
వీడియో చూడండి.. టికెట్ కొట్టకండి
పల్లెవెలుగు ఎక్కిన మహిళలు
ఉత్తర్వులు లేవని కండక్టర్ కస్సుబుస్సు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతి మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. బుధవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు.. తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని కండక్టర్‌కు గుర్తుచేశారు. ప్రయాణికులకు టికెట్‌లు కొట్టుకుంటూ వచ్చిన కండక్టర్.. మహిళలను కూడా టికెట్ అడిగారు. ఈ సందర్భంగా వారు.. ‘చంద్రబాబు చెప్పారు. బస్సులో ప్రయాణం ఉచితమని.
టికెట్ అడిగితే చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పమన్నారు’ అని సమాధానమిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. అదేవిధంగా చంద్రబాబు వేషధారణలో ఓ వ్యక్తి కండక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ‘‘నేను చెబుతున్నాను.. నా ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చెయ్యవచ్చు’’ అని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక కండక్టర్.. బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు.
ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ స్పష్టం చేశారు. దీంతో కండక్టర్, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కండక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనల మేరకు డ్రైవర్ బస్సును నేరుగా ఎస్వీ యూనివర్సిటీ స్టేషన్‌కు తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేశారు. వీరికి వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్‌సీపీ నగర, మహిళా విభాగం అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, గీతాయాదవ్ సంఘీభావం తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment