
‘గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఫరెగ్జాంపుల్ ‘ఒక పని’ చేయడం వల్ల వాస్తవంగా దక్కే ప్రయోజనం పది రూపాయలు ఉన్నదనుకోండి.. అక్కడ ఓ వెయ్యిరూపాయల లాభం రాబోతున్నట్టుగా పదేపదే టముకు వేయడం, ప్రచారం చేసుకోవడం లాంటిదన్నమాట.
వాస్తవం ఏంటంటే.. ఆ పని ఇంకా మొదలు కాదు కూడా! కానీ, ఆ పని చేయగానే వెయ్యి రూపాయలు లాభం తనకు రాబోతున్నట్టుగా.. ఒక వ్యక్తి బీభత్సంగా ప్రచారం చేసుకుని.. లాభాలను ప్రొజెక్టు చేసి, ఓ అయిదువందల రూపాయల అప్పులు పుట్టించాడనుకోండి. ఆ అయిదువందల రూపాయలతో చిన్న వ్యాపారం చేసి ఓ రెండొందల లాభాలు ఆర్జించాడనుకోండి. అతనివద్ద నికరంగా రెండొందల రూపాయలైతే ఉంటాయి. కానీ, దీనంతటికీ మూలం అయిన ‘ఒక పని’ అనేది జరిగిందో లేదో, అన్నట్టుగా వెయ్యిరూపాయల లాభం వచ్చిందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి మేధావిని, ఈ టెక్నిక్కులను ఏమనాలి? వీటినే గజకర్ణ, గోకర్ణ టక్కుటమార విద్యలు అని అంటారు. కేవలం మార్కెటింగ్ మాయాజాలంతో బాహ్య ప్రపంచాన్నంతా ఒక మాయలో ఉంచి.. నడిపించే దందా అన్నమాట. వాస్తవాలు వేరే ఉంటాయి.. వాటి ద్వారా పొందే ప్రయోజనాలు వేరే ఉంటాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో అనుసరిస్తున్న వైఖరి.. ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలనే తలపిస్తోంది. కాస్త లోతుగా గమనించండి. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు వస్తోన్నదంటే.. వారు పెట్టే పెట్టుబడుల గురించి, కల్పించబోయే ఉద్యోగావకాశాల గురించి గోరంతలను కొండంతలుగా పెంచి చూపిస్తూ.. కొన్ని వందలసార్లు తమ అనుకూల మీడియాలో వార్తలు వేయించుకుంటూ.. తప్పుడు ప్రచారాలు సాగించడం చంద్రబాబు స్టయిల్! చిన్న సంస్థ వస్తున్నా సరే.. ఇన్ని వందల కోట్లు పెడుతున్నారు.. ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అని నారా తండ్రీ కొడుకులు పదేపదే చెబుతూ ప్రజల్ని మాయ చేస్తుంటారు.
రెండు ఉదాహరణలు తీసుకుందాం. విశాఖలో గూగుల్ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు. దీనిద్వారా రాష్ట్ర యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణలు అందుతాయని అంటున్నారు. అలా జరిగితే మంచిదే. అయితే గూగుల్‌ను తీసుకురావడం.. ఓ మహాద్భుతం అని చెప్పుకునే పాలకులు.. గూగుల్ మన రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నదని, మన డబ్బులనే వారికి చెల్లిస్తున్నాం తప్ప.. వారు తమ సంస్థ డబ్బు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి రూపంలో పెట్టడం లేదు.. ఇక్కడ వారేమీ వందల వేల ఉద్యోగాలు ఇవ్వబోవడం లేదు.. అనేది దాచిపెడుతున్నారు. అయితే యువతరానికి నైపుణ్యాల ముసుగులో.. ఖజానా నుంచి రాచమార్గంలో దోచిపెడతారు.
ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అవసరమే. కానీ.. వాటిని పరిమితంగా ప్రారంభించి.. గూగుల్ కు దోచిపెట్టే డబ్బును.. సొంత నైపుణ్యాలు, సొంత ఆలోచనలు కలిగి ఉన్న యువతరానికి ఉచితంగా పెట్టుబడులుగా సమకూరిస్తే యువతరం మరింతగా బాగుపడుతుంది కదా.. అనే ఆలోచన ప్రభుత్వం వారు చేయరు. యువతరం కోసం అంటూ గూగుల్ కు వందల కోట్ల రూపాయలు సమర్పించుకోడానికి సిద్ధపడతారే తప్ప.. నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీని పట్టించుకోరు. ఇదంతా వంచన కాక మరేమిటి?.
బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందాలు కూడా ఇంచుమించు ఇలాంటివే. గేట్స్‌తో నలభై నిమిషాలు కూర్చోవడమే తన జీవితానికి అత్యున్నత విజయం అయినట్టుగా చాటుకుంటున్నారు చంద్రబాబునాయుడు. కానీ ఏం సాధించారు. ఈ ఒప్పందాల మర్మం ఏమిటి? అనేక రంగాలను జాబితాగా ప్రకటించి.. గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది అని చెప్పేశారు. ఎన్ని వేల కోట్లు గేట్స్ ఫౌండేషన్ ఏపీకి ఇవ్వనున్నదో స్పష్టంగా చెప్పరు ఎందుకు? ఎందుకంటే.. వారు ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు. వారు ఆల్రెడీ తయారు చేసుకుని ఉన్న సాంకేతికతలను ఏపీ కోసం వాడుకోవడానికి వారికి రాష్ట్రప్రభుత్వమే వందల కోట్లు ముట్టజెప్పడానికి సిద్ధపడుతూ ఒప్పందాలు చేసుకుంటున్నదేమోనని ప్రజల అనుమానంగా ఉంది. ఆధునికత, సాంకేతికత, ఏఐ వంటి మాయాపూరితమైన పదాల ముసుగులో పది రూపాయల ఖర్చయ్యే వ్యవహారాలకు పదివేల రూపాయలు ముట్జజెప్పినా.. అది సామాన్యులకు బోధపడేసరికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది.
పాలన అవకాశం దక్కింది కదా అని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తాను ఏ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారో వాటిని పట్టించుకోకుండా.. ఇలాంటి దొంగ చాటు దందాలు నడిపించడం ప్రజలను మోసం చేయడమేనని, ఇవే సంస్థల నుంచి పెట్టుబడుల రూపంలో, ఉద్యోగాల రూపంలో రాష్ట్రానికి ఏమైనా సాధిస్తే మాత్రమే చంద్రబాబు తన విజయంగా చెప్పుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
..ఎం. రాజేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment