ఆవకు జీఎం ‘చెద’ గండం | General Manager to Crops cultivation for SMI | Sakshi
Sakshi News home page

ఆవకు జీఎం ‘చెద’ గండం

Published Wed, Jul 20 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

ఆవకు జీఎం ‘చెద’ గండం

ఆవకు జీఎం ‘చెద’ గండం

ఎస్‌ఎమ్‌ఐ వంటి ప్రత్యామ్నాయాల వల్ల పంట దిగుబడి హెక్టారుకు నాలుగు టన్నుల వరకు పెరుగుతుందని తెలియదా? ఈ పద్ధతి వ్యాప్తికి బదులుగా వ్యయభరితమైన, హానికరమైన జీఎం ఆవను ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు?  జన్యుమార్పిడి అధిక దిగుబడి ఆవపంటను రైతులు సాగు చేయడాన్ని ఆరేళ్ల క్రితం నిరవధికంగా నిలుపుదల చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దానికి అనుమతించడం తాజాగా వివాదాన్ని రేపు తోంది. జన్యుమార్పిడి శాస్త్ర మద్దతుదార్లు ఈసారి మొన్సాంటోకు భయపడాల్సినదేమీ లేదని, ఈ జన్యు మార్పిడి (జీఎమ్) ఆవను తయారు చేసినది మన ఢిల్లీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలేనని అంటున్నారు. కార్యకర్తలు మాత్రం వివాదాస్పదమైన ఈ సాంకేతికతకు సంబంధించి శాశ్వత ప్రాతిపదికన నియంత్రణ వ్యవ స్థను ఏర్పాటు చేయాలంటూ దానికి విరుద్ధంగా సరి కొత్త ఆధారాలను చూపుతున్నారు.

యూరప్‌లోని చాలా దేశాలు జీఎం పంటల సాగు నుంచి వెనక్కు మళ్లుతు న్నాయి. దీంతో జీఎం పంటల సాగు భారీగా పడి పోయింది. శాస్త్రీయ తనిఖీ లేదా బహిరంగ చర్చ లేకుండా చాలా ఏళ్ల క్రితమే జీఎం సాంకేతికతను వాణిజ్యపరంగా వ్రవేశపెట్టిన అమెరికాలో సైతం జీఎం ఆహార ఉత్పత్తులపై ఆ విషయాన్ని ముద్రించా లనే చర్చ జరుగుతోంది, కనీసం ఒక రాష్ట్రంలో అది జరిగే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో మన దేశంలో జీఎం ఆవ సాగును అనుమతించడం విశేషం.   

 ఇప్పుడు ప్రవేశపెడతామంటున్న జీఎం ఆవ పేరు ‘ధార మస్టర్డ్ హైబ్రిడ్ 11’ లేదా జీఎంహెచ్-11. డాక్టర్ దీపక్ పెంటాల్ నేతృత్వంలో ఢిల్లీ శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు దాదాపు రూ. 100 కోట్ల ప్రజా దనాన్ని ఖర్చు చేశారు. పురుష మొక్కలలో వంధ్య త్వాన్ని ప్రేరేపించేలా ఒక బాక్టీరియా (బర్నాసె) జీన్‌ను చొప్పిస్తారు.
 
 బర్నాసే జన్యువు ప్రభావాన్ని పరిహరించి ఫలదీకరణశక్తిని పునరుద్ధరించడం కోసం మరో బాక్టీ రియా (బార్‌స్తర్)ను చొప్పించి జన్యు మార్పిడి చేసిన మరో జన్మకారక శ్రేణితో, ఆ మగ వంధ్యత్వ జన్యు శ్రేణిని సంకరం చేయడంద్వారా ఈ జన్యు మార్పిడి జరుగుతుంది. జీఎంహెచ్ -11కు జన్మకారకాలైన రెండు శ్రేణులలోనూ కలుపు నాశనులను తట్టుకునే బార్ అనే జీన్ ఉంది. దీనికి కలుపు నివారణులను తట్టుకునే రకంగా గాక సంప్రదాయకమైనదిగా అనిపించేలా  అధిక దిగుబడి వంగడంగా పేరు పెట్టడంలోనే అసలు దగా అంతా ఉంది. పైగా రైతులకు  తామేమీ కలుపు నాశనులను వాడమని సిఫారసు చేయడంలేదని పెంటాల్ బృందం దీన్ని సమర్థించుకుంటోంది. మన దేశంలో క్రిమిసంహారణుల నియంత్రణ ఎంత అధ్వా నమో తెలియంది కాదు. కలుపు నాశనులను తట్టుకునే బీటీ పత్తిని చట్టవిరుద్ధంగా రైతులు సాగు చేస్తూనే ఉన్నా జన్యుమార్పిడి లేదా ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి.
 
 గ్లైసోఫేట్ వంటి కలుపు నాశనుల వల్ల కలిగే క్యాన్సర్ వ్యాధికి గురికావడం వంటి హానికర ప్రభా వాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది, వాటిపై నిషేధాలు పెరుగుతున్నాయి. పైగా జీఎం సాంకేతికత భారీ ఎత్తున శ్రమశక్తి వినియోగాన్ని తగ్గించి మన దేశంలో తీవ్ర సామాజిక-ఆర్థిక దుష్పర్యవసానాలకు కూడా దారి తీస్తుంది. ఈ బహుముఖ దుష్ర్పభావాల కారణంగానే వివిధ కమిటీలు జీఎం ఆవకు పూర్తి వ్యతిరేకంగా పదే పదే సూచనలు చేశాయి.

 అధిక దిగుబడి వంగడాల పేరిట రైతులను ఆకట్టుకునే ఈ డీఎంహెచ్-11 వల్ల పలు ఇతర సమ స్యలు కూడా ఉన్నాయి. వాటిలో పంట దిగుబడులు పడిపోవడం కూడా ఒకటి. రైతులు విత్తనంగా భద్ర పరుచుకునే ఈ ఆవకు కూడా మగ వంధ్యత్వం ఉంటుంది. కాబట్టి సహజంగానే ఆ తదుపరి పంట దిగుబడి తగ్గిపోతుంది. పైగా పంటలో ఒక భాగం కలుపు నాశనులకు దెబ్బతినేది కావడం వల్ల గ్లూఫో సినేట్ వంటి కలుపునాశనులను వాడటంతో ఆ భాగం దెబ్బ తినిపోతుంది. కాబట్టి రైతులు తమ విత్తనాలను వాడితే నష్టపోతారు. లేదంటే  పంట పంటకూ విత్తనాల కోసం బహిర్గత వనరులపై ఆధారపడాల్సి వస్తుంది, విత్తన సార్వభౌమత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వరంగ శాస్త్రవేత్తల ముసుగులోని పేటెంటు  హక్కుదార్లు వాటిని ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికి అమ్ముకుంటారు. ఆ విత్తన ఉత్పత్తిదార్లు విత్తనాల అమ్మ కాలతో పాటూ, రసాయనాల అమ్మకాల ద్వారా కూడా లాభాలు చేసుకుంటారు. ఇక జీఎం ఆహారంవల్ల ఆరో గ్యపరమైన సమస్యలు వ్యాపించాక వాటికి మందులను అమ్ముకుని ఫార్మసీ కంపెనీలు కూడా లాభాలు చేసుకోవచ్చు.
 
 ఇదంతా నూనె గింజల దిగుబడులను, ఉత్పత్తిని పెంపొందింపజేసి వంట నూనెల దిగుమతి వ్యయాలను తగ్గించుకోవడానికేనా? అలాగైతే పైంటాల్ తయారు చేసిన దానితో సహా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆవ అధిక దిగుబడి వంగడాల వల్ల అది ఎందుకు జరగలేదు?  ఆవ సాంద్ర సాగు పద్ధతి (ఎస్‌ఎమ్‌ఐ)వంటి ప్రత్యామ్నా యాల వల్ల పంట దిగుబడి హెక్టారుకు నాలుగు టన్నుల వరకు పెరుగుతుందనే విషయం ప్రభుత్వాలకు తెలియ దునుకోవాలా? ఎస్‌ఎమ్‌ఐ సాగుకోసం రైతులు బయటి వారెవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. దాదా పుగా పెద్ద  పెట్టుబడులను అదనంగా పెట్టాల్సిన పనీ లేదు. కాకపోతే ఉండాల్సింది రాజకీయ సంకల్పం.  

రైతులకు ఆ పద్ధతిని నేర్పించి, అలవాటు చేసే విస్తరణ సేవలను అందించాల్సి ఉంటుంది. అందుకు బదులుగా కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని వృథా చేసి వ్యయభరిత మైన, హానికరమైన జీఎం ఆవను బాధ్యతారహితంగా ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు? మనకు ఎంత మాత్రమూ అవసరంలేని, ఆవశ్యకంకాని, సురక్షితం కాని జీఎం ఆవను గెంటిపారేయాలి. అందుకు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల, వినియోగదారుల పరిరక్షణ కోసం పూను కోవడం ఆవశ్యకం.
 
 వ్యాసకర్త కన్వీనర్, అలయన్స్ ఫర్
 సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆశా)
 ఈమెయిల్ : KavitaKuruganti@gmail.com
 - కవిత కూరుగంటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement