సాక్షి, అమరావతి: వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద ప్రతిబంధకంగా మారారని అధికారులు వాపోయారు. పనిచేసుకునే సమయం ఇస్తే అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించేవారమని వారు చెబుతున్నారు. ఒకపక్క ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉంటే సీఎం నిరంతరం సమీక్షలు చేయడం, నివేదికల కోసం పట్టుబట్టడం, రోజూ రెండు మూడు విడతలు పర్యటనలు చేస్తుండటంతో ప్రొటోకాల్ ప్రకారం కీలక అధికారులు అంతా ఆయన చుట్టూనే ఉండిపోవాల్సి వస్తోందంటున్నారు.
సహాయ కార్యక్రమాలు విఫలం కావడానికి సీఎం తీరే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలన్నది డిజాస్టర్ ప్రోటోకాల్ ఉంటుందని, దాని ప్రకారం జిల్లా కలెక్టర్ నడుచుకుంటే పైనుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తే వ్యవహారం సజావుగా సాగిపోతుందని వరద సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు చెప్పారు.
కానీ సీఎం అసందర్భంగా గంటల కొద్దీ సమీక్షలు, ఉపయోగం లేని పర్యటనలు చేస్తుండటంతో సీఎస్, కలెక్టర్, డీజీపీ, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు ఆయనతోనే ఉండిపోతున్నారని, దీంతో కింది స్థాయి అధికారులకు సరైన సమయంలో మార్గనిర్దేశకత్వం కరువయ్యిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదివారం అర్ధరాత్రి మూడు గంటల వరకు నాలుగు సార్లు ముంపు ప్రాంతాలను సందర్శించడం, అదే విధంగా కలెక్టర్ కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించడంతో అధికారులు తమ విధులను నిర్వర్తించడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రచార యావతో మంగళవారం జేసీబీ మీద 22 కి.మీ చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరగడంతో అధికారులు సహాయ కార్యక్రమాలు వదిలేసి ఆయన చుట్టూ పరుగులు పెట్టాల్సి వచ్చింది.
ఒకరి వెనుక ఒకరు సమీక్షలు
ముఖ్యమంత్రి, మంత్రులు గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తుండటంపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో, సాయంత్రం మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నతాధికారులతో సదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. సీఎం, మంత్రుల సమీక్షలు అవ్వగానే, వాటిపై ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబే కాకుండా మంత్రుల కూడా ముంపు ప్రాంతంలో పర్యటనలకు వెళ్లడంతో వారితో కూడా అధికారులు ఉండాల్సి వచ్చింది. ఇలా అధికారులు సమీక్షలకు, సీఎం, మంత్రులతో పర్యటనలకు పరిమితం అవుతుండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడి మొత్తం వ్యవస్థ కుప్ప కూలింది. కానీ ఆ నెపాన్ని తమపైకి ముఖ్యమంత్రి నెట్టడాన్ని అధికారులు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
గంటల కొద్దీ టెలీ కాన్ఫరెన్స్‌లు
క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా టెలీకాన్ఫరెన్స్‌లు, నివేదికలు అంటూ వేధిస్తుండటంతో సహాయ పునరావాస కార్యక్రమాలు అటకెక్కాయి. వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న సచివాలయాల సిబ్బందితో ఏకంగా రోజుకు ఐదు విడతలు వివిధ స్థాయి అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పావు గంట నుంచి గంట వరకు ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఉండాల్సి వస్తోందని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి తోడు తమకు అప్పగించిన పనికి ప్రతి రెండు మూడు గంటలకొకసారి నివేదికల పేరుతో వివరాల సేకరణ జరుగుతోందని, వీటికే రోజుకు అత్యధిక సమయం సరిపోతోందని పేర్కొన్నారు. ఇలా సమీక్ష సమావేశంలో సిబ్బంది అందరూ ఉంటుండంతో సప్లయ్ చెయిన్ తెగిపోయి ప్రజలకు కనీసం తాగు నీరు కూడా అందించలేకపోయామని ఒక అధికారి వాపోయారు. సరైన కో–ఆర్డినేషన్ లేకపోవడంతో మంచినీళ్లు, పాలు, ఆహార పదార్థాలు పంపిన చోటకే మళ్లీ మళ్లీ పంపించడం జరిగిందని, ఇదే సమయంలో పెద్దఎత్తున ఆహారపదార్థాలు కూడా వృథా అయిపోయాయని అన్నారు.
తప్పును మాపై నెడతారా?
ఐదు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ప్రాణాలకు తెగించి సేవలు అందించడానికి ముందుకు వస్తే.. పని చేయనీయకుండా అడ్డుకొని ప్రజల నుంచి విమర్శలు రావడంతో తప్పును అధికారులపైకి నెట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఓ సీనియర్ అధికారి వాపోయారు. సీఎం చుట్టూ సిబ్బంది, ఫోటో, వీడియో గ్రాఫర్లు, రక్షణగా పోలీసులు, వీరికి అదనంగా చంద్రదండు పేరుతో మరో 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు వస్తున్నారని, వీరందరినీ సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తే బాగుండేదంటూ ఒక అధికారి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండటంతో వారిని సమన్వయం చేసుకుంటూ అధికారులు వేగంగా సహాయాన్ని అందించారని, ఇప్పుడు తెలియని ప్రాంతాలకు అధికారులను పంపడంతో తీవ్రజాప్యం జరుగుతోందని ఆ అధికారి విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment