారణంగా మూడు నెలల చికిత్స తర్వాత ఆ వ్యక్తి మరో మూడు నెలలు అదనంగా బతికిడానుకోండి. ఆ వ్యవధిలో మరేదైనా పురోభివృద్ధి కారణంగా మరో అద్భుతమైన ఔషధమో, ప్రక్రియో అందుబాటులోకి వస్తే ఆ రోగి జీవితకాలాన్ని మరిన్ని ఏళ్లు పొడిగించే అవకాశం దొరుకుతుంది కదా అన్నది ఓ భావన. దానికి ఉపయోగపడేదే ఈ మెట్రానమిక్స్‌ థెరపీ.

మెట్రానమిక్స్‌ థెరపీ అంటే...
ఇందులో కీమోథెరపీకి ఇచ్చే మందులనే... వాటి దుష్ప్రభావాలు పడనంతటి చిన్న చిన్న మోతాదుల్లో ఇస్తారు. ఇలా చిన్న చిన్న మోతాదుల్లో ఇవ్వడం అన్నది దానికోసం ఇచ్చే సాధారణ షెడ్యూల్‌కు అనుగుణంగా కాకుండా చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ ఉంటారు. దీని ప్రభావం కేవలం క్యాన్సర్‌ కణం మీద మాత్రమే గాక... ఆ క్యాన్సర్‌ కణాలుండే ప్రాంతపు పరిసరాల (మైక్రో ఎన్విరాన్‌మెంట్‌) మీద కూడా పడుతుంది. దాంతో ఈ మందు అక్కడి ఎండోథీలియన్‌ కణజాలం మీద కూడా పనిచేస్తూ అక్కడ యాంటీ–యాంజియోజెనిక్‌ ప్రభావం చూపుతుంది. అంటే... ఉదాహరణకు ఎండోథీలియమ్‌ అంటే ఒక రక్తనాళమో ఏదైనా పైప్‌లాంటిదో ఉందనుకోండి.

అలాంటి దానికింద ఏర్పడే ఒక పొరలాంటిది అనుకోవచ్చు. ఏదైనా క్యాన్సర్‌ కణం... పొరుగునున్న కణజాలం కంటే ఎక్కువ ఆహారాన్ని లాక్కోవడం కోసం కొత్త కొత్త రక్తనాళాలను పుట్టించుకుంటూ... ఆ కొత్త రక్తనాళమార్గాల ద్వారా మరింత ఆహారాన్ని, పోషకాలను గ్రహిస్తుంటాయి. ఈ చిన్నమోతాదుల్లో ఇచ్చే మందులు ఆ యాంజియోజెనిక్‌ ప్రక్రియను ఆపేయడం ద్వారా కొత్త రక్తనాళాలు పుట్టడానికి ఆస్కారమివ్వవు. ఇలా కొత్తరక్తనాళాలను పుట్టనివ్వని ప్రక్రియనే ‘యాంటీ–యాంజియోజెనిక్‌’ ప్రభావంగా చెప్పవచ్చు. ఈ మెట్రానమిక్‌ థెరపీలో వాడే మందులు కేవలం యాంటీ–యాంజియోజెనిసిస్‌ను మాత్రమేగాక చాలావరకు రోగిలోని రోగనిరోధక శక్తిని పెంచే పనిని కూడా చేస్తుంటాయి. ఈ ఇమ్యునలాజికల్‌ యాక్షన్‌ వల్ల రోగిలో క్యాన్సర్‌ వ్రణం క్రమంగా తన తీవ్రతను తగ్గించుకుంటూ పోతుంటుంది.

ఇలాంటి సమయంలో ఈ మెట్రానమిక్‌ థెరపీలో వాడే మందులకు తోడుగా... నిర్దిష్టంగా కణాన్నే లక్ష్యంగా ఎంచుకుని తుదముట్టించే టార్గెట్‌ థెరపీ మందులనూ, రోగనిరోధక శక్తిని పెంచే మందులనూ కలిపి ఇవ్వడం ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. గత పదిహేనేళ్ల వ్యవధిలో చాలా రకాల క్యాన్సర్లకు ఇవ్వాల్సిన మెట్రానమిక్‌థెరపీ మీద చాలా అధ్యయనాలే జరిగాయి. అయితే దురదృష్టవశాత్తు... ఒక మందు తాలూకు ప్రభావాన్ని నిర్ణయించే రెండు అంశాలైన... అంతర్గత అవయవాల కార్యకలాపాలు (ఫిజియలాజికల్‌ స్టేటస్‌), రోగి ఎంతగా బాగున్నాడు (ఫిట్‌నెస్‌) అనేవి అంతగా మెరుగ్గా కనిపించలేదు.

దుష్ప్రభావాలూ దాదాపుగా ఉండవు...
అయితే మెట్రానమిక్‌ థెరపీలో వాడే మందుల మోతాదు చాలా స్వల్పం కావడం వల్ల వాటి దుష్ప్రభావాలు (సైడ్‌ఎఫెక్ట్స్‌) సైతం చాలా తక్కువగా ఉండటం లేదా అస్సలు లేకపోవడం జరుగుతుంది. ఇలాంటి మందులకు ఆమోదం (ఎథికల్‌ అప్రూవల్స్‌) లభించిన తర్వాత కొందరు యువ సైంటిస్టులు వాటిని రోగుల మీద ప్రయోగించి చూశారు. దాంతో అంతకుముందు తప్పనిసరిగా మరణిస్తారని భావించిన రోగుల్లో దాదాపు 29% మంది తాలూకు జీవితకాలం పెరిగింది. దాంతో వారి ఆయుష్షును పొడిగించినట్లయ్యింది. ఈ రోగుల్లో కొందరైతే వారు బతుకుతారనుకున్న దానికంటే దాదాపు 489 రోజులు అదనంగా జీవించారు. అది కూడా మంచి నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తూ! అందువల్ల పైన పేర్కొన్న రెండంశాలలో ఒక అంశం మాత్రం పూర్తిగా సాధించినట్లయ్యింది.

అది కూడా ఎలాంటి తీవ్రమైన చికిత్సా ఇవ్వకుండానే. ఇక దీని విశిష్టత ఏమిటంటే... సాధారణంగా కీమోలో కనిపించే ఎలాంటి అసౌకర్యాలూ, ఇబ్బందులూ ఉండవు. ఈ మందు వాడిన ప్రతి 10 మందిలో ముగ్గురి జీవనం అలా స్థిరంగా గడవడమో లేదా మరింత మెరుగుపడటమో జరిగింది తప్ప మెట్రానమిక్స్‌ వల్ల ఇతర నష్టాలేమీ లేవు. దీని ఆధారంగా రోగి ఏ మేరకు మెరుగుపడే అవకాశం ఉంది, మరెంత కాలం జీవించేందుకు అవకాశం ఉంది... అనే అంశాలను నిర్ణయించేందుకు ఎన్నెన్నో రకాల క్యాన్సర్లలో ఎన్నెన్నో వేర్వేరు లెక్కలను రూపొందించడం జరుగుతోంది. ఈ రకరకాల క్యాన్సర్లలో ప్రోస్టేట్, పెద్దపేగు/మలద్వార (కోలోరెక్టల్‌), రొమ్ము క్యాన్సర్లతో పాటు మెలనోమా వంటి చర్మక్యాన్సర్లపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఈ అధ్యయన కాలాన్ని చాలా కీలకమైన సమయంగా ఎంచాలి. అయితే కొంతమంది వ్యక్తులు క్యాన్సర్‌ రోగులకు కీమో ఇవ్వడం కంటే వారిని అలా ప్రశాంతంగా... ఏ బాధలూ, ఇబ్బందులూ లేకుండా బతికినంత కాలం బతికి చనిపోయేలా చేయడం మంచిదనే శుష్కప్రియాలు చెబుతుంటారు. ఇలాంటి వదంతులూ, వృథాకబుర్లు చెప్పేవారంతా ప్రయోగాత్మకంగా నిర్వహితమవుతున్న ఈ కొత్త ప్రక్రియ గురించి మాట్లాడకుండా ఉంటూ.. తమ పుకార్లను అదుపు చేసుకోవాలనీ, ఈ అధ్యయనాలు ఒక కొలిక్కి వచ్చేవరకు తమ వదంతులకు ఫుల్‌స్టాప్‌ వేయాలంటూ శాస్త్రవేత్తలతో పాటు సైంటిఫిక్‌ కమ్యూనిటీకి చెందిన ఇతర సిబ్బంది ‘‘స్టాప్‌ మిత్‌ స్ప్రెడింగ్‌’’ అంటూ ఆశావాదులంతా పిలుపునిస్తున్నారు.
డాక్టర్‌ ఏవీఎస్‌ సురేశ్, సీనియర్‌ కన్సల్టెంట్,
మెడికల్‌ అండ్‌ హిమటో ఆంకాలజిస్ట్,
సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement